Friday, April 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమొక్కజొన్న, ధాన్యం పంటలను ప్రభుత్వమే కొనాలి

మొక్కజొన్న, ధాన్యం పంటలను ప్రభుత్వమే కొనాలి

- Advertisement -

కేంద్ర ప్రభుత్వ నిబంధన ఎత్తేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో రైతులు పండించిన మొక్కజొన్న, ధాన్యం పంటలను ఎలాంటి నిబంధనలు లేకుండా మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎకరానికి 26 క్వింటాళ్లు మాత్రమే కొనాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధన ఎత్తేసి, మొత్తం పంటను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ”రాష్ట్రంలో యాసంగిలో మొక్కజొన్న పంట 11 లక్షల ఎకరాలు, వరి పంట 60-70 ఎకరాల్లో వేసినట్టు వ్యవసాయ శాఖ పేర్కొన్నది. రైతులు ఎకరానికి 40 వేలకు పైగా పెట్టుబడి పెడితే సుమారు 45-50 క్వింటాళ్లు మధ్య దిగుబడి వచ్చిందని అంచనా. కేంద్ర ప్రభుత్వం ఎకరానికి 26 క్వింటాళ్లు మాత్రమే కొనాలనే నిబంధన పెట్టడంతో పండిన మిగతా మొక్కజొన్నలను కొనకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2400 లభించడం లేదు. మధ్య దళారులు, మిల్లర్లు కుమ్మక్కై క్వింటా రూ.1600-1800 మధ్య కొనుగోలు చేసి దోచుకుంటున్నారు. అధిక పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా ఆచరణలో జరగడం లేదు. మద్దతు ధర లభించక పోవటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు’ అని వెస్లీ అన్నారు. ‘ఇటీవల కాలంలో రాష్ట్రంలో అకాల వర్షాలు కురిశాయి. దీంతో మక్కలు, ధాన్యం తడిశాయి. తేమ ఉందనే సాకుతో పలు నిబంధనలు పెట్టి ధరను తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు అవసరమైన గోనె సంచుల కొరత, రవాణాకు లారీలను అందుబాటులో లేకపోవడం వల్ల ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌, నిర్మల్‌ తదితర జిల్లాల్లో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నది. తక్షణం కొనుగోలుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలి’ అని జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -