Friday, April 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువ్యవసాయంపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు

వ్యవసాయంపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు

- Advertisement -

ఏటేటా బడ్జెట్‌లో నిధుల తగ్గింపు
రైతులకు అవగాహన కల్పించని పాలకులు
బలమైన పోరాటాలతోనే సమస్యలకు పరిష్కారం
‘నవతెలంగాణ’తో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వాలకు సరైన వ్యవసాయ ప్రణాళిక లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏఐకేఎస్‌ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇదో పెద్ద సవాలుగా మారిందన్నారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల పంటల దిగుబడి తగ్గడం, పెట్టుబడి పెరగడం, గిట్టుబాటు ధరలు లభించకపోవడం, ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బందులు వంటి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్‌) రాష్ట్ర తృతీయ మహాసభ గురువారం నుంచి కొత్తగూడెంలో ప్రారంభమవుతుంది. రైతాంగ సమస్యలు – వ్యవసాయ రంగ పరిరక్షణే లక్ష్యంగా ఈ మహాసభలో అనేక నిర్ణయాలు తీసుకుంటామని జూలకంటి రంగారెడ్డి ‘నవతెలంగాణ ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. వివరాలు జూలకంటి మాటల్లోనే..

సాగుపై కేంద్రానికి లోపిస్తున్న చిత్తశుద్ధి
వ్యవసాయ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లోపిస్తోంది. 60 శాతం అధికారాలు ఉన్న కేంద్రం, 40 శాతం అధికారాలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. బడ్జెట్‌లో వ్యవసాయానికి తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఏటేటా నిధులు తగ్గిస్తున్నారు. కేంద్రం ఎరువుల్లో కోత పెడుతోంది. విద్యుత్‌ సంస్కరణలు తెచ్చి పేదలు, రైతులకు రాయితీ లేకుండా చేసే కుట్రలు సాగిస్తోంది. అమెరికా అధ్యక్షులు ట్రంప్‌తో మోడీ వాణిజ్య ఒప్పందం కారణంగా పత్తి, గోధుమలు, మిర్చి.. ఇతరత్రా పంటలు అమ్ముకో లేని స్థితి దాపురించింది. నూతన విత్తన చట్టాన్ని అడ్డుపెట్టుకొని కార్పొరేట్‌ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కల్తీ లేని విత్తనాలు లభించని దుస్థితి నెలకొంది.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం
రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా రైతు డిక్లరేషన్‌ ప్రకటించింది. వాటిలో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు కావడం లేదు. ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతితోనూ భూ సమస్యలు పరిష్కారం కావడం లేదు. పట్టా భూములు అనేకం ఇప్పటికీ నిషేధిత జాబితాలో ఉన్నాయి. సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. భూమి ఉన్న ప్రతి రైతుకూ పట్టాదారు పాస్‌బుక్‌ అత్యంత కీలకం. కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ఐడీ లేకుండా ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల కొనుగోలు, ప్రభుత్వ సహాయం పొందటం, వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించలేని పరిస్థితి. ప్రభుత్వం ఎంజారుమెంట్‌ సర్వే చేసి పట్టాదారు పాస్‌ పుస్తకాలు మంజూరు చేయాలి. దీనిపై ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఈ మహాసభలో నిర్ణయిస్తాం.

ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళిక లేదు
ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వాలకు సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటల సాగును ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. పంటల నిల్వకు సరిపడా సౌకర్యాలు లేకపోవడంతో అధిక ఉత్పత్తి వచ్చినప్పుడు రైతులు నష్టపోతున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న, ధాన్యం విషయంలో ఇబ్బందులను చూస్తున్నాం. నిమ్మ, ఇతర కూరగాయ వంటి పంటల ధరలు కిలో రూ.70 నుంచి రూ.6కు పడిపోతున్నాయి. వ్యవసాయ రంగం బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుని, ప్రయివేట్‌ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తోంది. చైనా వంటి దేశాల్లో ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నారు. దిగుబడులు పెంచేందుకు సరైన మార్గదర్శనం చేస్తున్నారు.

వ్యవసాయ రంగ పరిరక్షణ.. రైతు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా..
వ్యవసాయ రంగ పరిరక్షణ, రైతు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కొత్తగూడెం మహాసభ నిర్వహిస్తున్నాం. గిట్టుబాటు ధరలు, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల అమలు, కార్పొరేట్‌ కంపెనీల నియంత్రణ, కౌలు రైతులను కాపాడటం, వ్యవసాయ కార్మికులకు పని కల్పన.. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ వంటి స్కీంలను కాపాడుకోవటం.. తదితర అనేక అంశాలపై మహాసభ తీర్మానాలు చేస్తుంది. బలమైన రైతు పోరాటాల ద్వారానే వ్యవసాయరంగ సమస్యలు పరిష్కారం అవుతాయి. పోరాటానికి కావాల్సిన ఉద్యమ కార్యాచరణ మహాసభలో రూపొందిస్తాం.. అని రంగారెడ్డి వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -