జూలూరి గౌరీ శంకర్ సంపాదకత్వంలో వెలువడిన ‘వెంటాడే కలాలు – వెనుకబడిన కులాలు’ కవితా సంకలనం భారతీయ సమాజంలోని వెనుకబడిన కులాల జీవన అపోహలను, శ్రమను, ఆత్మగౌరవ పోరాటాన్ని అక్షరబద్ధం చేసిన చారిత్రక సాహిత్య పత్రం. ఇది కేవలం కవిత్వం మాత్రమే కాదు.. సమాజాన్ని ఆవహించిన ఆర్థిక, రాజకీయ, సాంఘిక వ్యసనాలు, రుగ్మతలను విశ్లేషించే ఒక లోతైన సామాజిక దర్శనం.
గౌరీ శంకర్ కవిత చెప్పినట్లు.. శతాబ్దాలకు శ్వాసగా, కాలానికి కాళ్లు-చేతులుగా మారి భూమిని పిండి చేసి భవంతులు లేపిన శ్రమజీవులకు దక్కింది పేదరికమే. అంబటి వెంకన్న ‘జిల్లేడు పువ్వు’ కవితలో చూపించిన కమ్మరి, అలాగే కుమ్మరి, చేనేత వంటి కులవృత్తులు సమాజ వికాసానికి పునాది వేసినప్పటికీ, వారి జీవితాలు తీవ్రమైన ఆర్థిక దుర్భరత్వంలోనే మిగిలిపోయాయి. అనిశెట్టి రజిత ‘ముడత కులచీరా’ ద్వారా వ్యక్తపరిచినట్లు.. పెద్దింటి వారు ఇచ్చే పాత గుడ్డలను కట్టుకోవాల్సిన పరిస్థితి.. సామాజిక శ్రమకు దక్కాల్సిన న్యాయమైన ఆర్థిక వాటా దక్కకపోవడమే కారణం.
మందవరపు హైమావతి కవిత స్పష్టం చేసినట్లు.. ఆధునికత పెరిగినా ‘అద్దె ఇల్లు దొరకాలన్నా, చదువు రావాలన్నా కులమే ప్రామాణికం’ అవుతోంది. జననంతో మొదలయ్యే కులముద్ర మనిషి ఉనికినే ప్రశ్నిస్తోంది. ఏ. దుర్గాప్రసాద్ ‘దేవదాసి’ కవితలో, అలాగే జీవి విజయలక్ష్మి ‘పోదిలో కత్తి’ కవితలో సాంఘిక అణచివేత ప్రతిఫలిస్తుంది. మతాధిపత్యం, పురుషాధిక్యత కలిసి వెనుకబడిన, అణగారిన వర్గాల స్త్రీలను ఎలా బలితీసుకున్నాయో, వారి ఆత్మగౌరవం ఎలా దెబ్బతిన్నదో ఇది ఆవిష్కరిస్తుంది. బెల్లి యాదయ్య ‘మట్టి వారసత్వం’ కవితలో శ్రమ సంస్కృతిని, సంప్రదాయ గౌరవాన్ని పునరుద్ధరించే ప్రయత్నం కనిపిస్తుంది. మట్టిని, శ్రమను గౌరవించని సమాజం మనిషిని గౌరవించలేదనే ప్రాథమిక సాంఘిక సత్యాన్ని ఇది నొక్కిచెబుతుంది. బాణాల శ్రీనివాసరావు ‘కుంపటి’ కవితలో.. ఇన్నాళ్లూ గంగిరెద్దుల్లా ఆడించబడిన సమూహాలు, తమ తెలివిని చీకటి గుహల్లో బంధించిన వ్యవస్థలను బద్దలు కొడుతున్నాయి.
ఈ విధంగా కవులు తమ పదునైన అక్షరాల ద్వారా శాసించే శక్తిని, చైతన్యాన్ని రగిలిస్తున్నారు. గాయాల గేయాలను కొత్త రాగాలుగా మలచుకుంటూ, బందీలుగా ఉన్న సమూహాలు వెలుగు కాగడాలై ప్రశ్నించడమే రాజకీయ చైతన్యానికి సంకేతం. ‘వెంటాడే కలాలు – వేటాడే వెనుకబడిన కులాలు’ పుస్తక సంకలనం భారతదేశంలో ఆధునికత వెనుక దాగి ఉన్న కుల సంస్కృతి వైపరీత్యాన్ని ప్రశ్నిస్తుంది. శ్రమజీవుల వేదనను అక్షరీకరించడమే కాకుండా, సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం సాధించడానికి ‘సాహిత్య పోరాటం’ ఏ విధంగా దోహదపడుతుందో ఈ కవితలు నిరూపిస్తాయి.
(‘వెంటాడే కలాలు వెనకబడిన కులాలు’ సంకలనం రజతోత్సవ సభ సెప్టెంబర్ 20న ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాదులో జరుగుతున్న సందర్భంగా)
డా. పూసపాటి వేదాద్రి, 9912197694
అక్షరాలల్లో ఆవేదన
- Advertisement -
- Advertisement -



