రెవెన్యూ వ్యవస్థపై సీఎం వ్యాఖ్యలు చారిత్రాత్మకం : రైతు కమిషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ధరణి పేరుతో జరిగిన భూ రికార్డుల విధ్వంసంపై విచారణ జరిపించాలని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు వెంకన్న యాదవ్, కేవీఎన్ రెడ్డి, భవానీ రెడ్డి, గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లో వారు మీడియాతో మాట్లాడారు. నిజాం కాలం నుంచి కొనసాగుతున్న రెవిన్యూ రికార్డుల వ్యవస్థ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు వరకు ఒక పద్ధతి ప్రకారం కొనసాగిందనీ, గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో చేపట్టిన కార్యక్రమం ద్వారా అనేక భూ రికార్డుల్లో గందరగోళం ఏర్పడిందని తెలిపారు. ప్రత్యేకంగా భూదాన్, అసైన్డ్, పట్టా భూముల రికార్డుల విషయంలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. అసైన్డ్ భూములకు రక్షణ కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వీఆర్ఓ వ్యవస్థ రద్దు, భూ రికార్డుల డిజిటలైజేషన్లో తలెత్తిన సమస్యలు, ధరణి వ్యవస్థలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు భూ హక్కులపై ప్రభావం చూపాయని తెలిపారు. 22 ఏ కింద ఉన్న భూముల విషయంలో అర్హులైన భూ యజమానులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని స్వాగతిస్తున్నామన్నారు. భూదాన్, అసైన్డ్, ఇతర ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భూ రికార్డుల విధ్వంసంపై విచారణ జరిపించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



