ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల మాటల్లో ఎంత అణకువ, ఆత్మీయత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలను కలిసి, వారి సమస్యలు విని, తాము గెలిస్తే అభివృద్ధి చేస్తామని హామీలిచ్చి ఓట్లు అభ్యర్థిస్తారు. గెలిచిన తర్వాత మాత్రం అదే ప్రజల ముందు వారి మాట తీరు, ప్రవర్తన మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలను పక్కనపెడితే.. ప్రజాప్రతినిధుల నోటి నుంచి వెలువడుతున్న అసభ్య పదజాలం, వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల్లోనే అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. ఇదంతా చూసిన జనం ‘ప్రజాప్రతినిధుల మాటలకు అర్థాలే వేరులే’ అని చర్చించుకుంటున్న పరిస్థితి. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నాయకులు బహిరంగ సభలు, మీడియా సమావేశాలు, చట్టసభల్లోనూ సంయమనం కోల్పోయి మాట్లాడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. నలుగురి మధ్య మాట్లాడటానికే ఇబ్బందికరంగా అనిపించే పదాలను మైకుల ముందు బహిరంగంగా ఉపయోగించడం ప్రజాప్రతినిధుల స్థాయికి తగదు. విధానాలపై విమర్శలు చేయా ల్సిన చోట వ్యక్తిగత దూషణలకు దిగడం, కుటుంబ సభ్యులను ప్రస్తావించడం, బెదిరింపులకు పాల్పడటం రాజకీయ చర్చ స్థాయిని దిగజార్చడమే. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేకుండా అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత కలిగి ఉంటారు.
కానీ కొందరి మాటల్లో కుల, మత, ప్రాంతీయ విభజ నలకు తావిచ్చే వ్యాఖ్యలు వినిపించడం మరింత ఆందోళనకరం. ప్రత్యర్థులను చంపుతామని మాట్లాడటం, పిండప్రదానాలు చేస్తామని చెప్పడం, నడిబజారులో అవమానిస్తామని హెచ్చరించడం వంటి భాష రాజకీయ విభేదాలను వ్యక్తిగత శత్రుత్వాలుగా మార్చుతుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే కనీస విచక్షణను కూడా మరచిపోకూడదు. ఈ పరిస్థితి యువతపై కూడా ప్రభావం చూపుతోంది. ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి రావాలనుకునే యువకులు, నేటి రాజకీయ నాయకుల భాషను చూసి వెనుకడుగు వేసే పరిస్థితి రాకూడదు. రాజకీయాల్లో విభేదాలు సహజమే. అయితే ఆ విభేదాలు విధానాలపై ఉండాలి తప్ప వ్యక్తులపై కాదు. మాటలో సంయమనం, ప్రత్యర్థి అభిప్రాయాన్ని గౌరవించడం, ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చ చేయడం ప్రజాస్వామ్య రాజకీయాలకు అవసరం. ఈ విషయంలో కమ్యూనిస్టు ఉద్యమ నేతల రాజకీయ సంప్రదాయం ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా విమర్శలు చేసినప్పటికీ వ్యక్తిగత దూషణలకు, అసభ్య భాషకు దూరంగా ఉండే రాజకీయ సంస్కృతి వారి మాటల్లో కని పిస్తుంది. ప్రజా సమస్యలపై గట్టిగా మాట్లాడటం, అదే సమయంలో భాషలో హుందాతనాన్ని కాపాడటం సాధ్యమేనని ఆ సంప్రదాయం చూపిస్తుంది.రాజకీయ నాయకుల మాటలు కేవలం వారి వ్యక్తిగత అభిప్రాయాలుగా మిగిలిపోవు. వాటిని ప్రజలు, ముఖ్యంగా యువత గమనిస్తారు. అందుకే ప్రజాప్రతినిధులు తమ భాషను, ప్రవర్తనను ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజకీయాల్లో పోటీ ఉండాలి.. విమర్శ ఉండాలి.. తీవ్ర విభేదాలు కూడా ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్య విలువలు, సంస్కారం, పరస్పర గౌరవం మాత్రం కోల్పోకూడదు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన నాయకుల మాటే రాజకీయ సంస్కృతికి అద్దం పడుతుంది.
ఎం. రేవంత్‌కుమార్, 9490098710



