Wednesday, September 23, 2026
E-PAPER
Homeజాతీయంకార్మికులకు అతి తక్కువ వేతనాలు

కార్మికులకు అతి తక్కువ వేతనాలు

- Advertisement -

​ శారీరక శ్రమను గుర్తించడంలో సమాజం విఫలం: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: దేశంలోని కార్మికులకు అతి తక్కువ వేతనాలు లభిస్తున్నాయనీ, వారి విషయంలో తగిన శ్రద్ధ లేదనీ, వారి శారీరక శ్రమను గుర్తించి గౌరవించడంలో సమాజం విఫలమైందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. తన నిద్రకు భంగం కలిగించవద్దని కోరిన ఓ కార్మికుడిపై దాడి చేసిన కేసులో నిందితునికి ట్రయల్‌ కోర్టు ఐదేండ్లు జైలుశిక్ష విధించగా.. దాన్ని సవాల్‌ చేస్తూ నిందితుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘కఠినమైన శారీరక శ్రమ చేసే కూలీలు మరుసటి రోజు పనులకు సిద్ధం కావాలంటే.. వారికి రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర అవసరం. అయితే.. దేశంలోని కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. వారికి తక్కువ వేతనాలు ఉంటాయి. ఎవరూ వారిని పట్టించుకోరు. పాశ్చాత్య దేశాల్లో శారీరక శ్రమకు తగిన వేతనం, విలువ ఇస్తారు. ఈ విషయంలో మన సమాజం విఫలం కావడం దయనీయం’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఏం జరిగింది..?
2002లో రాజిందర్‌ కుమార్‌ అనే కార్మికుడు ఢిల్లీలోని చాందినీ చౌక్‌ మార్కెట్‌లో తాను పనిచేస్తున్న దుకాణం ఆవరణలో నిద్రపోయాడు. ఆ సమయంలో వీర్‌పాల్‌ అనే వ్యక్తి మరికొందరితో కలిసి సృష్టించిన గొడవతో రాజిందర్ నిద్రకు భంగం వాటిల్లింది. దీంతో ఆ కార్మికుడు వారిని వారించగా ఆగ్రహించిన వీర్‌పాల్‌..పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో పాల్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. ట్రయల్‌ కోర్టు ఐదేండ్లు జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్‌ చేస్తూ నిందితుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఆ ఇద్దరికి ఎలాంటి పాత కక్షలు లేవని గుర్తించిన హైకోర్టు.. శిక్షను మూడేండ్లకు కుదించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -