
నవతెలంగాణ -తాడ్వాయి : ఆదివాసి హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసి తెగల సమ్మేళనం ఫిబ్రవరి 11 న మేడారం కేంద్రంగా ఆదివాసి సంఘాలు, రాజకీయ పార్టీలు అతీతంగా జాతీయ ఆదివాసి తెగల సమ్మేళనం నిర్వహించనున్నట్లు తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు చింత క్రిష్ణ తెలిపారు. మేడారంలో విలేకరులతో మాట్లాడుతూ ఆదివాసీ తెగల సమ్మేళనానికి భారతదేశంలోని నలుమూలల నుండి వివిధ జాతుల నాయకులు హాజరవుతారని తెలియజేస్త ఈ సమ్మేళనం ఆనవాయితీగా రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి తెగల పెద్దలు,నాయకులు కలిసి ఆదివాసి ప్రాంతాలలో ఉన్న సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. భారత రాజ్యాంగంలోని ఐదవ,ఆరవ షెడ్యూల్డ్ లోని భూమి పరిరక్షణ చట్టం, పెసా చట్టం, అటవీ హక్కుల గుర్తింపు చట్టం, స్థానిక అభ్యర్థులకే ఉద్యోగ కల్పన చేయాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వాలకు విన్నవించడం జరుగుతుందని పేర్కొన్నారు. అట్లాగే పూర్వం భారతదేశం ఆదిమ జాతుల ఆధీనంలో నగరాల అభివృద్ధి సంస్కృతి, సాంప్రదాయాలు విరజిల్లుతుండేవి అని, జాతుల సంపదపై కన్నేసిన ఆర్యులు అరబ్బులు దండయాత్రలు చేసి రాజ్యాలను అంతం చేసినారని అన్నారు. తదనంతరం తమ రాజ్యాలను ఆర్యులు ఆక్రమించుకొని జాతులను అడవులకు పారదోలారు. ఇలా గొండ్వాణ భూభాగంలోని ఆదిమ జాతుల రాజ్యాలు సుమారుగా 500 సంవత్సరాల పాటు ఆదివాసి తెగల స్వతంత్ర రాజ్యాలు కలిగి పరిపాలన చేశారని తెలిపారు. క్రమంగా రాజ్యాలను కోల్పోవడం జరిగిందన్నారు. ఆసియా ఖండంలోనే ఆదివాసి జాతరైన సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని మేడారం ఆదివాసిల రాజధానిగా ప్రకటించుకొని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దేశంలో,రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలపై ఆదివాసీ సంస్కృతి,సాంప్రదాయాలు కాపాడుకొనుటకు ఆదివాసి తెగల సమ్మేళనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలవేల్పులైన సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో ఆదివాసి సంఘాలు, రాజకీయ పార్టీలకతీతంగా ఆదివాసి సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించేందుకు ఒక వేదికగా భారతదేశం లోని తెగలతో ఐక్య ఉద్యమాలు చేయటానికి ఈ సమ్మేళనం ద్వారా పిలుపునిస్తున్నట్లు చింత క్రిష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్, కబ్బాక శ్రావణ్, తుడుందెబ్బ నాయకులు తదితరులు పాల్గొన్నారు.