Saturday, September 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభూముల కబ్జా కోసమే సాయుధ పోరాటానికి మతం రంగు

భూముల కబ్జా కోసమే సాయుధ పోరాటానికి మతం రంగు

- Advertisement -

నాడు భూములు పంచితే.. నేడు లాక్కుంటున్నారు : రైతు నేత సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభలో బి.వెంకట్
నవతెలంగాణ-ముషీరాబాద్‌

​భూములను కబ్జా చేసేందుకే వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు పూస్తున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. నాడు ప్రజా పోరాటాల ఫలితంగా పేదలకు భూములు పంచితే.. నేడు నయా ధనిక వర్గాలు, కార్పొరేట్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అభివృద్ధి పేరుతో పేదల భూములను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్‌ అధ్యక్షతన శుక్రవారం రైతు సంఘం సీనియర్‌ నాయకు‌లు, అఖిల భారత ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ.. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, నిర్వాసితులు, ఆదివాసీలు, దళితులు, గిరిజనుల సమస్యలపై సారంపల్లి మల్లారెడ్డి నిరంతరం అధ్యయనం చేసి పోరాడేవారని గుర్తుచేశారు. ‘దున్నేవాడికే భూమి’ అనే నినాదంతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని, దాని ఫలితంగా కౌలుదారులకు భూమిపై హక్కులు, భూసంస్కరణ చట్టాలు వచ్చాయని తెలిపారు.

భూ పరిమితి చట్టాల ద్వారా లక్షలాది మంది పేదలకు ప్రభుత్వ భూములను పంపిణీ చేసి అసైన్డ్‌ చేశారని, వెట్టిచాకిరీ నుంచి పేదలకు విముక్తి లభించింద‌ని చెప్పారు. నాడు భూముల వికేంద్రీకరణ కోసం చట్టాలు వస్తే.. నేడు అభివృద్ధి పేరుతో పేదల భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. మిగులు భూములను పేదలకు పంపిణీ చేసేందుకు భూసంస్కరణ చట్టాలను అమలు చేయాలని, పెరుగుతున్న ధరలను నియంత్రించాలని, పట్టణ పేదలకు ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయకపోతే గోదాముల ముట్టడికి పేదలు సిద్ధమవుతారని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్ రాములు మాట్లాడుతూ.. సారంపల్లి మల్లారెడ్డి మరణం రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఉద్యమాలకు తీరని లోటన్నారు. భూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో, అసైన్డ్‌ చట్టాలు, అటవీ హక్కుల చట్టం, భూ నిర్వాసితుల చట్టాల అమలులో ప్రభుత్వాల లోపాలను ఎత్తిచూపడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి కుమారుడు సారంపల్లి వాసుదేవ రెడ్డి, నాయకులు అన్నవరపు కనకయ్య, కొండమడుగు నర్సింహ, నారి ఐలయ్య, సాధుల శ్రీనివాస్‌, సాంబశివ, స్కైలాబ్‌ బాబు, పైళ్ల ఆశయ, అడ్వయ్య, బి.పద్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -