ఐపీఎల్‌ టికెట్లకు ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

Assets for IPL tickets Must sell!– ప్రాంఛైజీల ఇష్టారాజ్యంగా టికెట్‌ ధరలు
– బెంగళూర్‌లో గరిష్ట టికెట్‌ ధర రూ.52,938
– హైదరాబాద్‌లో కార్పొరేట్‌ టికెట్‌ ధర రూ.30,000
జెంటిల్‌మెన్‌ గేమ్‌ క్రికెట్‌ను ఫక్తు కార్పోరేట్‌ క్రీడగా మార్చింది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌). క్రికెట్‌ కార్పోరేటీకరణతో బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డుగా ఎదిగింది. కానీ ఐపీఎల్‌ మ్యాచ్‌ టికెట్ల ధరలు ప్రాంఛైజీల కాసుల కక్కుర్తితో ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐపీఎల్‌ టికెట్ల ధరలు, అమ్మకం అంశం ప్రాంఛైజీలకు అప్పగించటంతో.. అభిమాన క్రికెటర్ల ఆట చూసేందుకు అభిమానులు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది.
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మ్యాచ్‌ను స్టేడియంలో చూసేందుకు టికెట్‌ ధర ఎంత వరకు ఉంటుందని అనుకుంటారు? మహా అయితే.. రూ. ఐదు వేలు. స్టేడియంలో ఏదో ఒక గ్యాలరీలో కూర్చుని చూసేందుకు కనీసం రూ.500 ఉంటే సరిపోతుందని అందరూ అనుకుంటారు. ఐపీఎల్‌ రాకతో ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఐపీఎల్‌ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు ఆస్తులు అమ్ముకోవాల్సిందే. నిజమే.. ఐపీఎల్‌ ప్రాంఛైజీలు టికెట్ల ధరలను చివరకు ఆ స్థాయికి తీసుకెళ్లాయి. ఐపీఎల్‌ నిబంధనల్లో భాగంగా టికెట్ల ధరల నిర్థారణ, అమ్మకం పూర్తిగా ప్రాంఛైజీల అంశం. ప్లే ఆఫ్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లను మాత్రమే బీసీసీఐ స్వయంగా పర్యవేక్షిస్తుంది. లీగ్‌ దశ మ్యాచుల టికెట్ల ధరలను ఆతిథ్య ప్రాంఛైజీ నిర్ణయిస్తుంది. టికెట్ల అమ్మకంతో భారీగా ఆదాయం ఆర్జించాలనే లక్ష్యం పెట్టుకున్న ప్రాంఛైజీలు ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ మ్యాచ్‌ను చిన్నస్వామి స్టేడియంలో చూడాలని అనుకుంటే గరిష్టంగా రూ.52,938 వెచ్చించాల్సిందే. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ చెత్త ప్రదర్శన చేస్తున్నా.. విపరీత అభిమాన గణం అండతో స్టేడియం నిండిపోతుంది. మైదానంలో జట్టు చెత్త ప్రదర్శన చేసినా.. అభిమాన సంద్రంతో ఆర్సీబీ యాజమాన్యం ఖజానా నింపుకునే పనిలో నిమగమైంది.
డైనమిక్‌ ధరలు : సాధారణంగా క్రికెట్‌ మ్యాచులకు టికెట్ల ధరలను ముందుగానే నిర్ణయిస్తారు. ఏ విభాగంలో టికెట్‌కు ఎంత ధర అనేది వెల్లడిస్తారు. కానీ ఐపీఎల్‌ ప్రాంఛైజీలు విమానయాన సంస్థల బాటలో నడుస్తున్నాయి. విమానం టికెట్‌ ధరలు డిమాండ్‌ను బట్టి మారుతుంటాయి. అధిక డిమాండ్‌ ఉంటే ధరలు అంతే అధికంగా ఉంటాయి. డిమాండ్‌ తగ్గిపోతే.. టికెట్‌ ధరలు సైతం నేలకు దిగుతాయి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ప్రాంఛైజీ సహా మరికొన్ని డైనమిక్‌ ధరలను అనుసరిస్తున్నాయి. ఆర్సీబీ యాజమాన్యం గరిష్ట టికెట్‌ ధర రూ.42,350గా నిర్ణయించింది. కానీ మ్యాచ్‌కు ముందు రోజు వరకు డిమాండ్‌ పెరగటంతో టికెట్‌ ధరలు సైతం అమాంతం పెరుగుతుంది. ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియంలో గరిష్ట టికెట్‌ ధర రూ.53 వేల వరకు చేరుకుంది.
