భారత ప్రజలు జీఎస్టీ అనుభవాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. ‘‘ఒకే దేశం.. ఒకే పన్ను..’’ సామాన్యుడిపై భారం తగ్గించడానికే నంటూ కేంద్రంలోని మోడీ సర్కార్ నమ్మబలి కింది. తీరా పన్నుల భారం మాత్రం ప్రజలపైనే పడింది. అలాగే పెద్దనోట్ల రద్దు సమయం లోనూ ఉగ్రవాదానికి నిధుల ప్రవాహాన్ని అరికట్టడమే లక్ష్యమని చెప్పినప్పటికీ, ఉగ్రవాదం, హింస పూర్తిగా అంతరించి పోలేదనే వాస్తవం మిగిలింది. పైగా దీని ప్రభావం చిన్న వ్యాపారాలు మూతపడటం, కార్మికులు ఉపాధి కోల్పోవడం వంటి పరిణామాలకు దారితీసింది. ఇప్పుడు యూపీఐ విషయంలోనూ కేంద్రానిది అదే బాట కనిపిస్తోంది. డిజిటల్ ఇండియా లక్ష్యంగా చూపి ‘‘యూపీఐ ఉచితం-చెల్లింపులపై ఎలాంటి భారం ఉండదు’’ అంటూ ప్రజలకు అలవాటు చేసింది. ఇప్పుడు ఎండీఆర్ చార్జీల పేరుతో భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రజల డబ్బుతో, ప్రజల వినియోగంతో విస్తరించిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ఇప్పుడు కార్పొరేట్ చెల్లింపు సంస్థలకు ఆదాయ వనరుగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావా దేవీల మీద చార్జీలు విధిస్తూ ఇటీవల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇది ప్రజల మధ్య, రాజకీయ వర్గాలలో విస్తృతమైన చర్చోపచర్చలకు తెరతీసింది. ప్రజల రోజువారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినది కాబట్టి ఇది సహజం. వాస్తవాలు అర్ధం కావాలంటే గత దశాబ్దకాలం పాటు ప్రభుత్వం డిజిటల్ పేమెంట్లు పెంచటానికి పథకం ప్రకారం చేసిన కృషిని పరిశీలించాలి. అక్టోబర్ 15, 2026 నుంచి, రూ.2వేల పైబడిన యూపీఐ కొనుగోలు లావాదేవీలపై వ్యక్తుల మధ్య P2M 0.4 శాతం ఛార్జీలు మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) వర్తిస్తుందని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) నోటిఫికేషన్ జారీ చేసింది. రూ. 75వేలు పైబడిన లావాదేవీలకు ఈ చార్జీ గరిష్టంగా రూ.300కి పరిమితం. వ్యక్తుల మధ్య (P2P) చెల్లింపులు, అలాగే రూ.2వేల లోపు వ్యాపారి చెల్లింపులు యథా విధిగా ఉచితంగానే కొనసాగు తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే, మొత్తం యూపీఐ లావాదేవీల్లో దాదాపు 65 శాతం (విలువ ప్రకారం) రూ.2వేలు పైబడినవే -అంటే ఈ చార్జీ పరిధిలోకి వచ్చే లావాదేవీల విలువ చాలా పెద్దది, ‘‘కేవలం కొద్దిమందికే వర్తిస్తుంది’’ అనే వాదన కనిపించేంత చిన్నది కాదు.
ప్రభుత్వ వాదన ఏమిటి?
ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన వివరణ ప్రకారం.. ఇది వినియోగదారులపై కాదు, వ్యాపారులపై పడే చార్జీ మాత్రమే. ఎండీఆర్ అనేది ప్రభుత్వానికి లేదా ఎన్‌పిసిఐకి వెళ్లే పన్ను కాదు – బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య పంపిణీ అయ్యే మొత్తం. సుమారు 96శాతం చెల్లింపులు, P2M లావాదేవీలు ఈ చార్జీ పరిధిలోకే రావు. యూపీఐ వ్యవస్థ దీర్ఘకాలికంగా నిలబడాలంటే, దీని మౌలిక సదుపాయాలకు, భద్రతకు నిధులు అవసరమని, అందుకే ఈ చార్జీ అవసరమని ప్రభుత్వ వాదన.
