Saturday, September 12, 2026
E-PAPER
Homeజాతీయంబ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం

బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం

- Advertisement -

పూర్తిగా నిలిచిపోయిన బ్యాంకింగ్‌ సేవలు
స్తంభించిన రూ. వేల కోట్ల లావాదేవీలు
ఐదు రోజుల పనివారానికి డిమాండ్‌

దీంతో పోరాటం ఆగ‌దు : బ్యాంకు యూనియ‌న్లు
ఈనెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల
 దేశవ్యాప్త సమ్మెకు పిలుపు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఐదు రోజుల పనివారాన్ని తక్షణమే అమలు చేయడంతోపాటు పెండింగ్‌లో ఉన్న వేతన, పెన్షన్‌ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బియూ) ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు శుక్రవారం సమ్మె చేపట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప‌బ్లిక్ రంగ బ్యాంకులు మూత‌ప‌డ్డాయి. అనేక ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు పూర్తిగా మూతపడగా, మరికొన్ని చోట్ల పాక్షికంగా మాత్రమే పనిచేశాయి. బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బెఫీ), ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఎ), ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (ఏఐబీఒఎ), ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐబీఒఎఫ్‌) త‌దిత‌ర ఏడు బ్యాంకు ఉద్యోగ‌, అధికారుల సంఘాల‌తో కూడిన‌ యూఎఫ్‌బియూ ఆధ్వ‌ర్యంలో చేపట్టిన స‌మ్మె విజ‌య‌వంతమైంది. ఈ సమ్మెలో పబ్లిక్ రంగ బ్యాంకుల్లో ప‌ని చేసే సుమారు ఎనిమిది ల‌క్ష‌ల మంది ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.

సమ్మెలో భాగంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, సభలు నిర్వహించారు. ఉద్యోగులు, అధికారులు బ్యాంకుల ఎదుట, ప్రధాన కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళం, మహారాష్ట్ర, రాజ‌స్థాన్‌, గుజరాత్‌, ఉత్త‌రప్ర‌దేశ్‌, హ‌ర్యానా, హిమాచల్ ప్ర‌దేశ్‌, ఉత్తరాఖండ్‌, ఒడిశా, ప‌శ్చిమ‌బెంగాల్‌, జార్ఖండ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌ణిపూర్‌, త్రిపుర‌, నాగాలాండ్‌, మిజోరం, పంజాబ్‌, అసోం, బీహార్ త‌దిత‌ర రాష్ట్రాల్లోనూ, జ‌మ్మూకాశ్మీర్‌, ల‌ఢక్‌, పుదుచ్చేరి, చండీఘ‌డ్, అండ‌న్‌మాన్ త‌దిత‌ర కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ బ్యాంకుల స‌మ్మె విజ‌య‌వం తమైంది. భోపాల్‌, చెన్నై, విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్‌, రాజ్‌కోట్‌, కోల్‌క‌త్తా, సిలిగురి, ఢిల్లీ, బెంగ‌ళూరు, ముంబయి తదితర నగరాల్లో యూనియన్ల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. సమ్మె కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖల్లో నగదు జమ, ఉపసంహరణ, చెక్కుల స్వీకరణ, క్లియరెన్స్‌, పాస్‌బుక్‌ అప్‌డేట్‌, కేవైసీ సేవలు, లాకర్‌ సేవలు, రుణ దరఖాస్తులు, సంబంధిత ప్రక్రియలు, పెన్షన్‌ సంబంధిత శాఖా సేవలు, బ్యాంకుల బ్యాక్‌ ఆఫీస్‌, పరిపాలనా కార్యకలాపాలు వంటి సేవలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రయివేట్‌ బ్యాంకుల కార్యకలాపాలపైనా సమ్మె ప్రభావం పడింది.

