అట్రాసిటీ బాధితులకు వెంటనే పరిహారం విడుదల చేయాలి : కేవీపీఎస్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ-ముషీరాబాద్
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు చట్టబద్ధంగా అందాల్సిన ఎక్స్‌గ్రేషియాను మూడేండ్లుగా ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచడంపై కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ పరిహారాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ వద్ద కేవీపీఎస్ గ్రేటర్ హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2025 జులై 30 నాటికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 4,008 మంది బాధితులకు రూ.37.23 కోట్ల ఎక్స్‌గ్రేషియా పెండింగ్‌లో ఉందన్నారు. అనంతరం నమోదైన కేసులతో బాధితుల సంఖ్య సుమారు 4,200కు పెరిగిందని, వారికి దాదాపు రూ.40 కోట్ల పరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చట్టం ప్రకారం కేసు నమోదైన 45 రోజుల్లో బాధితులకు పరిహారం అందించాల్సి ఉన్నప్పటికీ సంవత్సరాల తరబడి ఆర్థిక సహాయాన్ని పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్ష, అంటరానితనం, అమానవీయ దాడులను అరికట్టేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టపరమైన రక్షణలు బాధితులకు సక్రమంగా అందడం లేదన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు అందాల్సిన ప్రోత్సాహకాలను ప్రభుత్వం సకాలంలో అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అట్రాసిటీ బాధితులకు తక్షణమే పరిహారం అందించకపోతే దళితులను సమీకరించి పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కలెక్టరేట్ల వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామన్నారు.
కేవీపీఎస్ నగర కార్యదర్శి బిట్ర సుబ్బారావు మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌లో 335 మంది బాధితులకు రావాల్సిన రూ.35 కోట్ల పెండింగ్ ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోనూ కుల వివక్ష, అంటరానితనం పరోక్ష రూపాల్లో కొనసాగుతున్నాయని, ఇల్లు అద్దెకు తీసుకునేందుకు వెళ్లినప్పుడు కులం అడిగి నిరాకరిస్తున్న ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నగర నాయకులు కిషన్, అర్జున్, ఆంజనేయులు, మాధవ్, కృష్ణ, భీమ్, రేఖ, ఆశ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ ఎక్స్‌గ్రేషియా ఎప్పుడిస్తారు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


