– ముఖ్యమంత్రికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగలేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ‘అపాయింటెడ్ డే’ అమలు చేయాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఆయన సీఎంకు బహిరంగలేఖ రాసారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం తెలిసిందేననీ, ఎన్నికల కోడ్ రావడంతో ‘అపాయింటెడ్ డే’ నిర్వహించలేదనీ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు దాటినా, ఇంతవరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన ‘అపాయింటెడ్ డే’ ప్రకటించలేదని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించినప్పుడే ఆర్టీసీ విలీనానికి సంబంధించిన జీవో విడుదల చేస్తారని కార్మికులు, ఉద్యోగులు ఆశించారనీ, కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశ పెట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు ముఖ్యంగా మహిళా కండక్టర్లపై పనిభారం పెరిగిందనీ, ఓవర్ లోడ్ వెహికిల్ నడపలేక డ్రైవర్లు, కిక్కిరిసిన బస్సుల్లో కలియ తిరుగుతూ టికెట్లు ఇవ్వడానికి కండక్టర్లు ఎంతో శ్రమించాల్సి వస్తున్నదని తెలిపారు.
డ్రైవర్లు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తున్నదనీ, వారి అదనపు శ్రమను దృష్టిలో పెట్టుకుని అయినా వెంటనే ‘అపాయింటెడ్ డే’ని ప్రకటించి, విలీన జీవో విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది మార్చి నెల నుంచైనా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని కోరారు. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ దృష్ట్యా మరో రెండువేల బస్సులను అదనంగా కొనుగోలు చేయాలని కోరారు. 2013లో జారీ చేసిన పీఆర్సీ బాండ్స్‌కు నగదు చెల్లించాలని ఆ లేఖలో కోరారు.