నన్నెందుకో…
మా ఊరు
నేను ఓడిపోయిన ప్రతిసారీ
వెన్ను తట్టి లేపుతుంది…
“నువ్వు ఇలా ఉండాలి…
ఇలా ఉండకూడదు…”
అని చెప్పకనే చెబుతుంది.
మరి ఎందుకో…
నా గర్వంతో
నా కళ్ళు పైకి ఎక్కిన ప్రతిసారీ
నన్ను కిందకు పడేసి తొక్కుతుంది…
నేను తొక్కబడిన ప్రతిసారీ
నాకు ఒక వేదాంతం బోధిస్తుంది.
అప్పుడే అర్థమవుతుంది…
నేను ఎవరో కాదు…
నేను ఎలా ఉండాలో.
మా ఊరు
నాకు ఒక పాఠశాల.
ఆ పాఠశాలలో
ఉండే మనుషులే
నా గురువులు.
వాళ్లు పుస్తకాలు పట్టుకుని
పాఠాలు చెప్పరు…
వాళ్ల జీవితాలతో
నాకు పాఠాలు నేర్పుతారు.
మా ఊరు నాకు నేర్పించింది…
మనిషిలో ఉండే
హిపోక్రసీని…
కడుపుమంటను…
కళ్లమంటను…
అర్థం చేసుకోమని.
నీ ముందు నవ్వేవాడు
నీ మనిషే కావాల్సిన అవసరం లేదని…
నీ వెనుక మాట్లాడేవాడు
నీ శత్రువే కావాల్సిన అవసరం లేదని…
మనుషులను
వాళ్ల మాటలతో కాదు…
వాళ్ల అవసరాలతో,
వాళ్ల ప్రవర్తనతో
అర్థం చేసుకోమని…
మా ఊరు నన్ను
“నువ్వు దొంగవు…
నువ్వు లంగవు…”
అని చూడదు.
“బిడ్డా…”
అని దగ్గరకు పిలిచి…
“నువ్వు ఎంత సమర్థుడివి?
నువ్వు ఎవరికైనా
ఎంత ఉపయోగపడగలవు?”
అదే చూస్తుంది.
అదే నేర్పిస్తుంది…
బ్రతకడం ఎలాగో…
మనుషుల మధ్య బ్రతకడం ఎలాగో…
ఎదగడం ఎలాగో…
ఎదిగినా నేలను మర్చిపోకుండా
ఉండడం ఎలాగో…
మా ఊరిలో
అందరూ మేధావులు కాదు…
కానీ
ప్రతి ఒక్కరూ నాకు ఒక పాఠమే.
అందుకే
మా ఊరిలోని ప్రతి మనిషీ
నాకు ఒక గురువే.
ఎన్నోసార్లు
నన్ను కిందకు లాగారు…
ఎన్నోసార్లు
నన్ను నిలబెట్టారు…
ఎన్నోసార్లు
నా గర్వాన్ని పగలగొట్టారు…
కానీ ప్రతిసారీ
నన్ను నాకే కొత్తగా పరిచయం చేశారు.
అందుకే…
మా ఊరి మహానుభావులందరికీ
నూటొక్క నమస్కారాలు.
ఇంతకీ…
మా ఊరి పేరు చెప్పనే లేదు కదూ!
నా ఊరు…
దేవరాంపల్లి.
ఆ మట్టి వాసనలో పెరిగిన మనుషులు…
వాళ్ల మాటల్లో ఉన్న జీవిత సారం…
వాళ్ల చూపుల్లో ఉన్న అనుభవం…
ప్రతిరోజూ
నన్ను నేను గుర్తు చేసుకునేలా చేసే
నా ఊరు…
నా దేవరాంపల్లి.
నా మీద కోపపడినా…
నన్ను కిందకు లాగినా…
నన్ను తప్పుపట్టినా…
చివరికి
“బిడ్డా… నువ్వు బాగుండాలి”
అనే మనసున్న
నా ఊరి మనుషులందరికీ…
వందనాలు.
భావాదీయుడు
..
సాగర్ దుర్గం
మా ఊరు నాకు పాఠశాల
- Advertisement -
- Advertisement -