ఈ వాదన వాస్తవమా?
ప్రభుత్వం చెబుతున్నది సాంకేతికంగా నిజమే అనిపిస్తుంది – చార్జీ కడుతున్నది వ్యాపారే. కానీ, వాస్తవ ప్రపంచంలో వ్యాపారం ఎలా జరుగుతుందో ఆలోచించండి. ఏ వ్యాపారీ తన లాభాన్ని తగ్గించుకోడు. అదనంగా పడే ప్రతి చార్జీని, ప్రతి ఖర్చును ధరలో కలిపి, చివరికి వినియోగదారుడి నుంచే వసూలు చేస్తాడు. అంటే, ‘‘కస్టమర్‌పై నేరుగా చార్జీ లేదు’’ అనే మాట కాగితం మీద నిజమే అయినా, ఆచరణలో అది ఒక భ్రమ మాత్రమే. మన దినచర్యలో చేసే అనేక కొనుగోళ్లు, ఖర్చులు దీనికి ఉదాహరణ. సామాన్యుడు తన సొంత డబ్బును తానే ఖర్చు పెట్టుకుని, పరోక్షంగా డిజిటల్ పేమెంట్ కంపెనీలకు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది – ఇది దోపిడీ కాక మరేమిటి?
ఇప్పుడు 0.4శాతం, భవిష్యత్తులో ఎంతైనా?
మరో కీలకప్రశ్న – ఈ చార్జీలు ఇక్కడితో ఆగుతాయా? ఒకసారి ‘‘zero-MDR’’ విధానాన్ని రద్దు చేసాక, భవిష్యత్తులో ఈ చార్జీలను పెంచడం, పరిధిని విస్తరించడం (రూ.2వేల పరిమితిని తగ్గించడం వంటివి) రేపు ఎప్పుడైనా జరగొచ్చు. ఇవాళ ‘‘96శాతం లావాదేవీలకు చార్జీ లేదు’’ అని చెబుతున్న ప్రభుత్వమే, రేపు ఆ పరిధిని విస్తరిస్తే అడ్డుకునేదెవరు? ప్రజలు ఈ మొదటి అడుగునే ప్రశ్నించకపోతే, రేపటి భారాన్ని ఆపడం కష్టమవుతుంది.
ఈ ఛార్జీల వలన లాభపడేదెవరు?
యూపీఐ మార్కెట్‌లో జరుగుతున్న లావాదేవీలలో అమెరికా సంస్థలైన వాల్‌మార్ట్‌కు చెందిన ఫోన్‌పే (యాభై శాతం), గూగుల్‌పే (33శాతం) కలిపి 83శాతం వాటా కలిగి ఉన్నాయి. కొత్త ఎండీఆర్ విధానం అమల్లోకి వస్తే, ఈ చార్జీల్లో అత్యధిక భాగం చేరేది ఈ రెండు విదేశీ కంపెనీల ఖాతాల్లోకే. ప్రభుత్వ రంగ బ్యాంకుల యాప్‌లకు ఈ మార్కెట్‌లో ఒక శాతం వాటా కూడా లేదు -అంటే, ఈ వ్యవస్థను నిర్మించింది, నడిపిస్తున్నది ఎవరో, దాని ఫలాలు అనుభవించేదీ వాళ్లే.
