నవతెంలంగాణ – సిద్దిపేట: అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రజా పాటల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ నెల 26, 27, 28 తేదీల్లో నిర్వహించనున్న ప్రజా కళా జాతరను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక రాష్ట్ర కన్వీనర్ వంగల సంతోష్ కోరారు. బుధవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ప్రజా కళా జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాలుగా ప్రజల పక్షాన నిలిచి ప్రజా కళాకారిణిగా విమలక్క కొనసాగుతున్నారని తెలిపారు. ప్రజా కళారూపాలు, సంప్రదాయ కళలను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నక్సల్బరి, శ్రీకాకుళం, సిరిసిల్ల, జగిత్యాల, గోదావరి లోయ తదితర ప్రాంతాల్లోని ప్రతిఘటన ఉద్యమాలు అనేక మందిని ప్రజా కళాకారులుగా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు.
విమలక్క తన కళా ప్రస్థానంలో అనేక ఆటుపోట్లు, నిర్బంధాలు, కేసులు, జైలు జీవితాన్ని ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజా పాటను ప్రజల గొంతుకగా కొనసాగిస్తూ తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని అన్నారు. మూడు రోజుల పాటు 50 గంటలపాటు నిర్విరామంగా జరిగే ప్రజా కళా జాతరలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కీసర ఎల్లన్న, రమక్క, డప్పు శివరాజం, ప్రభాకర్, మల్లేశం, వేణు, నవీన్, పీడీఎస్‌యూ నాయకులు రాజేష్, మణికంఠ, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.


