Saturday, September 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వంపై తప్పుడు ప్రచారం

ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం 

- Advertisement -

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

​ కోటి ఎకరాల భూములను ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో పెట్టిందని ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌ ‌అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ ‌వద్ద కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడారు. 3.6 లక్షల ఎకరాల ప్రయివేటు, కోర్టు కేసులు, తగాదాలు, వివాదాలు ఉన్న భూములు మాత్రమే నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలియదా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ‌నేతలు నోక్కేసిన భూములు ప్రభుత్వం వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. రైతుల భూములు రైతులకు చెందాలనేది ప్రజాపాలన సంకల్పమన్నారు. తమరు బెదిరించి బదలాయించుకున్న భూముల లెక్కలు బయటపడ్తాయనే చర్చకు రాకుండా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయనే దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దన్నారు. ఆత్మసాక్షితో బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయాలని, ఎవరు వారిని తోసేసారో వాళ్లకు తెలుసన్నారు.

​దళిత వ్యతిరేక పార్టీకి నూకలు చెల్లాయి: బల్మూరి వెంకట్‌
​దళిత వ్యతిరేక బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇక నూకలు చెల్లాయని ఎమ్మెల్సీ, ప్రభుత్వవిప్‌ ‌బల్మూ‌రి ‌వెంకట్‌ ‌నర్సింగ్‌ రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌నాయకులు బట్టలు విప్పుకొని అసభ్యంగా ప్రవర్తించారన్నారు. స్పీకర్ కు క్షమాపణ చెప్పకుండా ఫామ్ హౌస్‌‌లో ఇచ్చిన డైరెక్షన్స్ తో అసెంబ్లీ నడవకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా అంశాలపై, 22ఏ పై చర్చ పెడతామని చెప్పినా రావడం లేదన్నారు. 22ఏపై చర్చ జరిగితే హరీశ్‌రావు జడ్చర్లలో, కేటీఆర్ జన్వాడలో, ఇంకా తెలంగాణలో వీళ్లు దోచుకున్న వేల ఎకరాల భూముల లెక్కలు బయటపడతాయని భయపడుతున్నారన్నారు. అసెంబ్లీ ముందు బీఆర్‌ఎస్‌ ‌మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన పరిస్థితికి కేటీఆర్, గంగుల కమలాకర్ కారణమని, ఒక్కసారి ఆ వీడియోలను పరిశీలించాలని సూచించారు. అది మరిచిపోయి కావాలనే కాంగ్రెస్ పార్టీపై ఎన్‌‌హెచ్‌ఆర్‌‌సీలో ఫిర్యాదు చేశారని, ఇప్పటికైనా కేటీఆర్, హరీశ్‌రావు పద్ధతి మార్చుకోవాలని హితవుపలికారు.

​చర్చకు రమ్మంటే, రచ్చ ఎంచుకుంటున్నారు
చర్చకు రమ్మంటే బీఆర్‌ఎస్‌ ‌నేతలు రచ్చ ఎంచుకుంటున్నారని ఎమ్మెల్సీ, ప్రభుత్వవిప్‌ అద్దంకి దయాకర్‌ ‌అన్నారు. చర్చ జరిగితే వారి అవినీతి, అబద్ధాలు బయటపడ్తాయని రచ్చ చేస్తున్నారన్నారు. మహిళా ఎమ్మెల్యేలను పోలీసుల మీదికి నెట్టి రాద్దాంతం చేస్తున్నారన్నారు. మహిళా పోలీసుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన బీఆర్‌ఎస్‌ ‌నాయకులు చిల్లర వేషాలు వేశారన్నారు. కేసీఆర్ చర్చకు రాని బడి దొంగ! అని, చర్చకు రావడానికి చేత కావట్లేదా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చ జరుగకుండా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. మీ పాలనలో వేల కోట్ల విలువైన ప్రజా భూములు ఇతరులకు ఎలా బదిలీ జరిగిందో, దోచుకున్నారో 22ఏ పై చర్చకు వస్తే తెలుస్తుందన్నారు. దళితుల ఆత్మగౌరవంపై దెబ్బకొట్టిన కేసీఆర్ రాజకీయ జీవితంపై దెబ్బకొట్టడమే దళితుల పంతమన్నారు. ఎర్రవల్లిలో సభ పెట్టి మీ రాజకీయ జీవిత అంతానికి నాంది పలుకుతామని హెచ్చరించారు.

​దళితులు చట్టసభల్లో ఉండొద్దనే..
ఫ్లాష్ సర్వే చేయిస్తే, బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ భూమిపై ఉండటానికి వీలు లేదనే విధంగా ఉందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం అన్నారు. దళితులు చట్టసభల్లో ఉండొద్దనే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చేసిన తప్పుల నుంచి పారిపోవడానికే ఎన్‌‌హెచ్‌ఆర్‌‌సీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన సంఘటనను సుమోటోగా తీసుకొని ఎన్‌‌హెచ్‌ఆర్‌‌సీ విచారణ జరపాలన్నారు. ధరణి పేరుతో వాళ్ళు చెరబట్టిన వేలాది ఎకరాల భూముల లెక్కలు బయటకు వస్తాయని, చరిత్ర బట్టబయలు అవుతుందని వారు భయపడుతున్నారన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -