శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు

నవతెలంగాణ – రామారెడ్డి

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని, మండలంలో ఆయా శివాలయాలు భక్తుల శివ నామ స్మరణతో శుక్రవారం వేకువ జాము నుండే మారుమోగాయి. మండలంలోని మద్దికుంట శ్రీ స్వయంభూ బుగ్గ రామలింగేశ్వర స్వామి, పోసానిపేట్ శ్రీ రాజరాజేశ్వర స్వామి, ఉప్పల్వాయితోపాటు గొల్లపల్లి శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. మద్దికుంటలో శివ పార్వతుల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నరసింగ రావు, ధర్పల్లి ఎంపీపీ తదితరులకు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. శివపార్వతుల కళ్యాణం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సందర్శకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చిన్నపిల్లల కోసం ఏర్పాటుచేసిన ఆటవస్తులతో ఆనందంగా గడిపారు. స్వామివారి రథోత్సవం శివ స్వాములు, గ్రామ యువత శివ నామస్మరణతో కనుల పండగ నిర్వహించారు. శివరాత్రి పురస్కరించుకొని దాదాపు 1,50,000 మంది సందర్శకులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పలువురు దాతలు అంబలి, నీటి వసతిని ఏర్పాటు చేశారు. కామారెడ్డి డి.ఎస్.పి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శాంతిభద్రతలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. అత్యవసరానికి అన్నారం పిహెచ్సి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోజారి లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరేందర్, ఆలయ ప్రధాన పూజారి జంగం ప్రభాకర్ స్వామి, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పూజారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love