– పాలస్తీనా ఖండన
– కొనసాగుతున్న దోహా చర్చలు
– ఉత్తర గాజాలో పొంచివున్న కరువు
గాజా : రాఫా నగరంలో ఇజ్రాయిల్ బలగాలు జరుపుతున్న విధ్వంసక చర్యలను, కార్యకలాపాలను పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. అక్కడ బాంబు దాడులు ఉధృతమయ్యాయని, ఒక పద్దతి ప్రకారం విధ్వంసక చర్యలను చేపడుతున్నారని పేర్కొంది. అంతర్జాతీయంగా విమర్శలు, ప్రతిస్పందనలు ఎదురవకుండా వుండేందుకు మూడోకంటికి తెలియకుండా రాఫా నగర విధ్వంసాన్ని ఇజ్రాయిల్ ప్రారంభించిందని పాలస్తీనా విమర్శించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రాఫా నగరంలో ధ్వంసమైన ప్రాంతాలు, నివాస భవనాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోందని పేర్కొంది. కాగా దాదాపు 10లక్షల మంది పాలస్తీనియన్లు తల దాచుకున్న రాఫా నగరంపై సైన్యంతో దాడి చేయడం ఘోర తప్పిదం కాగలదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు. ఈ నగరంపై దాడి విషయంలో పునరాలోచన చేయాలని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహును కోరారు. కాగా రాఫాపై పదాతిదళం దాడికి ప్రత్యామ్నాయ పద్దతులను పరిశీలించేందుకు ఇజ్రాయిల్ ప్రతినిధి బృందాన్ని వాషింగ్టన్ పంపేందుకు ప్రధాని నెతన్యాహు అంగీకరించారు. ఇప్పటివరకు గాజా యుద్దంలో 31,819మంది మరణించగా, 73,934మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య శాఖ గణాంకాలు పేర్కొన్నాయి.
గాజా ప్రాంతంలోని 70శాతానికి పైగా ప్రజలు ముఖ్యంగా ఉత్తర గాజా ప్రాంతం కరువు బారిన పడే ప్రమాదం పొంచి వుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ హెచ్చరించారు. ఈ విపత్తు పూర్తిగా మానవ కల్పితమేనని, సకాలంలో సరైన చర్యలు తీసుకుంటే నివారించదగ్గదేనని అన్నారు. తాజాగా విడుదలైన గణాంకాలు చూస్తే పరిస్థితి చాలా దారుణంగా వుందని, పశు గ్రాసాన్ని తినడానికి కూడా ప్రజలు వెనుకాడని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. పోషకాహార సమస్య చాలా తీవ్రంగా నెలకొందని తెలిపింది.
కాగా కాల్పుల విరమణ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని కతార్ పేర్కొంది. చర్చల్లో పురోగతి వుంటుందా లేదా అనేది ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందని కతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వ్యాఖ్యానించారు. అయితే రాఫా నగరంపై ఏ దాడి జరిగినా అది మానవ విపత్తుకు దారి తీయగలదని, అప్పుడు చర్చలపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. తాత్కాలికంగా కాల్పుల విరమణ, మానవతా సాయంపైనే ప్రదానంగా దృష్టి సారించి దోహాలో చర్చలు సాగుతున్నాయని తెలిపారు.