ఉన్నత విద్య భవిష్యత్‌కు ఐక్య ఉద్యమం
వర్సిటీల స్వయం ప్రతిపత్తి, ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం ముందుకు
ఫలించిన ఓయూ ఉద్యోగుల మూడు నెలల శ్రమ
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
ఉన్నత విద్యారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తి, ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, విద్యార్థుల భవిష్యత్‌పై దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయ ఉద్యోగులు గళమెత్తుతున్నారు. ఇటీవల అఖిల భారత విశ్వవిద్యాలయ ఉద్యోగుల సమాఖ్య (ఏఐయూఈసీ) 15వ జాతీయ మహాసభ సెప్టెంబర్ 10, 11, 12 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగాయి. ఈ మహాసభలో దేశంలోని సుమారు 313 విశ్వవిద్యాలయాల నుంచి 375 మంది ప్రతినిధులు, పరిశీలకులు పాల్గొని ఉన్నత విద్య భవిష్యత్‌పై విస్తృతంగా చర్చించారు. తమ డిమాండ్లపై గట్టిగా నిలదీశారు. ఓయూ ఎన్జీఓ అసోసియేషన్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్ తదితర ఉద్యోగ సంఘాల సంయుక్త ఆతిథ్యంలో నిర్వహించిన ఈ మహాసభకు దేశంలోని అన్ని ప్రాంతాల విశ్వవిద్యాలయాల ప్రతినిధులు హాజరయ్యారు. వీసీ ప్రొ. కుమార్ అధ్యక్షత వహించిన ఈ సభలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొ. వి. బాలకిష్టారెడ్డి, జాతీయ స్థాయి ఉద్యోగ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఓయూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు.
స్వయం ప్రతిపత్తి.. జవాబుదారీతనం
మహాసభలో విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిపై ప్రధాన అంశంగా చర్చించారు. స్వయంప్రతిపత్తి అంటే జవాబుదారీతనం నుంచి మినహాయింపు కాదని, పారదర్శకత, నాణ్యత, ఆర్థిక, సామాజిక బాధ్యతలతో కూడిన స్వతంత్రత అవసరమని స్పష్టం చేశారు. బోధనేతర సిబ్బంది వేతనాలు, సేవా నిబంధనలు, ఉద్యోగ భద్రత, పెన్షన్, ఆరోగ్యం, నివాస వసతి, నైపుణ్యాభివృద్ధి వంటి సమస్యలను ప్రధానంగా చర్చించారు. దేశవ్యాప్తంగా సమాన వేతన విధానం, సేవా నిబంధనలు, ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పాలనా వ్యవస్థలో నాన్‌టీచింగ్ ఉద్యోగులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.
విద్యకు నిధులు.. ఖాళీల భర్తీ
ఉన్నత విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రజా పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని మహాసభ తీర్మానం చేసింది. విద్యకు జీడీపీలో కనీసం 6 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేసింది. విశ్వవిద్యాలయాలకు అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు బోధన, బోధనేతర ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని కోరింది. టైమ్‌స్కేల్, కాంట్రాక్ట్, క్యాజువల్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేసింది.
సాంకేతికతతో.. ఉపాధి బాట
మారుతున్న కాలానుకనుగుణంగా విశ్వవిద్యాలయాలు విద్యా విధానాలను నవీకరించుకోవాలని మహాసభ సూచించింది. కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికతను విద్యా వ్యవస్థలో సమర్థంగా వినియోగించడంతోపాటు గ్రామీణ, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు డిజిటల్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఉపాధి ఆధారిత శిక్షణ అందించాలని పేర్కొంది.
ఓయూ ఉద్యోగుల మూడు నెలల శ్రమ
మూడు నెలల ముందే మహాసభ నిర్వహణకు అనుమతి లభించినప్పటికీ నిధుల సేకరణ, విశ్వవిద్యాలయ అనుమతులు, సావనీర్ రూపకల్పన, అతిథుల ఆహ్వానం, వసతి, స్వాగతం తదితర ఏర్పాట్లను ఓయూ మూడు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమన్వయంతో చేపట్టారు.
పలు కీలక తీర్మానాలు
మహాసభ ముగింపు సందర్భంగా ఉద్యోగుల న్యాయపరమైన హక్కులు, విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తి, సమాన వేతనాలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, ఖాళీల భర్తీ, ఉద్యోగ భద్రత, ఆరోగ్య పథకాలు, నైపుణ్యాభివృద్ధి, నివాస సౌకర్యాలు, ఉన్నత విద్యకు తగిన నిధుల కేటాయింపు వంటి అంశాలపై పలు తీర్మానాలు ఆమోదించారు. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు విశ్వవిద్యాలయాల వారీగా సమస్యలను గుర్తించి ఉద్యోగ సంఘాల సమన్వయంతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఒకే స్వభావం కలిగి ఉన్నందున ప్రాంతీయ, సంస్థాగత భేదాలకు అతీతంగా ఐక్యంగా పనిచేయాల్సిన అవసరాన్ని మహాసభ చాటిచెప్పింది. ఓయూ ఆచార్యులు ప్రొ. కొండా నాగేశ్వర్, ఈసీ సభ్యులు మధుసూదన్‌రెడ్డి ప్రసంగాలు సభికులను ఆకట్టుకున్నాయి.



