– 14న కూకట్‌పల్లిలో ‘మేమంతా సిద్ధం’ వైయస్‌ఆర్‌సీపీ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ-బంజారాహిల్స్
సమసమాజ పాలన జగన్‌తోనే సాధ్యమని వైఎస్‌ఆర్‌సీపీ అభిమానుల ఆత్మీయ సమ్మేళన నిర్వహణ కమిటీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివద్ది, సంక్షేమ పాలన కొనసాగాలంటే జగన్‌తోనే సాధ్యమని.. వైయస్‌ఆర్‌సీపీ అభిమానులు జగన్ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ”నగరంలో స్థిరపడ్డ ఏపీ వాసులు మరోసారి జగన్‌ను ముఖ్యమంత్రిని చేద్దాం” అంటూ ఈనెల 14న కూకట్‌పల్లి ఎన్. కె. ఎన్.ఆర్ గార్డెన్స్‌లో వైయస్‌ఆర్‌సీపీ అభిమానుల ఆత్మీయ సమ్మేళనని నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కమిటీ నాయకులు రాఘవ, జయవర్ధన్ రెడ్డి, నౌరోజిరెడ్డిలతో కలిసి శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సుబ్రహ్మణ్యం రెడ్డి ఆవిష్కరించి ప్రసంగించారు. వారు మాట్లాడుతూ పేదల జీవితాలలో వెలుగులు రావాలన్నా, సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలన్నా తిరిగి జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. విద్యా వైద్య రంగాలలో జగన్ తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఏపీలోని ప్రతీ కుటుంబం సంక్షేమ పథకాలు అందుకొని సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రతీ పేదవాడి కండ్లల్లో ఆనందం కోసం నిరంతరం శ్రమించే జగన్ కోసమే ఈ సభను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్వరాష్ట్రంలో జరగనున్న ఎన్నికల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. టార్గెట్ 175/175 అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, చంద్రారెడ్డి, సదాశివరెడ్డి, సురేంద్ర, శ్రీనివాస్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.