బీఈడీ అభ్యర్థులకు నిరాశ

– ఎస్జీటీ పోస్టులకు డీఈడీ అభ్యర్థులే అర్హులు
– సుప్రీంకోర్టు సంచలన తీర్పు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు డీఈడీ అభ్యర్థులే అర్హులని సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పేపర్‌-1 డీఈడీ అభ్యర్థులు, పేపర్‌-2 మాత్రమే బీఈడీ అభ్యర్థులు రాయాలని స్పష్టం చేసింది. దీంతో బీఈడీ అభ్యర్థులు నిరాశలో ఉన్నారు. రాజస్థాన్‌కు సంబంధించిన ఎస్జీటీ వర్సెస్‌ బీఈడీ కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పును వెల్లడించింది. అయితే ఈ తీర్పు అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని ప్రకటించింది. అయితే ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అర్హులేనని గతంలో జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకనుగుణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి అర్హత కల్పించింది. దాని ప్రకారం 2017లో చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. అయితే బీఈడీ అభ్యర్థుల ఆశలపై సుప్రీం కోర్టు తాజా తీర్పుతో నీళ్లు చల్లింది.

Spread the love