నగదు వైపు మళ్లీ మొగ్గు..
కొత్త చార్జీలపై ఢిల్లీ వ్యాపారుల ఆందోళన మళ్లీ క్యాషే కింగ్..
ఎండీఆర్‌పై మరో 18 శాతం జీఎస్టీ
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ డిజిటల్ చెల్లింపులపై అనుహ్యాంగా చార్జీలు వసూలు చేయడంపై ప్రజలు, వ్యాపారాల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఎంతో నమ్మకంతో ఉచితంగా ఇస్తున్న సేవలకు తెరపడటంతో ప్రజల్లో అంతులేని అనుమానాలు, వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన (యూపీఐ) లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించడంతో ఢిల్లీ వ్యాపార సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అదనపు భారాన్ని తప్పించుకునేందుకు డిజిటల్ చెల్లింపులను పక్కనపెట్టి, ఇకపై నగదు చెల్లింపులనే పెద్దఎత్తున ప్రోత్సహించాలని వ్యాపారులు నిర్ణయించడం విశేషం. అక్టోబర్ 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన మర్చంట్ యూపీఐ (పీ2ఎం) లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వర్తించనుంది. రూ.3,000 లావాదేవీకి రూ.12, రూ.50,000 లావాదేవీకి రూ.200 చొప్పున చార్జీ పడుతుంది. ఇక రూ.75,000 అంతకంటే ఎక్కువ మొత్తాలపై గరిష్టంగా రూ.300 వసూలు చేయనున్నారు. వ్యక్తుల మధ్య జరిగే (పీ2పీ) బదిలీలు ఉచితంగానే ఉంటాయని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఇప్పటికే అంతంత ఆదాయాలతో వ్యాపారం సాగిస్తున్న తమపై ఈ కొత్త చార్జీ మోయలేని భారంగా మారుతుందని వ్యాపార సంఘాలు వాపోతున్నాయి. తాము తొలుత డిజిటల్ చెల్లింపులను పూర్తిగా స్వాగతించామని.. కానీ ఇప్పుడు అదనపు భారం మోపితే తాము నగదు లావాదేవీల వైపు వెళ్లక తప్పదని కమలా నగర్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు నితిన్ గుప్తా స్పష్టం చేశారు.
తాము ఇప్పటికే లావాదేవీల చార్జీలు, 18 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నామన్నారు. ఇప్పుడు యుపిఐపై కూడా ఎండిఆర్ విధిస్తే దాన్ని సమర్థించబోమని తేల్చిచెప్పారు.కొత్త డిజిటల్ విధానాలకు పూర్తిగా అలవాటు పడిన వినియోగదారులు సైతం మార్కెట్లకు వెళ్లినప్పుడు కనీసం చిల్లర నగదు కూడా తీసుకెళ్లని పరిస్థితి నెలకొందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రెడిట్ కార్డుల విషయంలో ఇప్పటికే ఎండీఆర్ భారాన్ని ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పుడు యుపిఐకి కూడా ఇది వర్తింపజేస్తే నిర్వహణ వ్యయం విపరీతంగా పెరుగుతుందని ఖాన్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ మెహ్రా పేర్కొన్నారు. హోల్‌సేల్ వ్యాపారులకు చెల్లింపులు చేసేందుకు చెక్కులు లేదా ఇతర బ్యాంకింగ్ మార్గాలను ఆశ్రయించాల్సి వస్తుందని ఆయన తెలిపారు. కమలా నగర్ ప్రాంతంలో చిల్లర దుకాణాలు నిర్వహించే రజత్ జైన్ మాట్లాడుతూ.. విద్యార్థులు వచ్చి పది, ఇరవై రూపాయల కొనుగోళ్లు కూడా చేస్తారని, వారిని అదనంగా డబ్బులు అడగలేమని, కానీ తమపై మాత్రం పన్నులు, చార్జీల భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.2,000 దాటిన లావాదేవీలు ఎక్కువగా జరిగే చిన్న, మధ్యతరహా హోల్‌సేల్ వ్యాపారులకు ఈ నిర్ణయం ఆర్థికంగా నష్టాన్ని తెస్తుందని సదర్ బజార్ బారీ మార్కెట్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పరమ్‌జిత్ సింగ్ పమ్మా ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులపై ఈ రకమైన భారం పడితే వారు ఆటోమేటిక్‌గా ఆ వ్యయాన్ని వినియోగదారుల పైనే రుద్దే అవకాశం ఉందని, ఫలితంగా వ్యాపారులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని కపిల్ అరోడా పేర్కొన్నారు.
