కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు బత్తాయి రైతుల విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్ : నల్గొండ జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా వేలాది ఎకరాల్లో సాగవుతున్న బత్తాయి పంటకు శాశ్వత మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ జిల్లా కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం జిల్లా కమిటీ శుక్రవారం హైదరాబాద్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. జిల్లాలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా బత్తాయి సాగు చేస్తున్నప్పటికీ రైతులు తమ పంటను విక్రయించుకునేందుకు ఇప్పటికీ సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నారని కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. మార్కెట్‌పై మధ్య దళారుల ఆధిపత్యం కొనసాగుతుండటంతో రైతులకు గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. బత్తాయి రైతులకు నాణ్యమైన పురుగు మందులు అందుబాటులో లేకపోవడంతో నాసిరకం మందులను వినియోగించాల్సి వస్తోందని, మరోవైపు వాతావరణ మార్పుల కారణంగా పంట దిగుబడి తగ్గుతోందని పేర్కొన్నారు. దిగుబడి వచ్చిన పంటను కూడా సరైన ధరకు విక్రయించుకోలేక రైతులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి బత్తాయి రైతులను ఆదుకోవాలని కోరారు.
డిమాండ్లు
ఓడీఓపీ (ODOP) కింద నల్గొండ జిల్లాలో సిట్రస్ క్లస్టర్ అభివృద్ధి చేయాలని రైతు సంఘం ప్రతినిధులు కోరారు. బత్తాయి రైతుల కోసం ప్రత్యేకంగా ఎఫ్‌పీఓ (FPO) ఏర్పాటు చేయాలని, నల్గొండను బత్తాయి మార్కెట్ కేంద్రంగా అభివృద్ధి చేసి ఆటోమేటెడ్ గ్రేడింగ్ మెషీన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా నల్గొండ బత్తాయి మార్కెట్‌ను పునఃప్రారంభించి, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా వంటి ప్రధాన మార్కెట్లతో అనుసంధానం చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. బత్తాయి రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే శాశ్వత మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండ మాజీ శాసనసభ్యులు నంద్యాల నరసింహారెడ్డి, బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం సహాయ కార్యదర్శి నిర్మల్‌రావు, కమిటీ సభ్యులు వాసుదేవరెడ్డి, గుర్రం శ్రీనివాస్‌రెడ్డి, ప్రవేశ్‌సింగ్ తదితర బత్తాయి రైతులు పాల్గొన్నారు.



