Sunday, September 20, 2026
E-PAPER
Homeసమీక్షదాశరథి కృష్ణమాచార్యులఆఖరి ఆణిముత్యాలు

దాశరథి కృష్ణమాచార్యులఆఖరి ఆణిముత్యాలు

- Advertisement -


తెలంగాణ సాయుధ పోరాటానికి కలంయోధుడై, నిజాం నిరంకుశ పాలనపై రుద్రవీణను మోగించి, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గర్జించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు. తన గొంతుకు విలువ కట్టిన నిజాం సర్కారుపై అగ్నిధారలు కురిపించి, ప్రజల గొంతుకై నిలిచిన నిస్వార్థ పోరాట యోధుడు. అలాంటి అభ్యుదయ కవితా యోధుడు తన జీవితపు చివరి రోజుల్లో సమాజంలో జరిగే ఎన్నో విషయాలను కవితా వస్తువులుగా తీసుకొని ఆలోచనాత్మకంగా తన డైరీలో రాసుకున్న కవితా రత్నాలే ఈ ‘ఆఖరి ఆణిముత్యాలు’. దాశరథి సినిమా పాటలపై పరిశోధన చేసిన యువకవి, సినీగేయ రచయిత డా.తిరునగరి శరత్ చంద్ర, దాశరథి కుటుంబ సభ్యుల అనుమతితో వారి స్వహస్తాలతో రాసుకున్న డైరీలోని అముద్రిత కవితలను సేకరించారు. ఆ డైరీలోని దాశరథి దస్తూరిని అర్థం చేసుకుని, ఆ కవితలకు తిరిగి ప్రాణం పోసి సమాజానికి అందించాలనే సత్సంకల్పంతో శ్రమించి ఐ.ఐ.ఎం.సి ప్రిన్సిపల్ కూర రఘువీర్ గారి సహకారంతో ఐ.ఐ.ఎం.సి. పబ్లికేషన్‌గా ఈ పుస్తకానికి ‘దాశరథి కవితాఝరి’ అని పేరు పెట్టి మీ ముందుకు తీసుకువస్తున్నారు.
1985-1987 మధ్యకాలంలో రాసిన గేయాలు, వచన కవితలు, రుబాయీలు, ఒక పాట, ఒక ప్రసంగ పాఠంగా దాశరథి సాహిత్య వైభవం 41 అంశాలుగా ఈ సంకలనంలో విస్తరించింది. మచ్చుకు కొన్ని చూసినట్లయితే ‘సాధనలో ఆరాధన’ అనే గేయంలో కవి, గాయకుడి అనిర్వచనీయమైన అనుభూతిని ఆవిష్కరించారు. సప్తగిరుల స్వామి వేంకన్నను కలియుగ ప్రభువుగా, అభయహస్తంతో సంకటాలు తీర్చే అప్పడిగా కీర్తిస్తూ ‘వెంకన్న కొండ’ కవిత రాశారు.
‘ఎంత? యెంతెంత?’లో అన్యాయం, దోపిడీ, అహంకారం రాజ్యమేలితే సమాజంలో నిజాయితీ, మానవతా విలువలు శూన్యమవుతాయని నిలదీశారు. ‘నందనవనమే భారతము’ గేయం అందరం ఐకమత్యంగా నడిచినపుడే భారతదేశం సుభిక్షంగా ఉంటుందని, ద్వేషాలు, రోషాలు మానుకుని కులమత భేదాలు లేకుండా సోదరభావంతో మెలగాలని చెబుతుంది. ‘దేశాన్ని కాపాడే ధీరులారా!’లో సరిహద్దుల్లో రక్షణ కవచంలా నిలిచిన వీరసైనికులను కీర్తించారు.
‘డిన్నర్ కి వొచ్చిన డెత్’లో యుద్ధం, ఉగ్రవాదం వల్ల మనిషి రక్తానికి ధరపడిపోయిన దుస్థితిని ఆవేదనతో ప్రశ్నిస్తూ శాంతి, సత్యం, త్యాగమార్గంలో నడవాలని పిలుపునిస్తూ మానవతా, శాంతి సందేశంను ఉపదేశించారు. ఇలా ఇందులో 58 రుబాయీలు ఉన్నాయి. పర్షియన్ భాషలో పుట్టి ఉర్దూ, హిందీ, తెలుగు భాషల్లోకి వ్యాపించిన ఈ సాహిత్య ప్రక్రియకు తెలుగులో ఆద్యుడు దాశరథే. ముఖ్యంగా ‘తొలి తెలుగు గజల్’ అనే గజల్ గురజాడ అప్పారావు మీద రాసినది. నిజానికి తొలి తెలుగు గజల్‌ని రాశారని ముత్యాలసరాలు పర్షియన్ ఛందస్సుని పోలి ఉందని దాశరథి అంటారు. అదే విధంగా ఈ పుస్తకంలో దాశరథి చేతిరాతతో రాసిన కొన్ని కవితలను, వారి గురించిన ప్రముఖుల ప్రశంసలు, వారి అరుదైన చిత్రమాలికను పొందుపరిచారు. మొత్తంగా ఈ పుస్తకం కేవలం కవితా సంకలనం కాదు, ఒక మహాకవి చివరి శ్వాస వరకు సమాజాన్ని ఎలా పరిశీలించాడో, స్పందించాడో చెప్పే సజీవ దస్తావేజు.

రామకృష్ణ ఇరుకుల్ల, 9885521904

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -