Thursday, September 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకార్మికుల ఆందోళనలపై నిర్బంధం ఆపాలి

కార్మికుల ఆందోళనలపై నిర్బంధం ఆపాలి

- Advertisement -

సామూహిక నిరసన దీక్షలో వక్తలు డిమాండ్‌
రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో సామూహిక నిరసన దీక్షలు హైదరాబాద్‌‌లో దీక్షలు ప్రారంభించిన ప్రొఫెసర్‌ హరగోపాల్‌, జస్టిస్‌ బి.చంద్రకుమార్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో/విలేకరులు​
కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు, పోరాటాలు చేస్తున్న కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ఆపాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌, జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. కార్మిక సమస్యలపై సీఐటీయూ అనుబంధ యూనియన్లు చేపడుతున్న ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌(ధర్నా చౌక్‌) వద్ద ‌నిర్వహించిన సామూహిక నిరసన దీక్షను ప్రొఫెసర్‌ హరగోపాల్‌, జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ దీక్షను ప్రారంభించారు. అనంతరం సీఐటీయూ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ అధ్యక్షులు ఎం.దశరథ్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా సీఐటీయూ చేస్తున్న కృషిని అభినందించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అమలు చేయాల్సిన పెట్టుబడిదారీ దేశాల్లోనూ ప్రపంచీకరణ, నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం హక్కులను హరిస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కోవాలంటే గతంలో కంటే మరింత సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. పెట్టుబడిదారీ విధానం కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని, అయితే శ్రమ తిరగబడితే పెట్టుబడి దానంతటదే కూలిపోతుందని అన్నారు. జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. కార్మిక, ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లే రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. సమస్యలను పరిష్కరించకుండా ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వం నిర్బంధ చర్యలకు పాల్పడటం అప్రజాస్వామికమని అన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా హామీల అమలులో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఆందోళనలు, పోరాటాలు చేస్తుంటే హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కనీసం ధర్నా చేసుకునేందుకు కూడా అనుమతి నిరాకరించడం అన్యాయమని, దీన్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్‌.సుధాభాస్కర్‌ మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 8, 9 తేదీల్లో అంగన్‌వాడీ, ఆశా సంఘాలు ఇచ్చిన ‘చలో హైదరాబాద్‌’ పిలుపులను భగ్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్న సీఐటీయూ నాయకులను సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించేలా పోలీసుల చర్యలు ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెబుతున్నప్పటికీ, గతంలోని అత్యవసర పరిస్థితి పాలనను గుర్తు చేసే విధంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయన్నారు. జాతీయ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలకు రూ.18 వేల స్థిర వేతనం, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, అంగన్‌వాడీ కార్యకర్తలకు ఉద్యోగ భద్రతతో పాటు రూ.18 వేల వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ప్రీప్రైమరీ, పీఎంవిద్య కార్యక్రమాలను కొనసాగించాలని, మధ్యాహ్న భోజనం, ఐకేపీ వీఓఏలు, గ్రామపంచాయతీ, మున్సిపల్‌, వైద్య ఆరోగ్య, విశ్వవిద్యాలయాలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఆర్టీసీ, విద్యుత్‌, బొగ్గు, ప్రయివేటు రవాణా, భవన నిర్మాణ, బీడీ, హమాలీ, పవర్‌లూమ్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

కార్మికులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తే మరింత పట్టుదలతో, ఐక్యంగా, సమరశీలంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.రమ, పి.జయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేష్‌, సీహెచ్‌.భానుకిరణ్‌, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బి.వెంకటేష్‌, బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు యాదవ్‌, టీయూసీఐ నాయకులు లింగస్వామి, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు డి.వీరన్న, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్‌ శోభన్‌ నాయక్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌ బాబు, ఐఎల్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పార్థసారథి, హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కార్యదర్శి జె.కుమారస్వామి, బెఫీ రాష్ట్ర నాయకులు వెంకట్రామయ్య, సౌత్‌ జిల్లా ఆఫీస్‌ బేరర్లు తదితరులు పాల్గొన్నారు. ​

నిర్బంధాల ద్వారా కార్మిక ఉద్యమాలను అణచలేరు : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య
​​రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాల ద్వారా కార్మిక ఉద్యమాలను అణచివేయాలని చూస్తే కేసీఆర్‌‌కు పట్టిన గతే సీఎం రేవంత్ రెడ్డికీ పడుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం రైతుబజార్ వద్ద నిర్వహించిన దీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాల అమలు కోరుతూ అంగన్వాడీలు , ఆశాలు, గ్రామపంచాయతీ, వివిధ రంగాల కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిని ముందస్తు అరెస్టులు చేస్తూ మహిళలని కూడా చూడకుండా పోలీస్‌స్టేషన్లకు తరలిస్తూ లాఠీచార్జి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. గతంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ ఎత్తివేసి, ఉద్యమాల్ని అణచివేయాలని చూసిన బీఆర్ఎస్ ప్రభుత్వం విధానాల బాటలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నదని ‌విమర్శించారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ప్రభుత్వం నడవాలని సూచించారు.

అనంతరం జిల్లా ఇన్‌‌చార్జి కలెక్టర్ భాస్కర్ రావుకు, ఎస్పీ ఆకాంక్ష యాదవ్‌‌కు వినతిపత్రం అందజేశారు. కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట సామూహిక నిరాహార దీక్ష నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట సామూహిక దీక్ష చేశారు. అనంతరం కలెక్టరేట్‌‌లో వినతిపత్రం ఇచ్చారు. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టరేట్‌ కార్యాలయాల వద్ద, మెదక్‌ జిల్లా హెడ్‌ పోస్టాఫీస్‌ వద్ద దీక్ష చేపట్టారు. ​నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌‌ వద్ద నిరసన దీక్షలు చేపట్టారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన దీక్షను సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ దీక్షలను ప్రారంభించారు. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. నిర్మల్‌ జిల్లా ఆర్డీఓ కార్యాలయం ఎదుట సామూహిక నిరసన దీక్షలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిరసన దీక్ష నిర్వహించారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -