– వ్యవసాయ కార్మికులు, రైతులు కలిస్తేనే దోపిడీదారులను ఎదుర్కోగలం
– మే 4 తర్వాత డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయి
– ఆయిల్ దోపిడీ కోసమే అమెరికా యుద్ధం : వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వ్యవసాయ కార్మికులు, రైతులు కలిస్తేనే దోపిడీ దారులను ఎదుర్కోగలమని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం సూచించారు. ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన సాధ్యమని చెప్పారు. వ్యవసాయ కార్మికులు, రైతుల ఐక్యత వర్ధిల్లాలని, ఏ పోరాటం చేసినా అందరం కలిసి చేయాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో గురువారం ప్రారంభమైన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభలో తమ్మినేని ప్రసంగించారు. ఆయిల్ దోపిడీ కోసమే అమెరికా ఇరాన్‌పై యుద్ధం చేస్తోందని తెలిపారు. అమెరికాలో ఆయిల్ ధరలు పెరిగినా ఇండియాలో డీజిల్ ధరలు పెరగకపోవడం మోడీ గొప్పతనం కాదని, ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మే 4వ తేదీ తర్వాత ఆయిల్, గ్యాస్ ధరలు అమాంతం పెరుగుతాయని హెచ్చరించారు. ప్రపంచ దేశాలు అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఖండించకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు దిగిరావన్నారు. ఆ దేశ ఆధిపత్యాన్ని అణచివేస్తున్న ఇరాన్ వెనుక ఎర్రజెండా ఉందనే విషయాన్ని గ్రహించాలని తెలిపారు. డీజిల్, గ్యాస్, ఎరువులు రవాణా అయ్యే హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటం ద్వారా ప్రపంచ దేశాలు ఇబ్బంది పడ్డాయన్నారు. అమెరికా పెత్తనాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయన్నారు.
పంటలకు గిట్టుబాటు ధర లేదని, ఎరువులు, పురుగుమందుల ధరలు పెరుగుతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులు, రైతులు సంఘటితంగా పోరాడి తుపాకీ తూటాలను ఎదుర్కొని పోడు హక్కు పత్రాలు సాధించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎర్రజెండా ఉన్నంతవరకూ ఎకరం భూమి కూడా పేదల నుంచి తీసుకోలే రని, సింగరేణి కార్మికులకూ లబ్ది చేకూరిందన్నారు. అసలు యూరియానే లేనప్పుడు ఆన్ లైన్లో అప్లై చేస్తే ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు.
ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



