ముఖ్యమంత్రికి దమ్ముంటే ఈ సవాల్‌ను స్వీకరించాలి
అసత్యాలతో అసెంబ్లీ పవిత్రతను దెబ్బతీస్తున్న సీఎం
మాపై సస్పెన్షన్ ఎత్తేసి నెలరోజులు సభ జరపాలి :
జాతీయ సమైక్యతా దినోత్సవంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టిన నాటి నుంచి నేటి వరకు, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇరు కుటుంబాల ఆస్తులపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణకు తాము సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ సవాల్‌ను స్వీకరించి వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17 – జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందనీ, కేసీఆర్‌పై రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసే సిట్‌లు, సెట్‌లు కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమ వైపు ఏ తప్పైనా బయటపడితే చట్టపరంగా ఎలాంటి శిక్షకైనా తాము సిద్ధమని ప్రకటించారు.
కాంగ్రెస్ హామీలన్నీ బోగస్
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ ముమ్మాటికీ బోగస్ అని వెయ్యిరోజుల విఫల పాలన చూశాక తేలిపోయిందని కేటీఆర్ విమర్శించారు. వాటిపై నిలదీస్తామన్న భయంతోనే బీఆర్ఎస్‌ను సభ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. సభలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కై అసెంబ్లీని ఏకపక్షంగా నడిపించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “కళ్లల్లో కళ్లు పెట్టి చూసే ధైర్యం ప్రతిపక్షానికి లేదన్న రేవంత్‌రెడ్డికి సవాల్ విసురుతున్నా. ధైర్యముంటే శాసనసభ సమావేశాలను నెల రోజులపాటు పొడిగించి, మాపై సస్పెన్షన్లను ఎత్తేయండి. కళ్లల్లో కళ్లు పెట్టి చూడటం కాదు, 420 హామీల మోసంపై ప్రజల పక్షాన కాలర్ పట్టుకుని నిలదీస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు. మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ. నాలుగు వేల పింఛన్లు, రైతులకు కరెంట్, సాగునీరు, రైతుబంధు, అర్ధాంతరంగా రద్దు చేసిన రైతుబీమాపై సభాముఖంగా నిలదీస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి పదవికే రేవంత్‌రెడ్డి కళంకం
చట్టసభల్లో అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు హుందాగా, పెద్దరికంతో మాట్లాడాలే తప్ప అసత్యాలు, అర్ధసత్యాలతో ప్రజలను, రాష్ట్రాన్ని, శాసనసభను తప్పుదోవ పట్టించడం అత్యంత బాధాకరమని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ పవిత్రతను దుర్వినియోగం చేశారనీ, ముఖ్యమంత్రి పదవికే తీవ్ర కళంకం తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను చూసి అతను కూడా నాలుగు పద్యాలు, కొటేషన్లు, పెద్దల పేర్లు చెప్తే గొప్ప నాయకుడిని అయిపోతానని శ్రీశ్రీ పేరును రేవంత్‌రెడ్డి ప్రస్తావించారని గుర్తు చేశారు. ఆ మహానుభావుడి పూర్తి పేరు కూడా రేవంత్‌రెడ్డికి తెలియదని ఎద్దేవా చేశారు.
సీఎం మాటల్లోనూ అంతే నిజం
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఉన్నప్పుడు ప్రగతి భవన్‌లో 150 బెడ్రూములు ఉన్నాయనీ, బంగారు బాత్రూమ్‌లు కట్టారనీ, కొత్త సచివాలయం కింద నుంచి సొరంగం తవ్వుకుని లంకెబిందెలు తరలిస్తున్నారని చేసిన చిల్లర ప్రచారంలో ఎంత వాస్తవముందో, అసెంబ్లీలో సీఎం మాట్లాడిన మాటల్లోనూ అంతే నిజముందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అభయహస్తం మ్యానిఫెస్టో, ఆరు గ్యారెంటీలు ఏ మేరకు అమలయ్యాయో, ముఖ్యమంత్రి ప్రసంగం కూడా అంతే వాస్తవరూపమని చెప్పారు. మైసూరు బజ్జీలో ఎంతైతే మైసూరు ఉంటుందో రేవంత్ రెడ్డి మాటల్లోనూ అంతే నిజముందని వివరించారు. రూ. 80,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని ఊరూరా ప్రచారం చేసి, ఢిల్లీ నుంచి ఆర్టిస్టులను, టూరిస్టులను రప్పించి, నాటకాలతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చినట్టే, నేడు కూడా అదే అబద్ధాల వరద పారిస్తున్నారని చెప్పారు.
సిరిసిల్లలో కబ్జా భూములనడం దుర్మార్గం
సిరిసిల్ల పట్టణంలో నిరుపేదలకు, కార్మికులకు దశాబ్దాల క్రితం ఇచ్చిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జా భూములుగా చిత్రీకరించడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ విమర్శించారు. సిరిసిల్ల సగం పట్టణం ఒకనాటి రాయిని చెరువు భూముల్లోనే విస్తరించి ఉందనీ, కమ్యూనిస్టుల కాలంలో సీహెచ్ రాజేశ్వరరావు తదితర నాయకులు చెరువు ఎండిపోతే అందులోనే పేదలకు, కార్మికులకు 60, 70 గజాల చొప్పున ప్లాట్లు చేసి పట్టాలు పంచి ఇచ్చారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 58, 59 జీవోల కింద ఆ పేదల స్థలాలను రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తే, దాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కబ్జా అని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సిరిసిల్లలో 8,000 ఎకరాలు ఎక్కడ ఉన్నాయో, ఏ సర్వే నెంబరో, ఏ ఊరో, ఎవరు కబ్జా చేశారో సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
30 శాతం కమీషన్ల కోసమే 22ఏ
30 శాతం కమీషన్లు దండుకోవడానికే ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితా తీసుకొచ్చిందని కేటీఆర్ విమర్శించారు. కోటి ఎకరాల నిషేధిత భూముల్లో 30 లక్షల ఎకరాల ప్రయివేట్ భూములున్నాయంటూ సీఎం ఒప్పుకున్నారని వివరించారు. తప్పు ప్రభుత్వం చేసి సామాన్య ప్రజలను నిరూపించుకోమనడం వెనుక భారీ వసూళ్ల దందా దాగి ఉందని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం ఇంటిని 22ఏలో పెడితే రాత్రికి రాత్రే నిషేధిత జాబితా నుంచి తొలగించుకున్న ముఖ్యమంత్రి, సాధారణ ప్రజల భూములను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. భూ కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికే ‘ధరణి’ని రద్దు చేసి ‘భూభారతి’ తెచ్చారని ఆరోపించారు.
ఫామ్‌హౌస్‌పై తప్పుడు ప్రచారం
వెయ్యి సార్లు 1000 ఎకరాల ఫామ్‌హౌస్ అని రేవంత్ రెడ్డి గతంలో అన్నారనీ, అసెంబ్లీలో 67 ఎకరాలని స్వయంగా అంగీకరించారని కేటీఆర్ చెప్పారు. మిగిలిన 933 ఎకరాలు ఎక్కడున్నాయో చూపిస్తే వాటిని ప్రభుత్వానికే రాసిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లలోనే ఈ భూముల వివరాలను వెల్లడించారనీ, ఆదాయపు పన్ను, స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవసాయ భూమి అని వివరించారు. ఇంతకాలం వాటిపై తప్పుడు ప్రచారం చేసి బురదజల్లినందుకు కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.



