Saturday, September 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమ్మె విరమించండి..సమస్యలు పరిష్కరిస్తాం

సమ్మె విరమించండి..సమస్యలు పరిష్కరిస్తాం

- Advertisement -

రైస్‌‌మిల్లర్లతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తమ సమస్యలపరిష్కారం కోసం రైస్‌ ‌మిల్లుల బంద్‌‌కు పిలుపునిచ్చిన రైస్‌ ‌మిల్లర్ల అసోసియేషన్లతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది. రైస్‌ మిల్లర్ల సమస్యలకు సామరస్యపూర్వక పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగేసింది. శుక్రవారం అసెంబ్లీ కమ్యూనిటీ హాల్‌‌లో మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు జరిపారు. చర్చల్లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌‌రెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్‌‌బాబు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్, అదనపు డైరెక్టర్ రోహిత్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున తూడి దేవేందర్ రెడ్డి, గంప నాగేందర్, మోహన్ రెడ్డి, గణపతి రెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి మాట్లాడుతూ మిల్లర్లను ప్రత్యర్థులుగా కాకుండా ధాన్యం కొనుగోలు వ్యవస్థలో భాగస్వాములుగా చూస్తామని భరోసా ఇచ్చారు. రైతుల ప్రయోజనాలు, ప్రజాధన పరిరక్షణ, మిల్లింగ్‌ రంగం స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మిల్లర్ల వినతులను సానుకూల దృక్పథంతో పరిశీలించి సాధ్యమైన పరిష్కారం చూపుతామని చెప్పారు. మిల్లర్లపై అనవసర భారం మోపాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. రైతులకు చెల్లించిన మద్దతు ధరను, ప్రభుత్వ వడ్డీ భారాన్ని విస్మరించలేమని స్పష్టం చేశారు.

బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ వాస్తవ వ్యయం కంటే తక్కువకు టెండర్‌ ధాన్యం ధర నిర్ణయించడం సాధ్యంకాదని వెల్లడించారు. ప్రజాధనాన్ని తిరిగి రాబట్టుకోవడమే లక్ష్యం తప్ప మిల్లర్లపై అదనపు భారం వేయడం కాదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం విధించిన పెనాల్టీలంటూ మిల్లర్ల సమస్యలను పక్కన పెట్టబోమని భరోసా ఇచ్చారు. పెనాల్టీలు, టెండర్‌ ధరలు, స్టాక్‌ వ్యత్యాసాలు, పెండింగ్‌ సరఫరాలపై సమగ్ర పరిశీలన చేయిస్తామని తెలిపారు. ఏడాది, రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న సరఫరాలతో పౌర సరఫరాల సంస్థపై వడ్డీ భారం పెరిగిందని చెప్పారు. మిల్లర్ల ఆర్థిక ఇబ్బందులను గౌరవిస్తూనే రైతుల ప్రయోజనాలను కాపాడుతామని వివరించారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని గుర్తించి ప్రస్తుత సమ్మెను విరమించాలని మిల్లర్లకు విజ్ఞప్తి చేశారు. మిల్లర్ల డిమాండ్ల పరిశీలనకు నాలుగైదు రోజుల గడువు ఇవ్వాలని మంత్రి కోరారు. నాలుగైదు రోజుల్లో మిల్లర్ల ప్రతినిధులతో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఏకపక్ష నిర్ణయాలకు తావులేకుండా పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం చేస్తామన్నారు. ఘర్షణకు బదులు చర్చలతో సమస్యకు ముగింపు పలకాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. రైతు సంక్షేమం, ప్రజాధనం, మిల్లింగ్‌ రంగం ప్రయోజనాల మధ్య సమతుల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పునరుద్ఘాటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -