తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌కు స్థానం లేదు

తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌కు స్థానం లేదు– మతిభ్రమించి కేసీఆర్‌, కేటీఆర్‌ అసత్యాలు
– రఘువీర్‌ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలి
– రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం ఖాయం : మిర్యాలగూడలో పార్లమెంట్‌ కాంగ్రెస్‌ సన్నాహక సమావేశంలో ఉత్తమ్‌, కోమటిరెడ్డి, జానారెడ్డి
నవతెలంగాణ- మిర్యాలగూడ
”బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యారు.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ గాలి వీస్తోంది.. రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం.. తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌కు స్థానం లేదు.. కేసీఆర్‌, కేటీఆర్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారు” అని భారీ నీటిపారుదల, సివిల్‌ సప్లై శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎన్‌ఎస్పీ క్యాంపులో మంగళవారం నిర్వహించి నియోజకవర్గస్థాయి పార్లమెంట్‌ సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. ఈ ఎన్నికల్లో మోడీ ఓడిపోతారన్న భయంతోనే 400 సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని, బీఆర్‌ఎస్‌ ప్రజలకు దూరమైందని.. ఆ పార్టీల పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిం దని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అత్యధిక పార్లమెంట్‌ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం రూపాయి పని కూడా చేయలేదని, ఒక ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర విభజన హామీలను మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ పని ఖతం అయిందని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత జైలుకు పోవడంతో తండ్రి కేసీఆర్‌, సోదరుడు కేటీఆర్‌కు మతిభ్రమించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీలోకి పోతారని అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పొద్దున లేచింది మొదలు రాత్రి వరకు రేవంత్‌ రెడ్డిని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కుర్చీ వేసుకుని కూర్చుని జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న కేసీఆర్‌.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేనందున మానసిక స్థితి కోల్పోయి అవాకులు చవాకులు పేల్చుతున్నారని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒక్క పని కూడా చేయలేదు కానీ ఇప్పుడు అహంకారంతో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు.జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, మిర్యాలగూడ నియోజకవర్గంలో త్వరలోనే అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి రఘువీర్‌ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే కుందూరు జై వీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భారతీ రాగ్యా నాయక్‌, ఎంపీ అభ్యర్థి కుందూర్‌ రఘువీర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ నాయక్‌, నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love