Tuesday, September 15, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఇవి పరిణామాలు మాత్రమేనా?

ఇవి పరిణామాలు మాత్రమేనా?

- Advertisement -

చట్టం మారుతున్న సమాజంతో పాటు నడుస్తుందా.. లేక సమాజం ముందుకు పరిగెడుతుంటే చట్టం ఇంకా పాత ప్రశ్నల దగ్గరే ఆగిపోతుందా? వ్యక్తిగత స్వేచ్ఛ నుంచి ప్రభుత్వ అధికారాల వరకు.. సాంకేతికత నుంచి ప్రజా భద్రత వరకు చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ ప్రశ్నను బలంగా ముందుకు తెస్తున్నాయి. వివాహంలో సమ్మతి హక్కుపై సుప్రీంకోర్టు విచారణ వ్యక్తిగత గౌరవం, స్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగ విలువలను చర్చకు తెస్తోంది. నిరోధక నిర్బంధంపై అలహాబాద్ హైకోర్టు తీర్పు ప్రభుత్వ అధికార వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తింది. ఎర్రకోట పేలుడు దర్యాప్తులో సాంకేతిక వేదికల వినియోగం భద్రతకు ఎదురవుతున్న కొత్త సవాళ్లను చూపిస్తోంది. అంశాలు వేర్వేరు అయినా ముందున్న ప్రశ్న ఒక్కటే. చట్టం ఇచ్చిన అధికారం ఎంతవరకు.. పౌరుడి హక్కుకు రక్షణ ఎక్కడివరకు?

వివాహ బంధంలో వ్యక్తిగత స్వేచ్ఛకు, సమ్మతి హక్కుకు ఎలాంటి స్థానం కల్పించాలి అనేది దేశవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న న్యాయ ప్రశ్న. 2026 సెప్టెంబర్ 9న ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం వైవాహిక అత్యాచారానికి సంబంధించిన చట్టపరమైన మిన హాయిం పును సవాలు చేసిన పిటిషన్లను విచారించింది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 63 మినహాయింపు 2 ప్రకారం 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న భార్యతో భర్తచేసే లైంగిక చర్యను ఆ నిర్వచనం నుంచి మినహాయించారు. ఈ నిబంధన రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వలేదు. కేంద్రం వాదన ప్రకారం ఇది ప్రధానంగా శాసన విధానానికి సంబంధించిన అంశం. పిటిషనర్లు వ్యక్తిగత గౌరవం, స్వేచ్ఛ, సమ్మతి హక్కులను ప్రధానంగా ప్రస్తావిస్తు న్నారు. చట్టం సమాజ మార్పులను అందుకోవాలంటే ఈ చర్చలో స్పష్టత రావాలి.

దేశ భద్రత, ప్రజా క్రమం వంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి నిరోధక నిర్బంధ అధికారం చట్టం కల్పిస్తుంది. అయితే కారణాలు, ఆధారాలు, ప్రక్రియ బలంగా ఉండటం కీలకం. 2026 ఏప్రిల్ 11న కార్మికుల నిరసనకు సంబంధించిన ఘటనలో అదుపులోకి తీసుకున్న ఢిల్లీ విశ్వవిద్యాలయ పట్టభద్రురాలు అకృతి చౌదరిపై మే 13న జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 2న అలహాబాద్ హైకోర్టు ఆ నిర్బంధాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వుల విధానం, కారణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసి, రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్లు సెప్టెంబర్ 9న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తెలిపారు. జాతీయ భద్రతా చట్టంలోని సెక్షన్ 3 నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్బంధానికి అధికారం ఇస్తుంది. సెక్షన్ 13 ప్రకారం గరిష్ఠ కాలం 12 నెలలు. అధికారం ఉన్న చోట బాధ్యత మరింత కఠినంగా ఉండాలి.

సాంకేతికత దుర్వినియోగం భద్రతా వ్యవస్థలకు కొత్త సవాలుగా మారుతోంది. ఎర్రకోట పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ 2026 మే 14న 10 మంది నిందితులపై 7,500 పేజీల అభియోగపత్రం దాఖలు చేసింది. జూన్ 27న మరో ముగ్గురిపై అభియోగపత్రం దాఖలు చేసినట్లు ప్రకటించింది. దర్యాప్తు వివరాల ప్రకారం నిందితుల్లో ఒకరు యూట్యూబ్, చాట్‌జీపీటీ వంటి వేదికలను పేలుడు పరికరాలకు సంబంధించిన సమాచార సేకరణకు ఉపయోగించినట్లు అభియోగపత్రంలో పేర్కొన్నారు. ఇది దర్యాప్తు సంస్థ ఆరోపణ మాత్రమే; నేరం నిర్ధారితమైందని భావించడానికి వీలులేదు. తుది నిర్ణయం న్యాయస్థాన పరిధిలో ఉంటుంది. సాంకేతికతను అడ్డుకోవడం పరిష్కారం కాదు. ప్రమాదకర వినియోగాన్ని గుర్తించే సామర్థ్యం, డిజిటల్ ఆధారాలను శాస్త్రీయంగా పరిశీలించే దర్యాప్తు వ్యవస్థలు, సమాచార వేదికల బాధ్యత బలోపేతం కావాలి. పౌరుల సమాచార వినియోగ స్వేచ్ఛకు భంగం కలగకుండా భద్రతను పెంచడం అసలు సవాలు.

ఇటీవల పరిణామాలు సమాజం మారుతున్న వేగానికి అనుగుణంగా చట్టాలు, విధానాలు కూడా మారాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించే న్యాయ వ్యవస్థతో పాటు ప్రజా భద్రతను కాపాడే బలమైన వ్యవస్థ అవసరం. ప్రభుత్వానికి చట్టబద్ధమైన అధికారం ఉండాలి. ఆ అధికార వినియోగానికి స్పష్టమైన హద్దులు ఉండాలి. న్యాయపరమైన పర్యవేక్షణ, కారణబద్ధమైన నిర్ణయాలు, పారదర్శక ప్రక్రియ, బాధ్యతాయుతమైన దర్యాప్తు ప్రజాస్వామ్యానికి బలాన్నిస్తాయి. సాంకేతికత కొత్త ప్రమాదాలకు కారణమైనా స్వేచ్ఛాయుత సమాచార వినియోగాన్ని అనవస రంగా పరిమితం చేయడం సరైన మార్గం కాదు. హక్కుల రక్షణ పేరుతో భద్రతను నిర్లక్ష్యం చేయడం కూడా సమర్థనీయం కాదు. అధికారం హద్దు ఎక్కడ ముగుస్తుంది.. పౌరుడి హక్కు ఎక్కడ మొదలవుతుంది అనే ప్రశ్నకు చట్టం, న్యాయం, బాధ్యత అనే మూడు మార్గాల్లో సమాధా నం వెతకాలి. కేసులు ముగిసి పోవచ్చు.. కానీ అవి లేవనెత్తిన ప్రశ్నలకు వ్యవస్థ ఇచ్చే సమా ధానమే ప్రజాస్వామ్య భవిష్య త్తును నిర్ణయిస్తుంది.

ఫిరోజ్ ఖాన్, 9640466464

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -