వరి ధాన్యం టెండర్లలో భారీ కుంభకోణం

– రెండు రోజుల్లో ఈడీ, సీబీఐకి ఫిర్యాదు  మాజీ ఎమ్మెల్యే ఏ .జీవన్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వరి ధాన్యం టెండర్లలో రూ.1,450 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఏ.జీవన్‌ రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బయట మార్కెట్లో ఉన్న ధరకన్నా తక్కువగా రూ.1,600కు కాంగ్రెస్‌ ప్రభుత్వం అమ్మిందని విమర్శించారు. ఈ కుంభకోణంపై రెండు రోజుల్లో ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేయనున్నుట్టు వెల్లడించారు. వడ్ల కొనుగోలుకు కేంద్రం కమీషన్‌ కింద ఇచ్చే డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయనే విషయంపై తన వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. ఈ అవినీతిలో మోడీ సర్కార్‌ జోక్యం చేసుకొని దర్యాఫ్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయంలో వడ్లను ఎగుమతి చేస్తే, .రేవంత్‌ రెడ్డి సర్కార్‌ హయాంలో అవినీతి కరెన్సీని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ ఫిరాయింపులపై నీతులు చెప్పిన రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.

Spread the love