USAID ఒప్పందంతో మొదలైన కథ
ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలంటే, పదేండ్ల వెనక్కి వెళ్లాలి. 2015 సెప్టెంబర్‌లో, భారత ప్రభుత్వం అమెరి కాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (USAID) సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థలో అనేక అమెరికా ప్రభుత్వ శాఖలతో పాటు మైక్రోసాఫ్ట్, మాస్టర్కార్డ్, బిల్గేట్స్ ఫౌండేషన్, గూగుల్, వాల్మార్ట్ లాంటి అనేక టెక్ కంపెనీలు, ఎన్‌జీఓలు భాగస్వాములు. అభివృద్ధి కంటే వాటి వ్యాపార ప్రయోజనాలను విస్తరించు కోవటమే లక్ష్యం. ఇతర అంశాలతోపాటు ఆ సమయంలో భారతదేశంలో తొంభై శాతానికి పైగా లావాదేవీలు నగదు రూపంలోనే జరిగేవి. ఈ నగదు వ్యవస్థను డిజిటల్‌కు మార్చాలన్నదే ఆ ఒప్పంద సారాంశం. కానీ, ఈ అసలు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా, 2016 నవంబర్‌లో పెద్దనోట్ల రద్దును దేశభక్తి నినాదాలతో ప్రకటించారు – నల్లధనం వెలికితీత, నకిలీ నోట్ల నిర్మూలన, ఉగ్రవాద ఆర్థిక మూలాలను దెబ్బతీయడం లక్ష్యాలుగా చెప్పారు. డిమానేటిసేషన్ వల్ల ప్రకటించిన ఏ లక్ష్యాలు నెరవేరలేదనేది వాస్తవం.
పార్లమెంటులో కాని బయట కానీ ఈ అంశాలమీద చర్చకు ప్రభుత్వం నిరాకరి స్తున్నది. కానీ ఆశ్చర్యకరంగా, డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు మాత్రం అనూహ్యంగా పెరిగాయి – 2016లో నెలకు మూడు లక్షలు మాత్రమే ఉన్న లావాదేవీలు, 2026 నాటికి 2,366 కోట్లకు చేరాయి. ఈ వ్యవస్థకు కేంద్రంగా మారిన విదేశీ కంపెనీలు ఇప్పుడు తమ లావాదేవీలపై చార్జీలు విధించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఫలితంగానే చట్ట సవరణ, ఆ వెంటనే ఈ నోటిఫికేషన్ వచ్చాయి. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగినది కాదు – ఒక పథకం ప్రకారం, దశలవారీగా అమలైన ప్రక్రియ. సామాన్య ప్రజలు తమ సొంత డబ్బును తామే వాడుకుంటూ, ఆ చెల్లింపుల మీద వేల కోట్ల రూపాయలు అమెరికన్ కంపెనీలకు ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి రావడం అన్యాయం. ‘‘కస్టమర్‌పై భారం లేదు’’ అనే ప్రభుత్వ వాదన వాస్త వాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం మాత్రమే. ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ నిశితంగా గమనించాలి, ప్రశ్నించాలి, వ్యతిరేకించాలి. ప్రభుత్వం ఈ ఎండీఆర్ నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయో చూస్తున్నాం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA) నినాదంతో చేస్తున్న నిర్ణయాలన్నీ అమెరిక కార్పొరేట్ రంగానికి లాభాలు సంపాదించే లక్ష్యంతో చేస్తున్నవే. పాలస్తీన, ఇరాన్ వెనిజువెల దేశాలలో అమెరికా యుద్ధోన్మాదం ఆదేశాల సహజవనరుల మీద పెత్తనం కోసం ఉద్దేశిం చినవే. రష్యా తో వాణిజ్యం చేస్తున్నదనే నెపంతో మన దేశ దిగుమతుల మీద వంద శాతం పన్నులు ప్రకటించింది అమెరికా. ఈ విధానాలను అడ్డుకొని మన దేశ విదేశీ ఎగుమతులను రక్షించాల్సింది పోయి, మరింత మేలు చేసే విధంగా డిజిటల్ లావాదేవీల మీద చార్జీలు విధించటాన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలి.
పి.వెంకటరామయ్య, 9553533815



