– మాజీ ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు
నవతెలంగాణ-కల్చరల్
చరిత్రను వాస్తవిక దృష్టితో చూడాలి.. గగిచిన ఆనవాళ్లు వర్తమానంలో దిశా నిర్దేశం చేస్తాయని మాజీ ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. బ్రిటిష్ వారు మనకు ఇచ్చిపోయిన బానిస చరిత్రనే ఇప్పటి వరకు బోధించారన్నారు. చరిత్రను ఎవరి దృక్పథంలో వారు వ్యాఖ్యానించుకునే శాస్త్రీయత ఉండాలని అన్నారు. ”జస్టిస్ ఆవుల సాంబశివరావు పురస్కారాలు 2023”కు గాను ప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు ఆచార్య వకులాభరణం రామకృష్ణకు, 2024కు గాను మనసు ఫౌండేషన్ స్థాపకులు మన్నం వెంకట రాయుడుకు హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఎన్టీఆర్ కళా వేదికపై వెంకయ్య నాయుడు పురస్కారాలు ప్రదానం చేసి మాట్లాడారు. ఆవుల సాంబశివరావు నిబద్ధత, నిజాయితీ కలిగిన న్యాయమూర్తిగా పేరు పొందారన్నారు. ఆయన నిరాడంబర వ్యక్తిత్వం, తెలుగు భాష సంస్కృతి పట్ల గౌరవం కలవారని చెప్పారు. తెలుగు భాష సంస్కృతి పట్ల యువతలో ఆసక్తి తగ్గుతోందని, నూతన విద్యా విధానం మాతృభాషలో విద్య బోధనకు సముచిత స్థానం ఇచ్చిందని తెలిపారు. ఆంధ్రుల చరిత్రపై లోతైన అధ్యయనం జరిగి సమగ్రంగా రావల్సి ఉందన్నారు. పురస్కార గ్రహీతల్లో ఒకరు చరిత్ర పరిశోధకులు కాగా, మరొకరు తెలుగు భాషా ప్రేమికులు అని అభినందించారు.
తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య కిషన్‌రావు మాట్లాడుతూ.. ఆవుల సాంబశివరావు నిబద్ధత కలిగిన మానవతామూర్తి అన్నారు. మాజీ ఉపాధ్యక్షులు ఆచార్య ఆవుల మంజులత మాట్లాడుతూ.. తెలుగులో తీర్పులు లోకాయుక్తగా తమ తండ్రి ఆవుల సాంబశివరావు ఉన్న సమయంలో ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం పాలకుల విధానాల వల్ల తెలుగే కాదు మరే భాషా సరిగా రాని పరిస్థితి ఏర్పడిందని, భవిష్యత్‌లో అంతరించి పోతున్న భాషల్లో తెలుగు కూడా చేరుతుందన్న ఆందోళన ఉందన్నారు. ఎంతో విజ్ఞాన విషయాలు తెలుగు భాషలో ఉన్నాయని తమ తండ్రి సాంబశివరావు చెప్పేవారని గుర్తు చేశారు. పురస్కార గ్రహీత ఆచార్య వకులాభరణం రామకృష్ణ మాట్లాడుతూ.. భాషా సంస్కృతులు ప్రజల ఆదరణతోనే నిలుస్తాయని, తెలుగు భాష నేర్చుకున్న వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటే.. భాష పది కాలల పాటు ఉంటుందని చెప్పారు. మరొక పురస్కార గ్రహీత వెంకట రాయుడు.. మనసు ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు వివరించారు. రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ స్వాగతం పలికిన కార్యక్రమానికి రెడ్డి శ్యామల వ్యాఖ్యానం చేశారు.