Saturday, September 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమస్యలు పరిష్కరించరు..పోరాడితే అరెస్టులా?

సమస్యలు పరిష్కరించరు..పోరాడితే అరెస్టులా?

- Advertisement -

కార్మిక వర్గ పోరాటాలపై సర్కార్‌ నిర్భంధం
ముందస్తు అరెస్టలపై 
సీఐటీయూ ఆగ్రహం
16న రాష్ట్ర వ్యాప్త నిరసనలు : జయప్రదానికి ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సమస్యలు పరిష్కరించరు..పోరాడితే అరెస్టులు.. ఇదేం న్యాయం? ప్రజాపాలనలో నిరసనలకు నో ఎంట్రీ అంటే ఎలా? కార్మికుల గొంతు నొక్కుతామంటే కుదరదు..అంటూ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ‌ప్రభుత్వంపై ఆగ్రహం వక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీఎస్‌ ‌రావు, కార్యదర్శులు జె వెంకటేశ్‌, కూరపాటి రమేష్‌, పాలడుగు సుధాకర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న,ఎస్ఎస్ఆర్ఎ ప్రసాద్, రొయ్యల రాజుతో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా భాస్కర్‌ ‌మాట్లాడుతూ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. రెండున్నరేండ్లు గడిచింది..అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు. కార్మికుల్లో ప్రభుత్వం పట్ల పెరిగుతున్న అసంతృప్తితో ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలిపేందుకు హైదరాబాద్‌ ‌వస్తుంటే..వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్భంధించారని చెప్పారు. సంఘాల నాయకులను ముందస్తు గృహ నిర్భంధంలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలనంటే..కార్మికుల గొంతు నొక్కటమేనా? అని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ రెండు నాల్కల ధోరణికి నిరసనగా ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. కలెక్టర్లకు, ఎస్పీలకు వినతి పత్రాలను అందజేయనున్నట్టు తెలిపారు.ప్రభుత్వ నిర్భంధానికి వ్యతిరేకంగా జరిగే సామూహిక దీక్షలకు ప్రజలు, ప్రజాతంత్రవాదులు, ప్రజా సంఘాలు, మేధావులు, ఇతర కార్మిక సంఘాలు మద్దుతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక చర్యలను మానుకోకపోతే..సమర శీల పోరాటాలకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు.
కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన నాటి నుండి హైదరాబాద్ లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్‌‌లో నిరసనలు తెలిపేందుకు అనుమతిని నిరాకరిస్తున్నారని తెలిపారు. పోలీసు అనుమతులను నిరాకరిస్తున్నారన్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో ఆశా, అంగన్ వాడీ వర్కర్లు తమకు ఎన్నికల్లో సందర్భంగా ఇచ్చిన హామీలను, ఇతర సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు నిరసన కార్యక్రమానికి పూనుకుంటే.. మహిళలని కూడా చూడకుండా వారిని అర్థరాత్రి అక్రమంగా ముందస్తు అరెస్టులు చేయడం, గృహ నిర్భంధం చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారని చెప్పారు. ఆర్టీసిలో 2019 డిసెంబర్ నుండి నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్రకటిత నిషేధం విధిస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సుదీర్ఘకాలం కొనసాగించిందని గుర్తు చేశారు. ఆర్టీసిలో రిటైరయిన కార్మికుల బకాయిలు చెల్లించాలని ఆందోళనలు చేస్తే వృద్ధులని కూడా చూడకుండా వందలాది మందిని అరెస్టు చేసి నిర్బంధించారని తెలిపారు.
గత అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా గ్రామ పంచాయతీ, హమాలీ, ట్రాన్స్‌‌పోర్ట్‌, బీడీ, భవన నిర్మాణ కార్మికులు, విద్యుత్ ఆర్టిజన్లు, మున్సిపల్, వీఆర్‌ఏ, యూనివర్సిటీ నాన్‌‌టీచింగ్‌ ఎంప్లాయీస్, ఐ‌కేపీవీఓఏ, మధ్యాహ్న భోజనం, వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డులు తమ సమస్యలను పరిష్కరించాలని అడిగితే..నిర్భంధాన్ని ప్రయోగించారని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఢిల్లీలో సీఎం రేవంత్‌‌రెడ్డి ధర్నాలు నిరసనలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మరి అక్కడ నిరసన..ఇక్కడ నిర్భంధం ఏంటని ప్రశ్నించారు. పోలీసు నిర్భంధం ద్వారా ప్రజా ఉద్యమాలను అణచాలని చూస్తే కుదరదని హెచ్చరించారు. ఇప్పటికైనా కార్మికులకు తాము ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -