నేను పడిన కష్టాలను మరువను

కరీంనగర్‌ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలోని ఒక నిరుపేద దళిత కుటుంబంలో జన్మించి పేదరికం కారణంగా బాల్యంలో అష్ట కష్టాలు అనుభవించి స్వయంకషితో ఎదిగానని.. అయితే తన బాల్యంలో పేదరికంతో పడ్డ కష్టాలను ఎప్పుటికీ మరువనంటున్న ఖైరతాబాద్‌ జోన్‌ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ శ్యాంసంగ్‌తో అంబేద్కర్‌ జయంతి సందర్భంగా నవతెలంగాణ సీనియర్‌ విలేకరి పులికంటి మల్లికార్జున్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ…
నవతెలంగాణ విలేకరి : నమస్తే శ్యాంసంగ్‌ గారు. మీకు ముందస్తుగా అంబేద్కర్‌ జయంతి శుభాకాంక్షలు
శ్యాంసంగ్‌ : థాంక్యూ వెరీ మచ్‌. అలాగే అందరికీ ముందుగా అంబేద్కర్‌ జయంతి శుభాకాంక్షలు.
నవతెలంగాణ విలేకరి : మీ స్వస్థలము, విద్యాభ్యాస వివరాలు చెప్పిండి..?
శ్యాంసంగ్‌ : మాది స్వస్థలం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని చెల్లూరు దగ్గర ఏరువాక అనే గ్రామం. మాది నిరుపేద దళిత కుటుంబం. మాకు ఏ మాత్రం భూమి లేనందున మా తల్లిదండ్రులు ఊరిలో కూలి పనులు చేస్తుండేవారు. మేము మొత్తం ఆరుగురు సంతానం. నేను చివరి వాడిని. తరువాత ఊరిలో కూలి పనులు దొరకకపోవడంతో నా బాల్యంలోనే మేము మా గ్రామం నుండి హైదరాబాద్‌కు వలస వచ్చాము. ఇక్కడ మా తల్లిదండ్రులు కూలి పనులు చేసి మమ్మల్ని పెంచారు.
నవతెలంగాణ విలేకరి : మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది..?
శ్యాంసంగ్‌ : నేను ఎస్‌ఎస్‌సీ వరకు హైదరాబాద్‌లోని మెహబూబ్‌ కాలేలో చదువుకున్నాను తర్వాత ఎస్పీ రోడ్డులోని గవర్నమెంట్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాను. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ డిగ్రీ పాసయ్యాను.
నవతెలంగాణ విలేకరి : మరి టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి ఎలా వచ్చారు..?
శ్యాంసంగ్‌: నేను డిగ్రీ పూర్తి అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు జీహెచ్‌ఎంసీలో క్లర్క్‌గా పని చేశాను. ఆ తర్వాత నాగోల్‌లోని ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లోమా పూర్తి చేశాను. తర్వాత టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో సెక్షన్‌ ఆఫీసర్‌గా నా కొత్త జీవితాన్ని ప్రారంభించాను.
నవతెలంగాణ విలేకరి : ప్రస్తుతం దళితులపైన వివక్షత గతంతో పోలిస్తే ఎట్లా ఉంది?
శ్యాంసంగ్‌: గతంలో కంటే దళితులపైన వివక్షత చాలావరకు తగ్గిందని నా అభిప్రాయం. దీనికి దళితులలో వచ్చిన చైతన్యం ఒక కారణం. అలాగే నేటి రోజులలో దళితులకు విద్య ప్రాముఖ్యత అర్థం అయింది. దాని వలన చాలామంది దళితులు కష్టపడి ప్రభుత్వ ప్రయివేటు రంగాలలో ఉన్నత ఉద్యోగాలు సాధించారు, సాధిస్తున్నారు. ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. దీంతో వివక్షత తగ్గింది కానీ పూర్తిగా అంతం కాలేదు.
నవతెలంగాణ విలేకరి: మరి వివక్షత పూర్తిగా అంతం కావాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏమిటని మీ అభిప్రాయం.
శ్యాంసంగ్‌: సమాజంలో దళితుల పట్ల వివక్షత పోవాలంటే ముందుగా ప్రతి ఒక్కరూ విద్య ప్రాముఖ్యతను గుర్తించాలి. ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించి ఆయా రంగాలలో ఉన్నత స్థానాలకు ఎదగాలి. సమాజం మనం ఉన్నత స్థానంలో ఉంటే తప్పక మనల్ని గౌరవిస్తుంది. మరి ఆ స్థానానికి చేరుకోవాలంటే ప్రభుత్వం తనవంతుగా ప్రతీ ఒక్కరికి బెస్ట్‌ ఎడ్యుకేషన్‌ ఇవ్వడానికి తోడ్పాటు ఇవ్వాలి. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వేరు వేరు హాస్టల్‌ లు అని కాకుండా కుల వివక్షత లేకుండా అందరికీ ఓకే ప్లాట్‌ఫామ్‌ పైన హాస్టల్స్‌ను ఏర్పరచాలి. వీటి ద్వారా వివక్షతను చాలా వరకు తగ్గించవచ్చని నా వ్యక్తిగత అభిప్రాయం.
నవతెలంగాణ విలేకరి: మీరు మీ ఉద్యోగ జీవితంలో ఏనాడైనా వివక్షత ఎదుర్కొన్నారా?
శ్యాంసంగ్‌: అదష్టవశాత్తు లేదనే చెప్పాలి. నేను నా డ్యూటీని నిబద్ధతతో చేస్తాను. అందువలన కావచ్చు ఉన్నతాధికారులు నన్ను ఎప్పుడూ గుర్తించి గౌరవించారు. నా సహ ఉద్యోగులు నాతో స్నేహపూర్వకంగా ఉన్నారు.
నవతెలంగాణ విలేకరి : ఉద్యోగ జీవితంలో మీకు తప్తినిచ్చిన విషయాలు
శ్యాంసంగ్‌: మన హైదరాబాద్‌ ట్రాఫిక్‌ కష్టాల గురించి మనందరికీ బాగా తెలుసు. ట్రాఫిక్‌ లో ఇరుక్కపోతే నరకం చూస్తాము. ఇలాంటి ట్రాఫిక్‌ కష్టాలు తొలగించడానికి ప్రభుత్వం చేపట్టిన పథకాలలో భాగంగా సీతాఫల్మండి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణంలో స్థల సేకరణ ఆరు నెలలలో పూర్తిచేసి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసాం. వైఎంసీఏ నుండి బేగంపేటకు రోడ్డు వెడల్పును సంవత్సర కాలంలో పూర్తి చేశాను. దీనిలో భాగంగా ఆనంద్‌ థియేటర్‌ దగ్గర ఒక చిన్న గుడి రోడ్డు మధ్యలో రావడంతో రోడ్డు విస్తరణ పని ఆలస్యం కాసాగింది. దాంతో నేను ఆ గుడి యజమానితో మాట్లాడి వ్యక్తిగతంగా నష్టపరిహారం చెల్లించి ఆ గుడిని రోడ్డు పక్కన నిర్మించాం. జూబ్లీహిల్స్‌ జంక్షన్‌ నుంచి మాదాపూర్‌ వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని అధికారులమంతా టీం వర్క్‌ చేసి మూడు నెలల్లోనే పూర్తి చేసాము. ఈ విధంగా నగర ప్రజల ట్రాఫిక్‌ కష్టాలను తొలగించడంలో నా పాత్ర నాకు చాలా సంతోషాన్ని, తప్తిని ఇచ్చింది.
నవతెలంగాణ విలేకరి : మీరు ఈ స్థితికి చేరుకోవడానికి మీకు ఎలాంటి ప్రోత్సాహం లభించింది.
శ్యాంసంగ్‌: నా ఉద్యోగ జీవితం తొలినాళ్లలో జీహెచ్‌ఎంసీలో అప్పటి ఉన్నతాధికారి ధనుంజయ రెడ్డి ఐఏఎస్‌, అప్పటి మా సీసీసీ పురుషోత్తం రెడ్డి నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అలాగే నా వ్యక్తిగత జీవితంలో నా భార్య నాకు ఎంతో తోడ్పాటును, సహాయ సహకారాలను అందించారు.
నవతెలంగాణ విలేకరి : చివరగా మీ జీవితంలో ఇంకా ఏమి సాధించాలనుకుంటున్నారు?
శ్యాంసంగ్‌: నా జీవితంలో ప్రత్యేకంగా సాధించాలని నేను ఏమీ అనుకోవడం లేదు. కానీ నా జీవితంలో నేను అనుభవించిన పేదరికం తద్వారా వచ్చే కష్టాలను ఎన్నటికీ మరువలేను. కాబట్టి పేదలకు సహాయం చేయడం నాకు ఎంతో తప్తిని ఇస్తుంది.

Spread the love