మంత్రాలు, చేతబడి బూటకమే..

– ఎస్ఎస్ఎఫ్ జాతీయ కమిటీ సభ్యుడు ఉప్పులేటి నరేశ్
– కేజీవీబీ విద్యార్థినిలకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు 
నవతెలంగాణ – బెజ్జంకి
దయ్యాలు భూతాలు మంత్రాలు బూటకమని..సైన్స్ తో విద్యార్థులు సైనికులుగా ముందుకు నడవాలని సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ నాయకుడు ఉప్పులేటి నరేశ్ తెలిపారు. సీపీ అనురాధ ఆదేశాల మేరకు బెజ్జంకి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కేజీవీబీ విద్యాలయ విద్యార్థినిలకు వ్యక్తిత్వ వికాసం – మూఢనమ్మకాల నిర్మూలన అనే అంశాలపై ఉప్పులేటి నరేశ్ మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడారు. శాస్త్ర విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతున్న తరుణంలో నేటికి గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు మూఢనమ్మకాలు నమ్మడం దురదృష్టకరమన్నారు. ఆలోచనలతో ఆవిష్కరణలు సాధ్యమని సూచించారు. విద్యార్థి దశలోనే మూఢనమ్మకాలు వీడుతూ సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. దొంగ స్వాములు,భూత వైద్యులు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆర్థికంగా మోసం చేస్తున్నారన్నారు. సైన్స్ మ్యాజిక్ షో ద్వార ఇనుప కత్తిని కడుపులో గుచ్చుకోవడం,విద్యార్థి చేతి పై కిరోసిన్ తో కాల్చడం, నోట్లో మంటలు లేపడం,గాలిలో విభూది సృష్టించడం,పేపర్లు కాల్చి చాక్లెట్లు చేయడం,విద్యార్థి వాచిని మాయం చేసి రింగు తీసి ఇవ్వడం వంటి ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్ రావు,ప్రధానోపాధ్యాయురాలు శ్వేత,హెడ్ కానిస్టేబుల్ కనకయ్య,కానిస్టేబుల్స్ శ్రీనివాస్,నవీన్ బోధన సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love