నల్లడబ్బుకు బాటలు..
దేశంలో గూగుల్ పే, ఫోన్‌పే వంటి యూపీఐ డిజిటల్ లావాదేవీలు ప్రతిరోజూ కోట్లలో జరుగుతున్నప్పటికీ భౌతిక నగదు చెలామణి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. పైగా ప్రతి ఏటా ప్రజలు మరింతగా నగదును తమ వద్దే దాచుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. యూపీఐ చార్జీలు వసూలు చేయడం ద్వారా నగదు వినియోగం మరింత పెరగనుందని.. ఇది నల్లడబ్బుకు మరింత బాటలు వేయనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్‌లో 2016 నోట్ల రద్దు ద్వారా చట్టవిరుద్ధమైన నల్లధనాన్ని అరికట్టే ప్రయత్నం చేసినప్పటికీ, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ఇప్పటికీ నగదు లావాదేవీల జోరు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద సుమారు 17600 కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఆరు రకాల డినామినేషన్లలో ప్రతి ఏటా 3000 కోట్ల కొత్త నోట్లను ముద్రిస్తుంది. దాదాపు 2100 కోట్ల పాత నోట్లను ఉపసంహరిస్తున్నారు. రోజువారీ చెల్లింపుల కోసం డిజిటల్ యాప్‌ల వాడకం విపరీతంగా పెరిగినప్పటికీ, ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణి రెండంకెల వృద్ధి రేటును నమోదు చేస్తుండటం విశేషం.
డిజిటల్ సిస్టమ్స్ మొరాయించినప్పుడు లేదా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు నగదు మాత్రమే భరోసా ఇస్తుందనే భయం ప్రజలను మరింతగా నగదు నిల్వ చేసుకునేలా ప్రేరేపిస్తోంది. ఐరోపా దేశాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. యూరప్‌లో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ, గృహాలు దాచుకునే యూరో నోట్ల నిల్వలు మాత్రం పెరగడం గమనార్హం. ఈ పరిణామం ఆర్బిఐకి ఒక కొత్త సవాలుగా మారనుందని నిపుణులు పేర్కొంటున్నారు. డిజిటల్ చెల్లింపులను ఎంతగా ప్రోత్సహిస్తున్నప్పటికీ, కరెన్సీ ముద్రణ, పంపిణీ వ్యవస్థను కూడా సమాంతరంగా నిర్వహించాల్సి వస్తోంది. డిజిటల్ విప్లవం ఎంత వేగంగా దూసుకుపోతున్నా, నగదు అనేది ఎవరూ వదులుకోవడానికి ఇష్టపడని ఒక అదనపు భద్రతగా నిలుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జీఎస్టీతో రూ.5,000 కోట్ల ఆదాయం..
అసలు లావాదేవీ మొత్తంపై వసూలు చేసే 0.4 శాతం మర్చంట్ ఫీజుపై కూడా 18 శాతం జీఎస్టీతో వర్తించనుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎండీఆర్ చార్జీల ద్వారా ప్రభుత్వానికి వార్షికంగా రూ. 3,500 కోట్ల నుంచి రూ. 4,000 కోట్ల వరకు జీఎస్టీ రూపంలో ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఎఎంఆర్జీ గ్లోబల్ మేనేజింగ్ పార్ట్నర్ రజత్ మోహన్ అంచనా వేశారు. జీఎస్టీ మినహాయింపు కలిగిన గూడ్స్, సర్వీసులు విక్రయించే వ్యాపారులు మాత్రం ఈ జీఎస్టీని భారాన్ని స్వయంగా భరించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి ఖజానాకు ఏటా రూ.5,000 కోట్లకు పైగా కొత్త జిఎస్టి ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రూ.2,000 కంటే ఎక్కువ ఉన్న నెలవారీ రూ.6 లక్షల కోట్ల వ్యాపార చెల్లింపుల అంచనా ప్రకారం.. వార్షికంగా రూ. 5,184 కోట్లుగా ఉంటుందని ఎకెఎం గ్లోబల్ లీడ్ ఐకేష్ నాగపాల్ తెలిపారు.



