సింగరేణి కార్మికులకు నజరానా

Nazarana for Singareni workers– రూ. కోటి ఉచిత ప్రమాద బీమా
– సంస్థ ప్రైవేటీకరణను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రోత్సహించింది
– కేసీఆర్‌ హయంలో కార్మికులు నిర్లక్ష్యానికి గురయ్యారు
– కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు సైతం రూ.30 లక్షలు వర్తింపు
– తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారు
– బీఆరెస్‌ పాలనలో నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ
– రూ. 6వేల కోట్ల నుంచి రూ.7 లక్షల కోట్లకు అప్పులు
– ఆర్ధిక నియంత్రణ పాటిస్తూ, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాం
– మోడీ మూడోసారీ పీఎం అయితే రైతులను కాల్చి చంపుతారు
– కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలి?: ఉచిత బీమా ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
”తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సింగరేణి కార్మికులు నిర్లక్ష్యానికి గురయ్యారు. సంస్థను ప్రయివేటుపరం చేయడాన్ని బీఆరెస్‌ అడ్డుకోకపోగా ప్రోత్సహించింది” అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, తుమ్మల నాగేశ్వర్‌ రావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క, కొండా సురేఖతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం సిగరేణి ఎమ్‌డీ బలరాం, యూనియన్‌ బ్యాంక్‌ ప్రతినిధి కారె భాస్కర్‌ రావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి సారిగా సింగరేణి కార్మికులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. పర్మినెంట్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సైతం రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు బీమాను వర్తింప జేయనున్నట్టు తెలిపారు. గత సర్కార్‌ నిర్వాకం వల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ”పదేండ్లలో వందేండ్ల విధ్వంసం జరిగింది. బీఆరెస్‌ పాలనలో నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది. 2014లో రూ.72 వేల కోట్ల అప్పులుంటే పదెండ్ల బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.7 లక్షల కోట్లకు చేర్చారు. ఏటా రూ.6 వేల కోట్లు చెల్లించాల్సిన అప్పులను రూ.70 వేల కోట్లకు చేర్చారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి సర్కారు తిరిగి అప్పులు చేయాల్సిన పరిస్థితి దావురించింది” సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు సృష్టించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, పేదలకు ఉపయోగపడే పనులు చేస్తూ ముందుకెళుతున్నామని చెప్పారు. అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా తమ ప్రభుత్వం చేస్తున్న పనులను అభినందించాల్సింది పోయి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ అబద్దాలు చెబుతున్నారని విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం తప్పిదాలకు గత పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కష్ణా జలాలపై హరీష్‌ రావు మళ్లీ అవే అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు.2014, 2018, మ్యానిఫెస్టోల్లో ప్రజలకిచ్చిన హామీలపై బీఆర్‌ఎస్‌ బీజేపీ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. మూడోసారి మోడీని ప్రధాని చేస్తే ఏం చేస్తారు? రైతులను కాల్చి చంపుతారా? అంటూ ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణ కు కిషన్‌ రెడ్డి ఏం చేశారో చెప్పాలని నిలదీసారు. హైదరాబాద్‌ లో వరదలు వచ్చినపుడు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. రెండు పార్టీలకు కాంగ్రెస్‌ను విమర్శించే నైతిక హక్కులేదని అన్నారు. 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలిచ్చి నిరుద్యోగులకు భరోసా కల్పించామని చెప్పారు. మార్చి 2న మరో 6వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని ప్రకటించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారి కోసం నియోజక వర్గానికొకటి చొప్పున అంబేద్కర్‌ నాలెడ్జి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సింగరేణి ప్రమాద బీమా ముఖ్యాంశాలు
1) ఉద్యోగుల జీతంతో సంబంధం లేకుండా కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా సదుపాయం
2). యూనియన్‌ బ్యాంక్‌ డెబిట్‌ కార్డును నెలలో ఒక్కసారైనా వాడటం ద్వారా అదనంగా 15 లక్షల రూపాయల బీమా ప్రయోజనం.
3). ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా రూ. 1 కోటి 15 లక్షల ప్రమాద బీమా సదుపాయం సింగరేణి ఉద్యోగులకు అందుతుంది.
4). అగ్ని ప్రమాదం జరిగి ప్లాస్టిక్‌ సర్జరీ లాంటి ట్రీట్‌మెంట్‌ అవసరమైతే రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం.
5). ప్రమాదంలో మరణించిన ఉద్యోగి మృతదేహాన్ని తరలించేందుకు రూ. 20 వేల ఆర్థిక సహాయం
6). ప్రమాదంలో ఉద్యోగి చనిపోయే సమయానికి గ్రాడ్యుయేషన్‌ చదివే పిల్లలు ఉన్నట్లయితే రూ.6 లక్షల ఆర్థిక సాయం.
7). ఎయిర్‌ అంబులెన్స్‌ అవసరమైతే 6 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం.
8). ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఇద్దరు కుటుంబ సభ్యులు వెళ్లడానికి వీలుగా రవాణా ఖర్చుకింద రూ.20 వేల ఆర్థిక సాయం.
9). అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే ఏడాదిలో రూ. 15 వేల వరకు ఇన్‌ పేషెంట్‌ కవరేజ్‌ సదుపాయం.
10). విదేశీ విద్యకోసం తీసుకునే రూ. 75 లక్షలకు పైగా రుణాలపై 0:10 శాతం రాయితీ.
11) కుటుంబ సభ్యులు ముగ్గురు (జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు) జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు తెరిచేందుకు అవకాశం
యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాలరీ ప్యాకేజీ కలిగిన సింగరేణి ఉద్యోగులందరికీ ఈ బీమా వర్తిస్తుంది. ఉద్యోగి రిటైర్‌ అయిన తర్వాత పింఛన్‌ ఖాతాను యూనియన్‌ బ్యాంకులోనే కొనసాగించడం ద్వారా 70 ఏళ్ల వరకు ఈ బీమా సదుపాయాన్ని పొందొచ్చు.

Spread the love