Friday, April 24, 2026
E-PAPER
Homeజాతీయంమోడీ, షా తీరులో హిట్లర్‌ ముద్రలు

మోడీ, షా తీరులో హిట్లర్‌ ముద్రలు

- Advertisement -

– హిందూత్వ వ్యూహంలో ‘సర్‌’ భాగస్వామి
– జట్టులో చేరిన రిఫరీలా సీఈసీ
– నియోజకవర్గాల పునర్విభజన ఓ రాజకీయ కుతంత్రం
– బెంగాల్‌లో లెఫ్ట్‌ఫ్రంట్‌ తన బలాన్ని ప్రదర్శిస్తుంది : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
కోల్‌కతా :
బీజేపీ ప్రణాళికలలో నియంత హిట్లర్‌ ముద్రలు కన్పిస్తున్నాయని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల రిజిస్టర్‌ (ఎన్నార్సీ) యత్నాలను ఆయన నాజీ జర్మనీతో పోల్చారు. ఫాసిస్టు, మెజారిటీవాద హిందూత్వ దేశాన్ని ఏర్పాటు చేసేందుకు సీఏఏ, ఎన్నార్సీ, జనగణన ప్రక్రియ, ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (సర్‌), నియోజకవర్గాల పునర్విభజనలను ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఉపయోగించుకుంటున్న తీరులో హిట్లర్‌ నేతృత్వంలోని జర్మనీ ముద్రలు కన్పిస్తున్నా యని ఆయన విమర్శించారు. కోల్‌కతాలోని ముజ్‌ఫర్‌ అహ్మద్‌ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బేబీ మాట్లాడుతూ ‘ఇది మనకు జర్మనీని గుర్తు చేస్తోంది. 1935వ సంవత్సరం సెప్టెంబరులో న్యూరెంబర్గ్‌ చట్టా లను తీసుకొచ్చారు. వాటి ఉద్దేశమేమిటి? ఆర్యుల జాతి స్వచ్ఛతను పరిరక్షించే పేరుతో ఇతరులను… ముఖ్యంగా యూదులను పౌరులు కానివారుగా ప్రకటించారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. 1933లో హిట్లర్‌ అధికారంలోకి వచ్చారు. 1935లో న్యూరెంబర్గ్‌ చట్టాలు అమలులోకి వచ్చాయి. మోడీ, అమిత్‌ షా ఇప్పుడు చేస్తున్నది హిట్లర్‌ నాటి జర్మనీకి నకలు వంటిదే’ అని వివరించారు.

నియోజకవర్గాల పునర్విభజన ద్వారా బీజేపీ తమకు అనుకూలంగా, ప్రత్యర్థులకు నష్టం కలిగేలా వాటి సరి హద్దులను అశాస్త్రీయంగా మార్చాలని చూస్తోందని, ఇది ఒక రాజకీయ కుతంత్రమని చెప్పారు. కేంద్రంలో అధికా రంలో ఉన్న పార్టీ ఇప్పటికే జమ్మూకాశ్మీర్‌, అస్సాంలలో దీనిని పాక్షికంగా అమలు చేస్తోందని తెలిపారు. ఇప్పుడు దేశమంతటా అమలు చేయాలని చూస్తోందని అన్నారు. ‘తనకున్న భారీమెజారిటీని ఉపయోగించుకొని తనకు న చ్చిన విధంగా హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాల న్నది బీజేపీ ప్రణాళిక. లోక్‌సభ సీట్లసంఖ్య 850కి పెంచా లనుకోవడం వెనుకున్న ఎత్తుగడఇదే’అని ఆరోపించారు.

మోడీ కుతంత్రాలలో జ్ఞానేశ్‌ భాగస్వామి
మోడీ కుతంత్రాలలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ భాగమయ్యారని బేబీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ తటస్థ రాజ్యాంగ సంస్థ అధిపతి మాదిరిగా కాకుండా జట్టులో చేరిన రిఫరీలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘కేంద్రంలోని అధికార పార్టీకి మద్దతుగా జ్ఞానేశ్‌ కుమార్‌ తన పదవిని వినియోగిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఇది స్పష్టంగా కన్పిస్తోంది. ఇతర రాష్ట్రాలలో మాదిరిగా కాకుండా ఇక్కడ ఇక్కడ ఓ ప్రత్యేక వర్గంపై అనుమానాలు వ్యక్తం కావడం పట్ల సుప్రీంకోర్టు సైతం ఆశ్చర్యం వెలిబుచ్చింది. ఇతర రాష్ట్రాలలో లేని విధం గా బెంగాల్‌లో ఇది అసాధారణమైన, కలవర పాటు కు గురిచేసే, భయాందోళనలు కలిగించే పరిస్థితి’ అని అన్నారు. మోడీ, అమిత్‌షా, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ విద్వేష పూరిత ప్రసంగాలపై ఎన్నికల సంఘం మౌనం వహించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

విశ్వసనీయత కోల్పోతున్న బీజేపీ, టీఎంసీ
బీజేపీ, టీఎంసీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతున్నా యని బేబీ విమర్శించారు. బీజేపీ ప్రాజెక్టు ప్రజల్లో క్రమంగా విశ్వసనీయతను కోల్పోతోందని చెప్పారు. పెరుగుతున్న నిరుద్యోగం, తగ్గిపోతున్న ఉద్యోగ అవకాశాలు, గత రెండేళ్లలో దాదాపు ఎనిమిది లక్షలమంది బడి మానేయడం, మహిళలపై అసమానంగా ప్రభావం చూపేలా భారం మోపేలా పన్నులు విధించడం, సాధారణ విషయాల కోసం కూడా ప్రజలను పార్టీ కార్యాలయాలను ఆశ్రయించేలా బలవంతం చేసే పద్ధతి వంటివి పశ్చిమ బెంగాల్‌లో ప్రజాగ్రహాన్ని మరింత పెంచాయని తెలిపారు. టీఎంసీ తన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని చెప్పారు. ఉపాధ్యాయుల నియామకాల్లో భారీ అవినీతి ఆరోపణలు, రేషన్‌ పంపిణీ పేరుతో దోపిడీ, వాగ్దానాలకు, ఆచరణకు మధ్య నిరంతరం అంతరం కొనసాగడం వంటివి దాని విశ్వసనీయతను దెబ్బతీశాయని చెప్పారు.

లెఫ్ట్‌ఫ్రంట్‌ బలాన్ని ప్రదర్శిస్తుంది
విమర్శకులు ఆశ్చర్యపోయేలా మంచి విజయాన్ని లెఫ్ట్‌ఫ్రంట్‌ సాధిస్తుందని బేబీ అన్నారు. అసెంబ్లీలో గణనీయమైన ఉనికిని కలిగి ఉంటుందని, తన బలాన్ని ప్రదర్శిస్తుందని తెలిపారు. బీజేపీ, టీఎంసీ కూటముల వైఫల్యాల నడుమ పశ్చిమ బెంగాల్‌ సామాజిక, ఆర్థిక రంగంలో లెఫ్ట్‌ఫ్రంట్‌ పునరావిర్భావం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని ఆయన తెలిపారు. టీఎంసీకి వెలుపల ఉన్న పార్టీలతోసహా ప్రతిపక్ష శక్తుల మధ్య విస్తృత ఐక్యతను పెంపొందించడం ద్వారా విశ్వసనీయమైన ప్రత్యామ్నాయాన్ని అందించేందుకు లెఫ్ట్‌ఫ్రంట్‌ కృషి చేస్తోందని ఆయన తెలిపారు. బెంగాల్‌లో లెఫ్ట్‌ఫ్రంట్‌ పునరుజ్జీవనాన్ని సాధిస్తుందన్న నమ్మకంతోపాటు ప్రత్యామ్నాయ పాలనా నమూనాను ముందుకు తీసుకెళ్తున్న కేరళ నుంచి ప్రజలు నిరంతరం స్ఫూర్తి పొందుతున్నారని బేబీ తెలిపారు. కేరళలో వరుసగా మూడోసారి చారిత్రాత్మక విజయాన్ని సాధించే స్థితిలో ఎల్‌డీఎఫ్‌ పటిష్టంగా ఉందని చెప్పారు. మీడియా సమావేశంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు సమీక్‌ లహిరి పాల్గొన్నారు.

బెంగాల్‌ ఎన్నికలు అసాధారణం
బెంగాల్‌లో నిర్వహిస్తున్న ఎన్నికలు స్వతంత్ర భారత చరిత్రలోనే అసాధారణమైనవని బేబీ అన్నారు. ఒక సమాజానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని ఓటు హక్కు వినియోగించు కోకుండా చేయడానికి హిందూత్వ ఎత్తుగడలో సర్‌ భాగస్వామి అయిందని విమర్శించారు. ‘మారుమూల ప్రాంతాలకు చెందిన పేద ప్రజలకు ఓటు హక్కు విలువ తెలుసు. అందుకే వారు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి నిలబడతారు. ఓటర్ల హక్కులు, పౌరసత్వం విషయంలో మోడీ, ఆయన బృందం చర్యలను సీఏఏ, ఎన్నార్సీ, జనాభా లెక్కల ప్రక్రియ, సర్‌ నేపథ్యంలో చూడాల్సి ఉంది. ఇది ఓటర్ల జాబితాల నుంచి ప్రత్యేక విస్తృత తొలగింపు (సర్‌) తప్ప మరేమీ కాదు’ అని బేబీ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -