Friday, April 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచరిత్రలోనే అతిపెద్ద ఇంధన భద్రతా ముప్పు

చరిత్రలోనే అతిపెద్ద ఇంధన భద్రతా ముప్పు

- Advertisement -

ప్రపంచం ముందు సవాళ్లు : ఐఈఏ చీఫ్‌
జెనీవా : ఇంధన భద్రత విషయంలో చరిత్రలోనే అతిపెద్ద ముప్పును ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఫాతిహ్‌ బిరోల్‌ పేర్కొన్నారు. ఇరాన్‌, అమెరికా – ఇజ్రాయిల్‌ యుద్ధం వల్ల ఇప్పటిదాకా అంతర్జాతీయ మార్కెట్‌ ప్రతిరోజు సగటున 13 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు నష్టపోయిందన్నారు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కీలక సరుకుల సప్లైలోనూ అవాంతరం ఏర్పడిందని ఆయన తెలిపారు. తాజాగా సింగపూర్‌లో జరిగిన ఓ ఇంధన రంగ సదస్సును ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగిస్తూ ఐఈఏ చీఫ్‌ ఫాతిహ్‌ బిరోల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలి
”అమెరికా – ఇరాన్‌ సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, హార్ముజ్‌ జలసంధి మూతపడటం అనే అంశాలు ప్రపంచాన్ని కనీవినీ ఎరుగని అతిపెద్ద ఇంధన సంక్షోభం దిశగా తీసుకెళ్తున్నాయి. ఈ తరుణంలో ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలి. తద్వారా తమ ఆర్థిక స్థితిగతులు గాడి తప్పకుండా కాపాడుకోవాలి. ఈ సంక్షోభం వివిధ విద్యుత్‌ రంగాల దిశగా మారిపోయే ప్రక్రియను గణనీయంగా వేగవంతం చేస్తుంది. తొలుత అణు విద్యుత్‌ రంగం విస్తరించే అవకాశాలు పెరుగుతాయన్నారు.

హర్ముజ్‌ నుంచి తొలి ఆదాయం
హర్ముజ్‌ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్‌ తొలిసారిగా టోల్‌ వసూలు చేసింది. ఈ మేరకు ఇరాన్‌ పార్లమెంట్‌ డిప్యూటీ స్పీకర్‌ హమీద్‌రెజా వెల్లడించారు. టోల్‌ మొత్తం తమ సెంట్రల్‌ బ్యాంక్‌ అకౌంట్‌లో జమ అయినట్టు ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే ఈ టోల్‌ని ఏ దేశపు నౌక నుంచి వసూలు చేశారనే దానిపై స్పష్టత లేదు. గతంలోనే ఇరాన్‌ టోల్‌ ప్రతిపాదనను తీసుకువచ్చింది. టోల్‌ నగదును తమ దేశ పునర్నిర్మాణం కోసం వినియోగిస్తామని కూడా పేర్కొంది. ఇరాన్‌ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం రుసుములు చెల్లిస్తున్న నౌకలను హర్ముజ్‌ని దాటేందుకు అనుమతినిస్తోంది. తాజా గా ఒక ట్యాంకర్‌ జలసంధిని దాటడం కోసం 2మిలియన్‌ డాలర్ల నగదు చెల్లించినట్టు సమాచారం.

ఇరాన్‌ చమురు నౌక సీజ్‌: అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడి
ఇరాన్‌-అమెరికా మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ వరుసగా నౌకలను సీజ్‌ చేస్తున్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల హార్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌కు చెందిన ఓ నౌకను అగ్రరాజ్యం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.తాజాగా హిందూ మహా సముద్రంలోనూ మరో నౌకను అమెరికా సైన్యం సీజ్‌ చేసింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడిం చింది. ‘మేజిస్టిక్‌ ఎక్స్‌’ పేరుతో ఉన్న నౌకను తమ దళాలు స్వాధీనం చేసుకు న్నట్టు అమెరికా ప్రకటించింది. ఆ నౌకలో ఇరాన్‌ చమురును అక్రమంగా తరలిస్తున్నట్టు పేర్కొంది. ”ఇరాన్‌కు సైనిక సాయం అందించే నౌకలను, సముద్ర మార్గంలో అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను మేం అడ్డు కుంటూనే ఉంటాం” అని అమెరికా తమ పోస్ట్‌లో రాసుకొచ్చింది. నౌక సీజ్‌కు సంబంధించిన వీడియోను ‘ఎక్స్‌’ ఖాతాలో విడుదల చేసింది. హెలికాప్టర్ల నుంచి ఈ నౌకపైకి అమెరికా దళాలు దిగుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. షిప్‌ ట్రాకింగ్‌ డేటా ప్రకారం.. ఈ ‘మేజిస్టిక్‌ ఎక్స్‌’ నౌక శ్రీలంక, ఇండోనేసియా మధ్య హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -