అమీతుమీ

– సిరీస్‌ సమంపై టీమ్‌ ఇండియా గురి
– చిరస్మరణీయ సిరీస్‌ వేటలో కరీబియన్లు
– భారత్‌, విండీస్‌ నాల్గో టీ20 నేడు
– రాత్రి 8 నుంచి డిడిస్పోర్ట్స్‌లో..
భారత్‌, వెస్టిండీస్‌ టీ20 సవాల్‌ అమెరికాకు చేరుకుంది. కరీబియన్‌ గడ్డపై మూడు మ్యాచులు ముగియగా ఆతిథ్య విండీస్‌ 2-1తో ముందంజ వేసింది. అమెరికాలో మంచి రికార్డున్న టీమ్‌ ఇండియా చివరి రెండు మ్యాచుల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. సమంపై భారత్‌, వశంపై విండీస్‌ ఆశలు పెట్టుకోగా.. వరుణుడు సైతం స్టేడియంలోకి వచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు!.
భారత్‌, వెస్టిండీస్‌ నాల్గో టీ20 పోరు నేడు.
నవతెలంగాణ-లాడర్‌హిల్‌
తొలి రెండు మ్యాచుల్లో ఓటమి నుంచి పుంజుకున్న టీమ్‌ ఇండియా కీలక మూడో మ్యాచ్‌లో నెగ్గి టీ20 సిరీస్‌లో ఆశలు సజీవంగా నిలుపుకుంది. గత మ్యాచ్‌లో ఏకపక్ష విజయం హార్దిక్‌ సేనను రెట్టింపు ఉత్సాహంలో పడేసింది. కీలక ఆటగాళ్లు ఫామ్‌లోకి రావటంతో నేడు లాడర్‌హిల్‌ టీ20లో భారత్‌ హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. పొట్టి ఫార్మాట్‌లో దీటైన కరీబియన్‌ జట్టు నిర్మాణం దిశగా సాగుతున్న పావెల్‌.. 2017 తర్వాత విండీస్‌కు వరుసగా రెండో టీ20 సిరీస్‌ విజయాన్ని అందించేందుకు సిద్ధమవుతు న్నాడు. హార్దిక్‌ సారథ్యంలో ఒక్క సిరీస్‌ ఓడని టీమ్‌ ఇండియా.. నేడు నాల్గో టీ20లో విండీస్‌ను ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి.
రేసు ఆసక్తికరం : ఫోకస్‌ బ్యాటర్ల వైఫల్యం నుంచి ఆసియా, వరల్డ్‌కప్‌ జట్టు కూర్పుపైకి మళ్లింది. యువ బ్యాటర్‌ తిలక్‌ వర్మ మిడిల్‌ ఆర్డర్‌లో నిర్మాణాత్మక ఇన్నింగ్స్‌లతో అందరి మెప్పు పొందుతున్నాడు. వన్డే జట్టులో సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజు శాంసన్‌లకు గట్టి పోటీదారుగా నిలిచాడు!. దీంతో తాజా సిరీస్‌లో మెరుపులు.. వన్డే జట్టు కూర్పులో ప్రకంపనలు సృష్టించనుంది. సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యఫామ్‌లోకి రావటం, తిలక్‌ వర్మ జోరందుకోవటం భారత్‌కు అనుకూలం. టాప్‌ ఆర్డర్‌లో యశస్వి జైస్వాల్‌కు తోడు శుభ్‌మన్‌ గిల్‌ మెరిస్తే భారత్‌కు తిరుగుండదు. సంజు శాంసన్‌ సత్తా చాటిల్సిన సమయం మించిపోతుండగా.. అక్షర్‌ పటేల్‌ సైతం బ్యాట్‌తో మెరవాలని జట్టు కోరుకుంటుంది. కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వెంద్ర చాహల్‌ స్పిన్‌ జోడీ మరోసారి భారత్‌కు కీలకం. ముకేశ్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌లు కొత్త బంతి, డెత్‌ ఓవర్లలో సవాల్‌ స్వీకరించాల్సి ఉంది.
విండీస్‌ ఉత్సాహంగా : భారత్‌తో టీ20 సిరీస్‌ ఫలితాన్ని మిడిల్‌ ఓవర్లలో షిమ్రోన్‌ హెట్‌మయర్‌, నికోలస్‌ పూరన్‌లు స్పిన్‌ ఎదుర్కొవటంపైనే ఆధారపడి ఉంటుందని ఆ జట్టు కెప్టెన్‌ పావెల్‌ ఆరంభంలోనే చెప్పాడు. నికోలస్‌ పూరన్‌ ధనాధన్‌ మోత మోగిస్తున్నాడు. కానీ షిమ్రోన్‌ హెట్‌మయర్‌ విఫలమవుతున్నాడు. వన్డేల్లో 11, 9, 4 పరుగులే చేసిన హెట్‌మయర్‌.. టీ20ల్లో 10, 22, 9 పరుగులే సాధించాడు. దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను 2-1తో గెల్చుకున్న కరీబియన్లు.. 2017 తర్వాత వరుసగా రెండో సిరీస్‌ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఆతిథ్య జట్టు ప్రణాళికల ప్రకారం నికోలస్‌కు తోడుగా హెట్‌మయర్‌ సైతం మెరిస్తే బ్యాటింగ్‌లో ఎదురుండదు. కెప్టెన్‌ పావెల్‌ గత మ్యాచ్‌లో ఫామ్‌ సాధించాడు. టాప్‌ ఆర్డర్‌లో కైల్‌ మేయర్స్‌, బ్రాండన్‌ కింగ్స్‌లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయటం లేదు. మూడో స్థానంలో చార్లెస్‌ సైతం నిరాశపరుస్తున్నాడు. ఈ ముగ్గురు సైతం గాడిలో పడాలని కరీబియన్లు కోరుకుంటున్నారు. జేసన్‌ హోల్డర్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే తుది జట్టులో రోస్టన్‌ ఛేజ్‌ స్థానంలో ఆడనున్నాడు. ఫెఫర్డ్‌, మెక్‌కారు, అల్జారీ జొసెఫ్‌లు అంచనాల మేరకు రాణిస్తున్నారు.
పిచ్‌ రిపోర్టు
కరీబియన్‌ పిచ్‌లపై స్వల్ప స్కోర్ల థ్రిల్లర్స్‌ చూశాం. కానీ లాడర్‌హిల్‌ భారీ స్కోర్లకు వేదిక. ఇక్కడ భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసిన రెండు సార్లు 191, 188 పరుగులు చేసింది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే వీలుంది. ఇక్కడ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు 11 (13 మ్యాచుల్లో)మ్యాచుల్లో విజయాలు సాధించింది. భారత్‌, విండీస్‌ ఇక్కడ ఆరు మ్యాచుల్లో తలపడగా నాలుగింట భారత్‌ గెలుపొందగా, ఓ మ్యాచ్‌ విండీస్‌ నెగ్గింది. వర్షంతో ఓ మ్యాచ్‌ రద్దయ్యింది.
వర్షం సూచన
తొలి మూడు టీ20లకు సైతం వర్షం సూచనలు కనిపించినా.. వరుణుడు అంతరాయం కలిగించలేదు. నాల్గో టీ20కి సైతం వర్షం సూచనలు ఉన్నాయి. మ్యాచ్‌ రోజు 47 శాతం వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం నేపథ్యంలో ఛేదనకు మొగ్గు చూపే అవకాశాలు సైతం లేకపోలేదు. అమెరికాలో వరుణుడు ఆటంకం కలిగిస్తాడేమో చూడాలి.
తుది జట్లు (అంచనా)
భారత్‌ : యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌, యుజ్వెంద్ర చాహల్‌.
వెస్టిండీస్‌ : కైల్‌ మేయర్స్‌, బ్రాండన్‌ కింగ్‌, జాన్సన్‌ ఛార్లెస్‌, నికోలస్‌ పూరన్‌ (వికెట్‌ కీపర్‌), రోవ్‌మాన్‌ పావెల్‌ (కెప్టెన్‌), షిమ్రోన్‌ హెట్‌మయర్‌, జేసన్‌ హోల్డర్‌, రోమారియో షెఫర్డ్‌, అకీల్‌ హోసేన్‌, అల్జారీ జొసెఫ్‌, ఒబెడ్‌ మెక్‌కారు.

Spread the love