లక్నో : అఖిలేష్ యాదవ్ నేతత్వంలోని సమాజ్ వాది పార్టీ (ఎస్‌పీ) మంగళవారం ఉత్తరప్రదేశ్ రాజ్యసభకు తమ అభ్యర్థులను ప్రకటించింది. రామ్‌జీలాల్ సుమన్, జయాబచ్చన్, మాజీ ఐఏయస్ అధికారి అలోక్ రంజన్‌లను నామినేట్ చేసింది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న జయాబచ్చన్‌ను మరోసారి నామినేట్ చేయగా, అల్‌క్ రంజన్‌ను మొదటిసారి ఎంపిక చేసింది. రామ్‌జీ లాల్, జయా బచ్చన్, అలోక్ రంజన్‌లు తమ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థులని, వారు నేడు నామినేషన్లు సమర్పించనున్నట్టు ఎస్‌పీ ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 2017లో 47 మంది ఎమ్మెల్యేలుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 108కి పెరిగింది. దీంతో ఎస్‌పీ ముగ్గురు సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం ఉంది. 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా, నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 15 చివరితేదీ. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.