ప్రధాని హామీలతో ఫ్రాన్స్‌లో ఆందోళన విరమించిన రైతులు

పారిస్‌: తమ డిమాండ్ల సాధనకై గత కొద్ది రోజులుగా ఫ్రాన్స్‌వ్యాప్తంగా రైతులు ఆందోళనలు, నిరసనలు సాగిస్తున్న నేపథ్యంలో ప్రధాని గాబ్రియెల్‌ అట్టల్‌ హామీలివ్వడంతో ప్రధానంగా రెండు రైతు సంఘాలు శుక్రవారం తమ ఆందోళనను విరమించాయి. తక్కువ ఆదాయాలు, భారీగా ఆంక్షలు, నియంత్రణలు, విదేశాల నుండి అక్రమ పోటీని నిరసిస్తూ వీరు ఆందోళన చేపట్టారు. ప్రధాని కొన్ని కొత్త చర్యలను ప్రకటించడంతో వారు నిరసనలను విరమించారు. ఫ్రాన్స్‌లోనే అతిపెద్ద రైతు సంఘమైన ఎఫ్‌ఎన్‌ఎస్‌ఇఎ అధ్యక్షుడు, యంగ్‌ ఫార్మర్స్‌ యూనియన్‌ అధ్యక్షడు అర్నాడ్‌ గాలియట్‌లు మాట్లాడుతూ, తక్షణమే హైవేలపై దిగ్బంధనాలను విరమించాల్సిందిగా సభ్యులను కోరినట్లు ప్రకటించారు. ఇబ్బందులు పడుతున్న రైతులకు, వైన్‌ ఉత్పత్తిదారులకు ఆర్థిక తోడ్పాటుకు సంబంధించిన పలు చర్యలను ప్రభుత్వం ప్రకటించిందని అర్నాడ్‌ తెలిపారు. కొత్త చర్యల ప్యాకేజీతో పాటూ మరికొన్ని హామీలను ప్రధాని అట్టల్‌ ప్రకటించారు. మన వ్యవసాయానికి భవిష్యత్తు వుందా అనే ప్రశ్న యూరప్‌ అంతటా తలెత్తుతోందని, దానికి సమాధానం అవుననే చెబుతామని అట్టల్‌ చెప్పారు. బ్రస్సెల్స్‌లో ఇయు ప్రధాన కార్యాలయం వెలుపల రైతాంగాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇయుకు వెలుపల నుండి పళ్ళు, కూరగాయల దిగుమతులను తక్షణమే ఫ్రాన్స్‌ నిషేధిస్తోందని ప్రకటించారు.

Spread the love