పదేండ్లుగా రాష్ట్రానికి కేంద్రం అన్యాయం

The center has been unfair to the state for decades– అమలుచేయని హామీలపై చర్చకు బీజేపీ సిద్దమా..?
– మంత్రి పొన్నం ప్రభాకర్‌
– కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన దీక్ష
నవతెలంగాణ – కరీంనగర్‌
కేంద్రంలో పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్రానికి చేసిన అన్యాయం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆదివారం కరీంనగర్‌ జిల్లా కేంద్రలోని కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ నిరసన దీక్ష చేశారు. మొదట అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజరు, బీఆర్‌ఎస్‌ నాయకులు కేటీఆర్‌.. కాంగ్రెస్‌ గ్యారంటీల గురించి అడుగుతున్నారని, తాము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయిందని, మీరు పదేండ్లు అధికారంలో ఉండి ఎన్ని హామీలను అమలుచేశారని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎక్కడా అమలుచేయలేదని, దానిపై బీజేపీ నాయకులు చర్చకు సిద్దమా అని సవాల్‌ విసిరారు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొచ్చారని, దానిపై ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు దీక్ష చేయగా, 1000మంది రైతులు చనిపోయారని, అయినా బీజేపీ స్పందించలేదని, ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని రైతుల గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల గురించి పార్లమెంటులో మోడీ అవమానకరంగా మాట్లాడుతుంటే పార్లమెంటులో ఉండి నోరు ఎందుకు మెదపలేదని బండి సంజరుని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ విభజన హామీలు అమలు కాలేదని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వస్త్ర పరిశ్రమపై 12శాతం జీఎస్టీ వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజరును అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి కారణం తాను చేసిన అవినీతి కాదా అని ప్రశ్నించారు. శ్రీరాముని పేరుతో ఇంటింటికి అక్షింతలు పంచుతూ దేవుడి పేరుతో ఓట్లు అడిగి రాజకీయం చేయడం ఎంతవరకు సబబు అని అన్నారు. తాను హిందువునని చెప్పుకునే బండి సంజరుకు.. ముక్కా చుక్కా లేనిదే రోజు గడవదని ఆరోపించారు. దేశంలోని అన్ని దేవాలయాలకు నిధులు ఇస్తే ఉమ్మడి జిల్లాలోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం దేవాలయాలకు బండి సంజరు ఎందుకు నిధులు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఈ నిరసన దీక్షలో మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్‌, కోడూరు సత్యనారాయణగౌడ్‌, జిల్లా ఇన్‌చార్జి నరసింహారెడ్డి, నాయకులు పురుమల్ల శ్రీనివాస్‌, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వైద్యుల అంజన్‌ కుమార్‌, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love