భాస్కరాచార్య కళాశాల అధ్యక్షుడిగా
ఎస్ఎఫ్ఐ అభ్యర్థి ఆర్చీ బిశ్వాస్ విజయం
సౌత్ క్యాంపస్‌లో ఎస్ఎఫ్ఐ మద్దతు ప్యానల్ క్లీన్‌స్వీప్
ఇతర కళాశాలల్లోనూ వామపక్ష విద్యార్థి సంఘం సత్తా
నవతెలంగాణ–న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ యూనివర్సిటీ కళాశాలల విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ కాషాయ కోటను బద్దలు కొట్టింది. ఏబీవీపీకి దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న భాస్కరాచార్య కాలేజ్ ఆఫ్ అప్లైడ్ సైన్స్‌లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఆర్చీ బిశ్వాస్ అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. దశాబ్ద కాలంలో తొలిసారిగా కళాశాల యూనియన్ అధ్యక్ష పదవిని ఎస్ఎఫ్ఐ గెలుచుకుంది. ఇరువర్గాల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ఆర్చీ బిశ్వాస్ 372 ఓట్లు సాధించి గెలుపొందారు. ఏబీవీపీ అభ్యర్థికి 347 ఓట్లు వచ్చాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ ఉపాధ్యాయ, బోధనేతర ఉద్యోగ సంఘాలు బలంగా ఉన్న కళాశాలలో ఎస్ఎఫ్ఐ సాధించిన విజయం ప్రాధాన్యత సంతరించుకుంది. కళాశాల ప్రిన్సిపల్ గతంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తి కావడం గమనార్హం. అణచివేత, వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ విద్యార్థులు ఎస్ఎఫ్ఐకు అండగా నిలిచారని ఆ సంఘం పేర్కొంది. మిగిలిన జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిలర్ పదవులను ఎన్ఎస్యుఐ అభ్యర్థులు గెలుచుకున్నారు. దీంతో ఈ కళాశాలలో ఏబీవీపీ ఒక్క పదవీ దక్కించు కోలేకపోయింది.
‘సాకిర్ హుస్సేన్’లో ఎస్ఎఫ్ఐ పట్టు
సాకిర్ హుస్సేన్ కళాశాలలో జాయింట్ సెక్రటరీ పదవిని ఎస్ఎఫ్ఐ అభ్యర్థి జీతేంద్రకుమార్ గెలుచుకున్నారు. అధ్యక్ష పదవిలో ఏబీవీపీ తిరుగుబాటు అభ్యర్థి విజయం సాధించగా, సెక్రటరీ పదవిని ఎన్ఎస్యుఐ తిరుగుబాటు అభ్యర్థి కైవసం చేసుకు న్నారు. దీంతో ప్రధాన విద్యార్థి సంఘాల మధ్య పోటీ తీవ్రంగా సాగినట్లు ఫలితాలు వెల్లడించాయి.
‘హాన్స్‌రాజ్’లోనూ సత్తా
తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన హాన్స్‌రాజ్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఏబీవీపీకి గట్టి పోటీ ఇచ్చింది. వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసిన ఎస్ఎఫ్ఐ అభ్యర్థి శ్రిజన్ కశ్యప్ సుమారు 1,100 ఓట్లు సాధించారు. ఏబీవీపీ అభ్యర్థికి 1,400 ఓట్లు వచ్చాయి. తక్కువ తేడాతో ఓటమి ఎదురైనా ఎస్ఎఫ్ఐ ప్రదర్శన విద్యార్థి రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
సౌత్ క్యాంపస్‌లో సంపూర్ణ విజయం
ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో ఎస్ఎఫ్ఐ మద్దతు ఇచ్చిన ప్యానల్ అన్ని స్థానాల్లో విజయం సాధించింది. ఇతర కళాశాలల్లో ఏబీవీపీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, పలు చోట్ల ఎస్ఎఫ్ఐ గట్టి పోటీనిచ్చింది. ఈవెనింగ్ కళాశాలల ఫలితాలు అర్ధరాత్రి వరకు వెలువడే అవకాశం ఉందని సమాచారం. మిరాండా హౌస్ సహా మరికొన్ని కళాశాలల్లో ఎస్ఎఫ్ఐ విజయంపై ఆశలు వ్యక్తమవుతున్నాయి.
నేడు కేంద్ర ప్యానల్ ఫలితం
ఢిల్లీ యూనివర్సిటీ కేంద్ర విద్యార్థి సంఘం ప్యానల్ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. ఎస్ఎఫ్ఐ–ఎఐఎస్ఎ కూటమి ఈసారి మెరుగైన ప్రదర్శన చేస్తుందని విద్యార్థి సంఘాల వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా ఇరువర్గాలు భారీగా ధనబలం వినియోగించాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, భాస్కరాచార్య కళాశాలలో ఎస్ఎఫ్ఐ విజయం ప్రత్యేక ప్రాధాన్యత పొందింది.
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో కాషాయ కోట బద్దలు
- Advertisement -
- Advertisement -



