కేసీఆర్ ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేశారు? : సీపీఐ నారాయణ

నవతెలంగాణ హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంభావం, అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోయినట్టు రాద్ధాంతం చేస్తున్నారని కేసీఆర్ అనడం సరైంది కాదని నారాయణ అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం పద్ధతి కాదని, వివేకవంతుడి లక్షణం కాదని తెలిపారు.
‘‘కేసీఆర్ ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేశారు? అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదు? కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ కోరాలని తెలంగాణ బీజేపీ తెలివిగా వ్యవహరిస్తోంది. కేసు అప్పగిస్తే మేనేజ్‌ చేయాలనుకుంటున్నారు. కేసీఆర్‌ను కాపాడే ప్రయత్నంలో అది భాగమని అన్నారు.  వేల కోట్ల రూపాయల అవినీతికి ఆయన బాధ్యుడు. జరిగిన అవినీతిపై విచారణ చేయించాలి. బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు గడవకముందే విమర్శలు చేయడం ఆ పార్టీ పతనానికి నాంది’’ అని నారాయణ వ్యాఖ్యానించారు.

Spread the love