ప్రభుత్వం అంగీకరించకపోవడంతోనే సమ్మె
తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఎ) ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌. వెంకటాచలం తెలిపారు. తమ పట్ల వివక్ష చూపుతున్నారనే భావనతో తీవ్ర అసంతృప్తితో బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అన్ని ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోని ట్రెజ‌రీ ఆప‌రేష‌న్స్ నిలిపివేసిన‌ట్టు చెప్పారు. ప్ర‌తి శ‌నివారాన్ని హాలీడేగా ప్ర‌క‌టించాల‌ని కోరుతూ 2023 డిసెంబ‌ర్‌లో అధికారుల‌కు అభ్య‌ర్థ‌న పత్రాన్ని స‌మ‌ర్పించిన‌ట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీస‌ర్స్ కాన్ఫిడ‌రేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ రూప‌మ్ రాయ్ తెలిపారు. కాగా మధ్యప్రదేశ్‌లో సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపించింది. రాష్ట్రంలోని 8,707 బ్యాంకు శాఖల్లో సుమారు 7,000 శాఖల్లో కార్యకలాపాలు నిలిచిపోయినట్లు బ్యాంకు ఉద్యోగుల సంఘం తెలిపింది. దాదాపు 42 వేల మంది ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొన్నారు. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు వివిధ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ సుమారు రూ.5,500 కోట్ల విలువైన బ్యాంకింగ్‌ లావాదేవీలపై ప్రభావం పడినట్లు మధ్యప్రదేశ్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మోహన్‌కృష్ణ శుక్లా తెలిపారు.

ఐదు రోజుల పనివారమే ప్రధాన డిమాండ్‌
నెలలో అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలనేది బ్యాంకు యూనియన్ల ప్రధాన డిమాండ్‌. 2024 మార్చిలో ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్ (ఐబిఎ)తో కుదిరిన 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో ఈ అంశంపై అంగీకారం కుదిరినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక నోటిఫికేషన్‌ రావాల్సి ఉందని యూనియన్లు చెబుతున్నాయి. ప్రస్తుతం నెలలో మొదటి, మూడో, ఐదో శనివారాల్లో మాత్రమే బ్యాంకులు పనిచేయడం లేదు. పెన్షన్‌ నవీకరణ, పెన్షనర్లందరికీ ఒకే విధమైన డియర్‌నెస్‌ అలవెన్స్ (డిఎ) విధానం, జాతీయ పెన్షన్‌ పథకం (ఎన్‌పిఎస్‌) పరిధిలో ఉన్న ఉద్యోగులకు పాత పెన్షన్‌ పథకం (ఒపిఎస్‌)లోకి మారే అవకాశం కల్పించడం వంటి ఇతర పెండింగ్‌ డిమాండ్లను కూడా పరిష్కరించాలని యూనియన్లు కోరుతు న్నాయి. బ్యాంకు అధికారులకు అమలు చేస్తున్న పనితీరు ఆధారిత ప్రోత్సాహక విధానం (పెర్ఫార్మెన్స్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌-పిఎల్‌ఐ) నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు, అధికారులు డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న విధానాలను నిలిపివేయాలని కోరారు. బ్యాంకింగ్‌ రంగంలోని ఉద్యోగులు, అధికారుల సమస్యలను పరిష్కరిం చడంతోపాటు వారి హక్కులను పరిరక్షిం చాలని డిమాండ్‌ చేశారు.

దీంతో పోరాటం ఆగ‌దు
సెప్టెంబరు 11 సమ్మెతో పోరాటం ఆగ‌ద‌ని, దాన్ని కొన‌సాగిస్తామ‌ని బ్యాంకు యూనియన్లు స్పష్టం చేశాయి. సెప్టెంబరు 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు కూడా పిలుపునిచ్చినట్లు తెలిపాయి. ఆ తేదీలు బ్యాంకుల అర్ధవార్షిక ముగింపు కాలానికి దగ్గరగా ఉండటంతో, ఆ సమయంలో సమ్మె జరిగితే బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాకుండా అక్టోబరు 26 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లే హెచ్చరిక కూడా యూనియన్ల నుంచి వెలువడింది. ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు యూనియన్లతో చర్చించి పరిష్కారం కనుగొనకపోతే రానున్న రోజుల్లో మరింత విస్తృత నిరసనలకు దారితీసే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -