ఏడుగురు మృతి
కారు కల్వర్టును ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు
ఔటర్ రింగ్ రోడ్డుపై ముగ్గురు..
నవతెలంగాణ- శంషాబాద్/శామీర్ పేట
హైదరాబాద్ నగర సమీపంలో శనివారం వేర్వేరు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఓ కుటుంబం గణేష్ నిమజ్జనం ముగించుకుని స్వస్థలానికి వెళ్తుండగా వారి కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున జరిగింది. అలాగే, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌పై జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణం కోల్పోయారు. శంషాబాద్ ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వై. సురేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూ బ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం, మెట్టుగడ్డ తండాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కేతవత్ లింబ్య(54) , కేతవత్ జమున (45), కేతవత్ మాన్‌సింగ్ (45), కేతవత్ వాస్రామ్ (45) హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్లారు. అక్కడ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని తిరిగి కారులో వస్తుండగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పాలమాకుల సమీపంలో జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొని కింద పడిపోయింది. ఈ ఘటనలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్ సభావట్ అశోక్ కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అశోక్‌ను శంషాబాద్ లోని ట్రైడెంట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. దూరప్రాంతం నుంచి వాహనం నడపడం.. డ్రైవర్ నిద్రమత్తు వల్లే కారు అదుపు తప్పి ఉండొచ్చని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు.
ఓఆర్ఆర్ పై ప్రమాదం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌పై శనివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. శామీర్ పేట ఓఆర్ఆర్ పై స్టేషనరీ లోడుతో వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం ఫుట్‌వే బ్రిడ్జి వద్ద టైర్ పంక్చర్ కావడంతో ఎమర్జెన్సీ లైన్‌లో నిలిచింది. డ్రైవర్ టైర్ మారుస్తుండగా.. స్క్రాప్ లోడుతో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన టాటా ట్రక్ ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకు (32), హైదరాబాద్‌కు చెందిన ఇస్మాయిల్ హుస్సేన్ (26) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ఇబ్రహీం అలియాస్ షేక్ అమీర్(19)ను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. టాటా ట్రక్ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శామీర్‌పేట సీఐ కె. నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



