దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరగాలి

–  సమాజ ఆలోచనలోనూ మార్పు రావాలి
–  మహిళ బిల్లును ఎందుకు తీసుకు రావటం లేదు? : పుస్తకావిష్కరణ సభలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
న్యూఢిల్లీ: దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళలు రాణించాలంటే సమాజం ఆలోచనల్లోనూ మార్పు రావాల్సిన అవసరముందన్నారు. ప్రముఖ పాత్రికేయురాలు నిధి శర్మ రాసిన ‘షి ద లీడర్‌: విమెన్‌ ఇన్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌’ పుస్తకావిష్కరణ శుక్రవారం నాడిక్కడ జరిగింది. సామాజిక సమానత, మహిళ అభ్యున్నతి సమాజంలోని వివిధ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిన సోనియా గాంధీ, సుచేత కృపలాని, జయలలిత, వసుంధర రాజే, షీలా దీక్షిత్‌, మాయావతి, ప్రతిభా పాటిల్‌, సుష్మా స్వరాజ్‌, మమతా బెనర్జీ, బృందాకరత్‌, అంబికా సోనీ, స్మృతీ ఇరానీ, సుప్రియా సూలే, కనిమొళి, కల్వకుంట్ల కవిత తదితరుల కథనాలను పుస్తకంలో పొందుపర్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్‌ బ్రిట్టాస్‌, కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారి, రచయిత నిధి శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత పుస్తకావిష్కరణ అనంతరం మాట్లాడుతూ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో అందరి ఇండ్లలో ఏం జరుగుతుందో రాజకీయ పార్టీలోనూ అదే జరుగుతుందన్నారు. మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలనే తప్పనిసరి నిబంధన లేనంత వరకు పార్టీల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతుందని అన్నారు. జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు 50 శాతం కాకుండా 33 శాతం రిజర్వేషన్‌ ఎందుకన్న చర్చ సాగుతున్నదనీ, అయితే ఎక్కడో ఒక చోట అడుగు ముందుకు పడాలన్నారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్‌ చట్టాల పేర్లను మార్చుతూ కొత్త చట్టాలు తెచ్చిన కేంద్రం, మహిళా బిల్లు ఎందుకు తీసుకురావడం లేదని కవిత ప్రశ్నించారు. కార్పొరేట్‌ రంగంలోనూ బోర్డు రూముల్లో మహిళల ప్రాతినిధ్యం స్వల్పంగా ఉందని, వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు. పురుషుల వ్యాపారాలతో పోల్చితే మహిళలు చేస్తున్న వ్యాపారానికి బ్యాంకులు తక్కువ రుణాలు ఇస్తున్నాయని విమర్శించారు. దేశంలో 29 శాతం మహిళలు మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారనీ, ఇలా అయితే దేశం వృద్ధి చెందలేదని అన్నారు. న్యాయ వ్యవస్థలో ఎంత మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని ప్రశ్నించారు.

Spread the love