కోటాలో భారీ కోతకు ప్రతిపాదన
భారత టెక్ నిపుణులకు గడ్డుకాలమే
వాషింగ్టన్ : అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ టెక్ నిపుణుల ఆశలపై ట్రంప్ ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. రిపబ్లికన్ ఎంపీ ఎలి క్రేన్ ప్రవేశపెట్టిన కొత్త వలస ప్రతిపాదిత బిల్లు ప్రకారం.. అమెరికా ప్రభుత్వం మూడేండ్ల పాటు కొత్త హెచ్-1బీ వీసాల జారీని పూర్తిగా నిలిపివేయనుంది. ఈ విరామం తర్వాత కూడా ప్రస్తుతం ఉన్న 65,000 వీసా కోటాను ఏకంగా 25,000కు తగ్గించాలని భావించింది. లాటరీ విధానాన్ని రద్దు చేసి కేవలం అత్యధిక వేతనం కనీసం 2,00,000 డాలర్లు (రూ.1.6 కోట్లు) ఇచ్చే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని బిల్లు పేర్కొం టోంది. దీనివల్ల అమెరికన్ కంపెనీలు విదేశీయులను నియమించుకోవడం క్లిష్టతరంగా మారనుంది.
ఈ బిల్లు చట్టంగా మారితే భారతీయ ఐటీ నిపుణులకు శాశ్వత నివాస హోదా గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉండదు. విదేశీ గడ్డపై ఒంటరిగా ఉండాల్సి రావడం, గరిష్టంగా మూడేండ్లు మాత్రమే పనిచేసే అవకాశం ఉండటం వల్ల కెరీర్ వృద్ధి దెబ్బతింటుంది. అలాగే కనీస వేతన పరిమితి రూ.1.6 కోట్లుగా ఉండటం వల్ల స్టార్టప్‌లు, మధ్యస్థాయి కంపెనీల్లో భారతీయులకు ఉద్యోగాలు దొరకడం దాదాపు అసాధ్యం అవుతుంది.
ఈ బిల్లు వల్ల భారత్ నుంచి వెళ్లే సామాన్య మధ్యతరగతి నిపుణులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోనున్నారు. ముఖ్యంగా హెచ్-1బీ వీసాదారులు తమ కుటుంబ సభ్యులను (డిపెండెండ్లను) అమెరికాకు తీసుకెళ్లే అవకాశం కోల్పోవడమే కాకుండా.. గ్రీన్ కార్డు పొందే మార్గం కూడా మూసుకుపోనుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులకు లభించే ఓపీటీ సదుపాయం రద్దు కావడం వల్ల, వారు చదువు పూర్తి కాగానే స్వదేశానికి తిరిగి రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ పరిణామం భారత్ వంటి దేశాలకు పెను సవాలుగా మారనుందని నిపుణులు భావిస్తున్నారు. సామాన్య వర్గాల ప్రజలు తమ పిల్లల విదేశీ విద్య కోసం చేసే అప్పులు తీరకముందే ఇలాంటి నిబంధనలు రావడం వారిని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉంది. అమెరికా నుంచి వచ్చే విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోవడమే కాకుండా, ప్రతిభావంతులైన యువతకు అవకాశాలు కుంచించుకుపోయి దేశంలో నిరుద్యోగిత, ఆర్థిక అసమానతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మూడేండ్లు హెచ్1బీ వీసాల నిలిపివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



