– పునరావృతం కాకుండా చూడండి
– డీజీపీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు బీఆర్‌ఎస్ నేతలు బుధవారం హైదరాబాద్‌లో డీజీపీ రవి గుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విధానాలను, పనితీరును ప్రశ్నించిన వారిపై అసహనంతో అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో బీఆర్‌ఎస్‌కు చెందిన కార్యకర్త సల్వాజీ మాధవ రావు, ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నాడనే కారణంతో సొగాలి తిరుపతి అనే రౌడీ షీటర్ ద్వారా హత్యాయత్నం చేయించారని తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోకుండా బాధితుడిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. కింది స్థాయిలో కొంతమంది పోలీస్ అధికారులు ప్రభుత్వానికి వంత పాడుతూ తమ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వివరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని వారు డీజీపీకి విజ్ఞప్తి చేశారు.