2015 నాటి చట్టాలే వర్తిస్తాయి : సుప్రీంకోర్టు
రాజకీయ కోణంలో కేసు నమోదు చేశారు : రేవంత్‌రెడ్డి న్యాయవాది వాదన
ఎమ్మెల్సీ ఎన్నికలను రాజ్యసభ ఎన్నికలతో ముడిపెట్టలేం
ఆరోపణల కంటే ముందుగా నేరానికి వర్తించే చట్టాన్ని పరిశీలించాలన్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
‘ఓటుకు నోటు’ కేసులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిపై నమోదైన అభియోగాల చెల్లుబాటును సవాలు చేస్తూ ఆయన తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా సుప్రీంకోర్టులో విస్తృత వాదనలు వినిపించారు. 2015లో జరిగిన ఘటనకు ఆ సమయంలో అమల్లో ఉన్న అవినీతి నిరోధక చట్ట నిబంధనలే వర్తిస్తాయని, అనంతరం చేసిన సవరణలను గతానికి వర్తింపజేయడం చట్టబద్ధం కాదని ఆయన వాదించారు. ఈ కేసు రాజకీయ కోణంలో నమోదైందని కూడా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్య బగ్చీ, జస్టిస్ వి.మోహన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్లను విచారించింది. 2021లో దాఖలైన పిటిషన్లపై గతంలో పలుమార్లు విచారణ జరిగినప్పటికీ, ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఇటీవల పదవీ విరమణ చేయడంతో విచారణను మొదటి నుంచి చేపట్టనున్నట్టు సీజేఐ గతంలో స్పష్టం చేశారు.
ముందుగా ట్రాప్.. ఆ తర్వాత ఎఫ్ఐఆర్
రేవంత్‌రెడ్డిని ముందుగా ట్రాప్ చేసి, అనంతరం అవినీతి నిరోధక శాఖ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని లూథ్రా దించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే సీఆర్‌పీసీ కింద దర్యాప్తు ప్రారంభించడానికి అవకాశం లేదని పేర్కొన్నారు. ట్రాప్‌కు ముందు సాధారణంగా నమోదు చేయాల్సిన జనరల్ డైరీ కూడా లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో 2015 నాటి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 కింద రేవంత్‌రెడ్డిపై అభియోగం నమోదు చేశారని, అయితే అప్పట్లో అమల్లో ఉన్న చట్ట ప్రకారం లంచం తీసుకోవడమే నేరంగా ఉండేదని, లంచం ఇవ్వడం లేదా అందుకు కుట్ర చేయడాన్ని నేరంగా పరిగణించే నిబంధన తరువాత సవరించబడిందని లూథ్రా వివరించారు.2018లో చేసిన సవరణ ద్వారా లంచం ఇవ్వడాన్నీ నేరంగా పరిగణించే విధంగా చట్టంలో మార్పులు చేశారని, అయితే 2015లో జరిగిన ఘటనకు ఆ సవరణలను వర్తింపజేయడం సాధ్యం కాదని వాదించారు. నేరం జరిగిన సమయానికి అమల్లో ఉన్న చట్టాన్నే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుందా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎమ్మెల్యేకు డబ్బు ఇవ్వడం అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి వస్తుందా అన్నది ప్రధాన న్యాయపరమైన ప్రశ్నగా లూత్రా పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఓటు వేయడం శాసనసభలో శాసన కార్యకలాపం నిర్వహించడంలో భాగం కాదని, ఎన్నికల ప్రక్రియలో భాగమైన రాజ్యాంగపరమైన పాత్రగా చూడాలని వాదించారు. రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలను ఒకే విధంగా చూడలేమని తెలిపారు. ఈ రెండు ఎన్నికల్లో ఓటర్ల స్వరూపం, ఎన్నికయ్యే ప్రతినిధుల విధానం వేర్వేరుగా ఉంటాయని చెప్పారు. అందువల్ల రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన గత తీర్పులను యథాతథంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్వయించడం సరికాదని వాదించారు.
‘ఫ్యాక్ట్స్ కంటే చట్టపరమైన ప్రశ్నే కీలకం’
కేసులో ఆరోపణలు వాస్తవమా కాదా అనే అంశాన్ని ఈ దశలో పరిశీలించాల్సిన అవసరం లేదని, ముందుగా ఆ ఆరోపణలకు వర్తించే చట్టం కింద నేరం ఏర్పడుతుందా లేదా అన్నదే తేల్చాల్సి ఉందని లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. 2015 ఘటనకు సెక్షన్ 12 వర్తిస్తుందా? ఎమ్మెల్సీ ఎన్నికల స్వభావం కారణంగా ఆ సెక్షన్ కింద అభియోగం నిలబడుతుందా? 2018లో సవరించిన సెక్షన్ 8ను 2015 ఘటనకు వర్తింపజేయవచ్చా? అనే ప్రశ్నలను ఆయన ముందుంచారు. సెక్షన్ 12 కింద అభియోగం నిలబడకపోతే దానిపై ఆధారపడిన కుట్ర, ఉమ్మడి ఉద్దేశానికి సంబంధించిన ఇతర అభియోగాలపైనా న్యాయపరమైన ప్రభావం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో నిర్వహించే రాజ్యాంగపరమైన పాత్ర, శాసనసభ కార్యకలాపాల్లో వారికి లభించే ప్రత్యేక హక్కులు, లంచం కేసుల్లో వర్తించే చట్టపరమైన నిబంధనలు వేర్వేరు అంశాలని స్పష్టం చేశారు. సీతా సోరెన్, నర్సింహారావు, కుల్దీప్ నాయర్ తదితర కేసుల్లో వెలువడిన తీర్పులను కూడా ఆయన ప్రస్తావించారు.
మత్తయ్య పిటిషన్‌నూ ప్రస్తావించిన లూథ్రా
ఈ కేసులో ఏ4గా ఉన్న జెరూసలెం మత్తయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కూడా లూథ్రా ప్రస్తావించారు. సెక్షన్ 12కు సంబంధించి హైకోర్టు విచారణలో వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత కేసు కొనసాగింపుపై న్యాయపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన విరామానికి ముందు దాదాపు రెండు గంటలపాటు వాదనలు విన్న ధర్మాసనం, అనంతరం మరోసారి విచారణ చేపట్టింది. లూత్రా మరో 15 నిమిషాలపాటు వాదనలు కొనసాగించి తన వాదనలు పూర్తయ్యాయని తెలిపారు. అయితే ప్రతివాదుల తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాది మోహిత్ రావు తెలిపారు. మరో రోజు వాదనలు కొనసాగించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ తేదీని కోర్టు మాస్టర్ తెలియజేస్తారని సీజేఐ తెలిపారు. సెప్టెంబర్ 30న కేసు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు సుప్రీంకోర్టు విచారణ జాబితాలో పేర్కొంది.