కాసుల కక్కుర్తి : ఐపీఎల్‌ ప్రాంఛైజీలకు టికెట్ల అమ్మకం నుంచి వచ్చే ఆదాయం ప్రధాన ఆదాయ వనరు ఏమాత్రం కాదు. ప్రసారదారు, సెంట్రల్‌ పూల్‌ (బీసీసీఐ) నుంచి ప్రాంఛైజీలు ప్రధానంగా ఆదాయం ఆర్జిస్తాయి. అంతర్గత ఆదాయ మార్గాలను సైతం ప్రాంఛైజీలు బలోపేతం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే కిట్‌ స్పాన్సర్‌, టికెట్‌ అమ్మకాలపై దృష్టి సారించాయి. మొహాలి, చంఢగీడ్‌ వంటి నగరాల్లో టికెట్‌ ధరలు సాధారణంగా ఉండగా.. మెట్రోపాలిటన్‌ నగరాల్లో టికెట్‌ ధరలు అధికంగా ఉన్నాయి. టికెట్‌కు ఎంత ధరైనా వెచ్చిస్తారనే నమ్మకంతోనే ప్రాంఛైజీలు అధిక ధరలకు టికెట్లను విక్రయిస్తున్నాయి. ఇక నగరాలతో సంబంధం లేకుండా ఎం.ఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వంటి దిగ్గజ క్రికెటర్లు ఆడుతున్న మ్యాచ్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో సహజంగానే ఆ మ్యాచులకు టికెట్ల ధరలను సైతం పెంచుతున్నారు. ఈవెనింగ్‌ గేమ్‌తో పోల్చితే నైట్‌ గేమ్‌కు టికెట్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయి.
అయినా.. సౌకర్యాలేవీ : రూ. వేలు వెచ్చించి ఐపీఎల్‌ టికెట్‌ కొనుగోలు చేసిన అభిమానులకు మైదానంలో నిరాశే ఎదురవుతుంది. ప్రాంఛైజీలు, రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు అభిమానులకు సరైన సౌకర్యాలు అందించటం లేదు. కొన్ని స్టేడియాల్లో సరైన ‘వ్యూ పాయింట్స్‌’ లేవు. అభిమానులకు అడ్డుగా తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలు సహా ప్రసారదారు కెమెరాలు అడ్డుగా వస్తున్నాయి. స్టేడియంలో తాగునీరు, ఆహార పదార్థాల ధరలు సైతం అధికంగా ఉంటున్నాయి. మరుగుదోడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు కొన్ని సార్లు నీటి సదుపాయం ఉండటం లేదు. కార్పోరేట్‌ టికెట్లు కొనుగోలు చేసిన వారికి సైతం చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. రూమ్‌లో ఏసీ పని చేయకపోవటం, హాస్పిటాలిటీ ఆధ్వానంగా ఉండటంతో సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు ఫిర్యాదు చేస్తున్నారు. అయినా, అభిమానులకు కనీస సౌకర్యాలు కల్పించటంపై ప్రాంఛైజీలు అశ్రద్ధ చేస్తున్నాయి.
అభిమానుల ఆగ్రహం : ఐపీఎల్‌ టికెట్‌ ధరలను అమాంతం పెంచటంపై సగటు క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్‌ ధరల అంశంలో బీసీసీఐ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ప్రాంఛైజీలకు ఇష్టం వచ్చిన ధరలకు టికెట్ల అమ్మకుండా.. బీసీసీఐ స్వయంగా టికెట్‌ ధరలను నిర్ణయించాలని అడుగుతున్నారు. టికెట్ల అమ్మకం అంశంలోనూ ప్రాంఛైజీలు పూర్తి పారదర్శకత వహించేలా బోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.
మన దగ్గరా ఇదే దుస్థితి
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సైతం టికెట్లను భారీ ధరలకు అమ్ముతుంది. ఉప్పల్‌ స్టేడియంలో కనీస టికెట్‌ ధర రూ.750 కాగా… గరిష్ట టికెట్‌ ధర రూ.30 వేలు. నార్త్‌, సౌత్‌ పెవిలియన్‌ టెర్రస్‌ టికెట్లను తక్కువ ధరలకు విక్రయిస్తారు. కానీ ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను అందుబాటులో ఉంచటం లేదు. కాంప్లిమెంటరీ పాసుల రూపంలో ప్రభుత్వ విభాగాలు, అధికారులు, హెచ్‌సీఏకు పంచేందుకు ప్రాంఛైజీ ఈ టికెట్లను నామమాత్రంగా అందుబాటులో ఉంచుతుంది. దీంతో సగటు క్రికెట్‌ అభిమాని టికెట్‌ కొనే పరిస్థితి ఉండటం లేదు. వెస్ట్‌, ఈస్ట్‌ స్టాండ్స్‌ టికెట్లను సైతం ప్రాంఛైజీ ఆన్‌లైన్‌లో తక్కువ మొత్తంలోనే ఉంచుతుందనే ఆరోపణలు ఉన్నాయి. అభిమానులకు సకల సౌకర్యాలు కల్పించే చెన్నై చెపాక్‌ స్టేడియంలో కనీస టికెట్‌ ధర రూ.1700, గరిష్ట టికెట్‌ ధర రూ.6 వేలు. మరి అభిమానులకు కనీస సౌకర్యాలు కల్పించని ఉప్పల్‌ స్టేడియంలో ఎందుకు టికెట్‌కు రూ.30 వేలు వెచ్చించాలని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Spread the love