కొన్నిసార్లు ప్రపంచాన్ని మార్చడానికి పెద్ద సభలు నిర్వహించాల్సిన అవసరం లేదు.. చేతిలో జెండాలు పట్టుకొని వేలాది మందితో నిరసన చేపట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక సాధారణ మనిషి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ఒక చిన్న సమస్య పరిష్కారం కోసం ధైర్యంగా నిలబడితే, ఆ చిన్న పోరాటమే ఒక మహత్తర మార్పుకు నాంది కావచ్చు. అలాంటి ధైర్యానికి ప్రతీకగా నిలిచిన మహిళే రోసా పార్క్స్.
రోసా పార్క్స్ 1913 ఫిబ్రవరి 4 జన్మించారు. ఈమె ఒక ఆఫ్రికన్ అమెరికన్. తల్లి లియోనా ఎడ్వర్డ్స్ మెక్కాలీ ఉపాధ్యాయురాలు. తండ్రి జేమ్స్ మెక్కాలీ వడ్రంగి పని చేసేవాడు. రోసా బాల్యం నుండి చాలా కాలం టాన్సిలైటిస్‌తో బాధపడుతూ గడిపారు. ఆమెకు ఆరేండ్లున్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. దాంతో తల్లి, తమ్ముడితో కలిసి మాంట్‌గోమరీ సమీపంలోని అలబామాలోని తమ అమ్మమ్మ, తాతయ్యల దగ్గరకు వెళ్లారు. మొదట్లో పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసే తన తల్లి వద్దే రోసా విద్యను అభ్యసించింది. అలాగే పొలం పనులలో సహాయం చేసేది. వంట చేయడం, కుట్టుపని కూడా నేర్చుకుంది. అయితే తెల్లజాతీయులు అప్పట్లో నల్లజాతీయుల పట్ల తీవ్ర వివక్ష చూపించేవారు. నల్లజాతి చర్చిలను, పాఠశాలలను తగలబెట్టేవారు. వాళ్లను కొట్టడం, చంపడం చేసేవారు. అందుకే రోసా తాత రాత్రిపూట, చేతిలో రైఫిల్ పట్టుకుని ఇంటి చుట్టూ కాపలా కాసేవాడు. కొన్నిసార్లు రోసా కూడా తన తాతతో కలిసి కాపలా కాయడానికి ఇష్టపడేది. ఇలా చిన్నతనం నుండి ఎదుర్కొన్న జాతి వివక్ష ఆమెను ఆలోచింపజేసింది. తర్వాత కాలంలో ఆమెను పౌర హక్కుల ఉద్యమకారిణిగా మార్చింది.
రేమండ్ పార్క్స్‌తో పెండ్లి
16 ఏండ్ల వయసులో రోసా కుటుంబ పరిస్థితుల రీత్యా చదువు మానేయాల్సి వచ్చింది. అంతే కాదు తెల్లవారి ఇంట్లో పని చేయడానికి కుదిరారు. 1932లో, 19 ఏండ్ల వయసులో రోసా పౌర హక్కుల కార్యకర్త అయిన రేమండ్ పార్క్స్‌ను వివాహం చేసుకున్నారు. అతను ఆమెను తిరిగి ఉన్నత పాఠశాలకు వెళ్లి డిప్లొమా చేయాల్సిందిగా ప్రోత్సహించాడు. ఆ తర్వాత ఆమె కుట్టుపని చేస్తూ జీవనం సాగించారు. 1943లో రోసా మాంట్‌గోమరీ చాప్టర్‌లో సభ్యురాలిగా చేరారు. నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ (NAACP)లో సభ్యురాలిగా ఉండి, 1956 వరకు దానికి కార్యదర్శిగా పనిచేశారు.
మోంట్‌గోమరీ బస్సు బహిష్కరణ
1955 డిసెంబర్ 1న అమెరికాలోని అలబామా రాష్ట్రం మోంట్‌గోమరీలో రోసా పార్క్స్ పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బస్సెక్కారు. ఆ కాలంలో అమెరికాలో జాతి వివక్ష తీవ్రంగా ఉండేది. నల్లజాతీయులు బస్సుల్లో వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఒక తెల్లజాతి ప్రయాణికుడు కూర్చోవడానికి తన సీటును వదిలి ఆమెను బస్సు వెనుక భాగానికి వెళ్లమని అంటాడు. డ్రైవర్ కూడా అలాగే ఆదేశిస్తాడు. అయితే రోసా పార్క్స్ వెనక్కి వెళ్లి కూర్చోవటానికి నిరాకరించారు. ఆమె చేసిన పని చూసేందుకు, వినేందుకు చాలా చిన్నగా అనిపించవచ్చు. కానీ ఆ చిన్న నిరాకరణలో ఒక గొప్ప సందేశం దాగి ఉంది. మనిషి గౌరవాన్ని అన్యాయం ముందు తాకట్టు పెట్టకూడదు. తన హక్కు కోసం నిలబడినందుకు ఆమెను అరెస్టు చేశారు. అయితే ఆ అరెస్టుతో ఆమె స్వరం ఆగిపోలేదు. ఆమె గొంతును అణచివేయాలనుకున్న ఆ అరెస్టే, వేలాది మంది ప్రజల హృదయాల్లో ప్రతిఘటనకు నిప్పురవ్వగా మారింది. ఆరోజు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన ఆమె ధైర్యామే అనతి కాలంలోనే వేలాది గొంతులుగా మార్మోగింది. ఒక బస్సులోని సీటును కాపాడుకోవడానికి చేసిన ఆ చిన్న నిరాకరణ, చివరకు, సమానత్వం కోసం ఒక దేశాన్ని కదిలించిన మహోద్యమానికి నాంది పలికింది. ఆమె అరెస్టుకు నిరసనగా ప్రారంభమైన మోంట్గోమేరీ బస్ బహిష్కరణ ఉద్యమం ఏకంగా 381 రోజుల పాటు కొనసాగింది. ఒక సాధారణ మహిళ చూపిన ఆ చిన్న ధైర్యం, వేలాది మందిని ఏకం చేసి, జాతి వివక్షకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారింది.
జాతి వివక్షకు వ్యతిరేకంగా
రోసా పార్క్స్ అరెస్టు తర్వాత మోంట్గోమేరీలో నల్లజాతీయులు బస్సులను బహిష్కరించడం ప్రారంభించారు. అమెరికాలోని 70 శాతం ప్రజలు తమకు సమాన హక్కులు, గౌరవం కావాలని శాంతియుతంగా పోరాడారు. ఈ బహిష్కరణ పౌర హక్కుల ఉద్యమానికి గొప్ప ఊపునిచ్చింది. తర్వాత అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఇది ఒక కీలక మలుపుగా నిలిచింది. అయితే రోసా పార్క్స్ కథను కేవలం ‘సీటు ఇవ్వడానికి నిరాకరించిన మహిళ’ కథగా చూస్తే ఆమె గొప్పతనాన్ని తగ్గించడం అవుతుంది. ఆమె అప్పటికే పౌర హక్కుల కోసం పనిచేస్తున్న ఓ ప్రముఖ కార్యకర్త. ఆమె చర్య వెనుక ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న అన్యాయంపై ఉన్న ఆగ్రహం, ఆత్మగౌరవం, సమానత్వం కోసం ఉన్న నమ్మకం ఉన్నాయి.
పౌర హక్కుల ఉద్యమ తల్లి
రోసా పార్క్స్ నిరసన మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. మార్పు ఎప్పుడూ పెద్ద అడుగుతోనే ప్రారంభం కావాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ధైర్యమైనా, నిర్ణయమైనా కూడా సమాజాన్ని కదిలించగలదు. ఆమె బస్సులోని ఒక సీటును మాత్రమే కాపాడుకోలేదు. లక్షలాది మంది ప్రజలకు తమ హక్కుల కోసం నిలబడే ధైర్యాన్ని అందించారు. ఆమె నిరసన పౌర హక్కుల ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి, అమెరికాలో సమానత్వం కోసం సాగిన పోరాటాన్ని మరింతగా బలపరిచింది. అందుకే రోసా పార్క్స్ పేరు చరిత్రలో ఒక వ్యక్తిగా మాత్రమే కాకుండా, అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన ధైర్యానికి ప్రతీకగా నిలిచిపోయింది. అందుకే అందరూ ఆమెను ‘ఆధునిక అమెరికన్ పౌర హక్కుల ఉద్యమ తల్లి’ అని పిలుస్తారు. ఒక బస్సులోని ఒక సీటు నుంచి ప్రారంభమైన ఆ నిరసన, చివరకు ఒక దేశం తన అన్యాయమైన వ్యవస్థను ప్రశ్నించుకునేలా చేసింది. అందుకే రోసా పార్క్స్ జీవితం మనకు ఎప్పటికీ గుర్తుచేసేది ఒక్కటే. న్యాయం కోసం నిలబడిన ఒక ధైర్యమైన వ్యక్తులు ప్రపంచాన్ని మార్చే ఉద్యమానికి నాంది పలకగలరు.
కోట దామోదర్, 9391480475



